ప్రభువు శోభితగుణములు

111 1.       మీరు ప్రభువును స్తుతింపుడు.

                              సత్పురుషులు కూడిన సమాజమున

                              పూర్ణహృదయముతో నేను ప్రభువునకు

                              కృతజ్ఞతాస్తుతులు అర్పింతును.

2.           ప్రభువు కార్యములు మహత్తరమైనవి.

               వానిపట్ల ప్రీతికలవారు వానిని అర్థము చేసికొందురు

3.           ప్రభువు చెయిదములెల్ల

               కీర్తిప్రాభవములతో నిండియుండును.

               అతని నీతి శాశ్వతముగా నిల్చును.

4.           ఆయన తన అద్భుతకార్యములను

               మనము జ్ఞాపకము చేసికొనునట్లు చేయును. ప్రభువు దయ, నెనరు కలవాడు.

5.           తనపట్ల భయభక్తులు గలవారికి

               ఆయన కడుపునిండ కూడుపెట్టును.

               ఆయన తన నిబంధనను ఏనాడును మరచిపోడు.

6.           ఆయన అన్యజాతుల భూములను

               తన ప్రజలకు ఇచ్చి

               తన మహాశక్తిని వారికి వెల్లడిచేసెను.

7.            ఆయన కార్యములందెల్ల నమ్మదగినతనమును,

               న్యాయమును గోచరించును.

               ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి.

8.           అవి శాశ్వతముగా ఉండిపోవును.

               సత్యముతోను, యదార్ధతతోను

               ప్రభువు వానిని దయచేసెను.

9.           ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను.

               వారితో శాశ్వతమైన నిబంధన చేసికొనెను.

               ఆయన నామము గంభీరమైనది.

10.         దైవభీతి విజ్ఞానమునకు మొదిమెట్టు.

               ఆ గుణమును అలవరచుకొనువారు వివేకవంతులు

               ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము