రాజైన ప్రభువునకు స్తుతి గీతము
దావీదు స్తుతికీర్తన
145 1. నా రాజువైన ప్రభూ!
నేను నీ మాహాత్మ ్యమును స్తుతింతును.
నీ నామమును సదా సన్నుతింతును.
2. ప్రతిదినము నిన్ను వినుతింతును.
కలకాలము నీ నామమును ప్రణుతింతును.
3. ప్రభువు మహామహుడు,
అత్యధికముగా కీర్తింపదగినవాడు.
ఆయన మాహాత్మ్యమును మనము గ్రహింపజాలము
4. తరతరముల ప్రజలు నీ చేతలను పొగడుదురు. నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు.
5. వారు నీ కీర్తి వైభవములను ఉగ్గడింతురు.
నేను నీ అద్భుతక్రియలను ధ్యానింతును.
6. జనులు నీ భయంకర కార్యములను ప్రశంసింతురు
నేను నీ మాహాత్మ్యమును వెల్లడిచేయుదును.
7. నరులు ఎనలేని నీ మంచితనమును
పొగడుదురు.
నీ కరుణను ప్రస్తుతింతురు.
8. ప్రభువు దయాపూరితుడు, కరుణానిధి,
సులభముగా కోపపడువాడు కాదు,
కృపామయుడు.
9. ఆయన అందరికి మేలు చేయును.
తాను కలిగించిన ప్రాణికోిని
అంతిని నెనరుతో చూచును.
10. ప్రభూ! నీవు చేసిన ప్రాణులన్నియు
నిన్ను స్తుతించును.
నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు.
11. వారు నీ రాజ్యవైభవమును సన్నుతింతురు.
నీ ప్రాభవమును ఉగ్గడింతురు.
12. దానివలన నరులెల్లరు
నీ మహాకార్యములను తెలిసికొందురు.
నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు.
13. నీ రాజ్యము శాశ్వతమైనది.
నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభువు తన వాగ్ధానములను నిలబెట్టుకొనును.
ఆయన కార్యములెల్ల కరుణతో నిండియుండును.
14. ఆయన పడిపోయినవారిని లేవనెత్తును.
క్రుంగిపోయినవారిని పైకిలేపును.
15. ప్రతిప్రాణియు ఆశతో నీవైపుచూచును.
నీవు వానికి అవసరము కల్గినపుడెల్ల
తిండిపెట్టుదువు.
16. నీవు నీ పిడికిని విప్పి
ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు.
17. ప్రభువు ప్రతికార్యమును న్యాయముతో చేయును
ఆయన చెయిదములెల్ల దయతో కూడియుండును
18. ఆయన తనకు మొరపెట్టువారికి
చేరువలోనే ఉండును.
చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి
దాపులోనే యుండును.
19. తనపట్ల భయభక్తులు చూపువారి
కోరికలు తీర్చును.
వారి మొరలు ఆలించి వారిని రక్షించును.
20. తన్ను ప్రేమించువారిని కాచి కాపాడును.
దుష్టులను మాత్రము సర్వనాశనము చేయును.
21. నేను నిరతము ప్రభువును స్తుతింతును.
ఆయన పవిత్రనామమును
ప్రాణులెల్ల సదా సన్నుతించునుగాక!