13 1. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను.
2. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టును చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరును తీరమున నిలుచుండిరి.
3. ఆయన వారికి అనేక విషయములు ఉపమానరీతిగా చెప్పెను.
విత్తువాని ఉపమానము
(మార్కు 4:1-9; లూకా 8:4-8)
”విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను.
4. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను.
5. మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను 6. కాని, సూర్యుని వేడిమికి మాడి, వేరులేనందున ఎండి పోయెను.
7. మరికొన్ని ముండ్లపొదలలో పడెను. ఆ ముండ్లపొదలు ఎదిగి వానిని అణచివేసెను.
8. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా, అరువదంతలుగా, ముప్పదంతలుగా పంటనిచ్చెను.
9. వినుటకు వీనులున్నవాడు వినునుగాక!” అని యేసు పలికెను.
ఉపమానముల ఉద్దేశము
(మార్కు 4:10-12; లూకా 8:9-10)
10. అంతట శిష్యులు యేసు వద్దకువచ్చి, ”మీరు ప్రజలతోప్రసంగించునపుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేల?” అని ప్రశ్నించిరి.
11. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా ”పరలోకరాజ్య పరమరహస్యములను తెలిసికొనుటకు అనుగ్రహింప బడినది మీకే కాని వారికి కాదు.
12. ఏలయన, ఉన్నవానికే మరింత ఇవ్వబడును. వానికి సమృద్ధి కలుగును. లేనివానినుండి వానికున్నదియు తీసి వేయబడును.
13. వారు చూచియుచూడరు; వినియు వినరు, గ్రహింపరు. కనుక, నేను వారితో ఉపమాన రీతిగా మాటలాడుచున్నాను” అని చెప్పెను.
14. ”వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏమన:
‘ఎంతగా విన్నను మీరు గ్రహింపరు.
ఎంతగా చూచినను మీరు గమనింపరు.
15. ఏలయన కనులార చూచి, చెవులార విని,
మనస్సుతో గ్రహించి,
హృదయపరివర్తనము చెంది,
నా వలన స్వస్థత పొందకుండునట్లు,
వారి బుద్ధి మందగించినది.
వారి చెవులు మొద్దుబారినవి.
వారి కన్నులు పొరలు క్రమ్మినవి.’
16. ”మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడ గలుగుచున్నవి. మీ చెవులు వినగలుగుచున్నవి.
17. మీరు చూచునది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి. కాని వారికి అది సాధ్యపడలేదు.
విత్తువాని ఉపమాన భావము
(మార్కు 4:13-20; లూకా 8:11-15)
18. ”కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు.
19. రాజ్యమును గూర్చిన సందేశమును విని, దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు వచ్చి, వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొనిపోవును.
20. రాతినేలపై బడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించువానిని సూచించుచున్నది.
21. అయినను, వానిలో వేరులేనందున అది కొలదికాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమయైనను, లేదా హింసయైనను సంభవించినప్పుడు అతడు వెంటనేతొట్రిల్లును.
22. ముండ్లపొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును. కాని, ఐహికవిచారము, ధనవ్యామోహము దానిని అణచివేయును. కనుక, వాడు నిష్ఫలుడగును.
23. సారవంతమైన నేల యందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమునువిని, గ్రహించి, నూరంతలుగను, అరువదంతలుగను, ముప్పదంతలుగను ఫలించును.”
గోధుమలు – కలుపుగింజలు
24. యేసు వారికి మరియొక ఉపమానము చెప్పెను: ”పరలోకరాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది.
25. జనులు నిద్రించువేళ వాని పగవాడువచ్చి, గోధుమలలో కలుపుగింజలు చల్లిపోయెను.
26. పైరు మొలచి వెన్నువిడుచునపుడు కలుపుమొక్కలు కూడ కనిపింపసాగెను.
27. అపుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, ‘అయ్యా! నీ పొలములో మంచివిత్తనములు చల్లితివి కదా! అందులో కలుపుగింజలు ఎట్లు వచ్చిపడినవి?’ అని అడిగిరి.
28. అందుకు అతడు ‘ఇది శత్రువు చేసినపని’ అనెను. అంతట వారు ‘మేము వెళ్ళి, వానిని పెరికి కుప్ప వేయుదుమా?’ అని అడిగిరి.
29. ‘వలదు, వలదు. కలుపు తీయబోయి గోధుమ నుకూడ పెల్లగింతురేమో!
30. పంటకాలమువరకు రెంటినిపెరుగనిండు. అపుడు కోతగాండ్రతో ‘ముందుగా కలుపుతీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు. గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు’ అని చెప్పెదను” అనెను.
ఆవగింజ ఉపమానము
(మార్కు 4:30-32; 13:18-19)
31. ఆయన మరియొక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను: ”పరలోకరాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలియున్నది.
32. అన్ని విత్తనముల కంటె అతి చిన్నదైనను, పెరిగినపుడు అది పెద్ద గుబురై, వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును.”
పులిసిన పిండి ఉపమానము
(లూకా 13:20-21)
33. ఆయన వారికి మరియొక ఉపమానమును ఇట్లు చెప్పెను: ”ఒక స్త్రీ పులిసిన పిండిని మూడు కుంచముల పిండిలో ఉంచగా, ఆ పిండిఅంతయు పులియబారెను. పరలోకరాజ్యము దీనిని పోలి యున్నది.”
34. యేసు జనసమూహములకు ఈ విషయము లన్నియు ఉపమానములతో బోధించెను. ఉపమాన ములు లేక వారికి ఏమియు బోధింపడాయెను.
35. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగ బోధించెను.
”నేను ఉపమానములతో బోధించెదను.
సృష్టి ఆరంభమునుండి గుప్తమైయున్న
వానిని బయలుపరచెదను.”
గోధుమలు, కలుపుగింజల ఉపమాన తాత్పర్యము
36. అపుడు యేసు ఆ జనసమూహములను వదలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు, కలుపుగింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి.
37. అందుకు యేసు ”మంచి విత్తనమును విత్తువాడు మనుష్యకుమారుడు.
38. పొలము ఈ ప్రపంచము. మంచివిత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపుగింజలు దుష్టుని సంతానము.
39. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు.
40. కలుపు మొక్కలు ఎట్లు ప్రోవుచేయబడి అగ్నిలో వేయబడునో, అట్లే అంత్యకాలమందును జరుగును.
41. మనుష్యకుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యమునుండి పాపభూయిష్ఠములైన ఆటంకములను అన్నిని, దుష్టులను అందరను ప్రోగుచేసి, 42. అగ్ని గుండములో పడద్రోయుదురు; అచ్చట వారు ఏడ్చుచు, పండ్లు కొరుకుకొందురు.
43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినునుగాక!
దాచబడిన ధనము
44. ”పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమువలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచియుంచి, సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను.
ఆణిముత్యము
45. ”ఇంకను పరలోకరాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకునివలె ఉన్నది. 46. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని, వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను.
మంచి చేపలు – చెడు చేపలు
47. ”ఇంకను పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలనుపట్టిన వలను పోలియున్నది.
48. వల నిండినపుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలోవేసి, పనికిరాని వానిని పారవేయుదురు.
49. అటులనే అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులనుండి వేరుపరచి, 50. అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కొరుకుకొందురు.”
పరలోకరాజ్య శిష్యత్వము
51.”వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?” అని యేసు అడిగెను. ”అవును” అని వారు సమాధాన మిచ్చిరి.
52. ఆయన ”పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతనవస్తువులను వెలికితెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు” అనెను.
నజరేతూరిలో నిరాదరణ
(మార్కు 6:1-6; లూకా 4:16-30)
53. యేసు ఈ ఉపమానములను ముగించి అచటనుండి వెడలి, 54. తన పట్టణమును చేరెను. అచట ప్రార్థనామందిరములో ఉపదేశించుచుండగా, ప్రజలు ఆశ్చర్యచకితులై, ”ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుతశక్తి ఎచటనుండి లభించినవి?” అని అనుకొనిరి.
55. ”ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులుకారా?
56. ఇతని సోదరీమణులు అందరు మన మధ్యనలేరా? అటులయిన ఇవి అన్నియు ఇతడు ఎట్లు పొందెను?” అని 57. ఆయనను తృణీకరించిరి. అపుడు యేసు వారితో ”ప్రవక్త స్వదేశమందును, స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు” అని పలికెను.
58. ఆ ప్రజల అవిశ్వాసమువలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు.