పూర్వుల సంప్రదాయము
(మార్కు 7:1-13)
15 1. అంతట యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు యేసు వద్దకు వచ్చి 2. ”మీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు. వారు ఏల ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు?” అని అడిగిరి.
3. అందుకు యేసు ”పూర్వుల ఆచారమును ఆచరించునపుడు మరి మీరు మాత్రము దైవాజ్ఞలను మీరుటలేదా?
4. ఏలయన, దేవుడు ఇట్లు ఆజ్ఞాపించెను: ‘నీ తల్లిని, తండ్రిని గౌరవింపుము. తల్లిదండ్రులను దూషించువాడు మరణించుగాక!, 5. ఎవ్వడేని తన తండ్రితోగాని, తన తల్లితోగాని, ‘నానుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది’ అని చెప్పినచో, అట్టివాడు తన తల్లిదండ్రులను ఆదుకొననవసరము లేదని మీరు బోధించుచున్నారు.
6. ఈ రీతిని మీరు పూర్వుల ఆచారముననుసరించు నెపమున దేవుని వాక్కును నిష్ప్రయోజనము చేయుచున్నారు.
7. వంచకులారా! యెషయా మిమ్మును గూర్చి యెంత యథార్థముగా ప్రవచించెను!
8. ‘ఈ ప్రజలు పెదవులతో
నన్ను స్తుతించుచున్నారు కాని,
వారి హృదయములు
నాకు కడుదూరముగా ఉన్నవి.
9. మానవ కల్పిత నియమములను
దైవాజ్ఞలుగా బోధించుచున్నారు
కావున వీరి ఆరాధన నిరర్థకము.”
మాలిన్యపరచు క్రియలు
(మార్కు 7:14-23)
10. అపుడు యేసు జనసమూహమును తన చెంతకుపిలిచి ”మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు.
11. మనుష్యుని మాలిన్యపరచునది నోటి నుండి వెలువడునదియే కాని, నోటిలోనికి పోవునది కాదు” అనెను.
12. అపుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ”పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియునా?” అని ప్రశ్నించిరి.
13. అందుకు ఆయన ”నా పరలోకతండ్రి నాటని ప్రతిమొక్క వేరుతో పెల్లగింపబడును.
14. వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారు ఇరువురును గుంతలో కూలుదురు” అని సమాధానమిచ్చెను.
15. ఈ ఉపమానమును వివరింపుమని పేతురు ఆయనను అడిగెను.
16. యేసు ప్రత్యుత్తరముగా, ”మీకు కూడ ఇంతవరకు అర్థము కాలేదా?
17. నోటిలోనికి పోవునదంతయు ఉదరములో ప్రవేశించి, ఆ పిమ్మట విసర్జింపబడు చున్నదని మీకుతెలియదా?
18.నోటి నుండి వెలువడునది హృదయమునుండి వచ్చును. అదియే మనుష్యుని మాలిన్యపరచును.
19. ఏలయన, హృదయమునుండి దురాలోచనలు పుట్టుచున్నవి. వీని మూలమున నర హత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగ తనములు, అబద్ధపు సాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి. 20. మనుష్యుని మాలిన్య పరచునవి ఇవియేగాని, చేతులు కడుగుకొనకుండ భుజించుట కాదు.”
కననీయ స్త్రీ విశ్వాసము
(మార్కు 7:24-30)
21. యేసు అటనుండి తూరు, సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను.
22. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతె ఆయన వద్దకు వచ్చి, ”ప్రభూ! దావీదుకుమారా! నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యముపట్టి మిక్కిలి బాధపడుచున్నది” అని మొరపెట్టుకొనెను.
23. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మ్లాడలేదు. అపుడు ఆయన శిష్యులు సమీపించి ”ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు” అనిరి.
24. ”నేను యిస్రాయేలు వంశమున చెదరిపోయిన గొఱ్ఱెలకొరకు మాత్రమే పంపబడితిని” అని ఆయన సమాధానము ఇచ్చెను.
25. అపుడు ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి ”ప్రభూ! నాకు సాయపడుము” అని ప్రార్థించెను.
26. ”బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు” అని ఆయన సమాధానమిచ్చెను.
27. అందుకు ఆమె, ”అది నిజమే ప్రభూ! కాని తమ యజమానుని భోజనపుబల్లనుండి క్రిందపడిన రొట్టెముక్కలను కుక్క పిల్లలును తినునుగదా!” అని బదులు పలికెను.
28. యేసు ఇది విని ”అమ్మా! నీ విశ్వాసము మెచ్చదగినది. నీ కోరిక నెరవేరునుగాక!” అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను.
వ్యాధిగ్రస్తులకు స్వస్థత
29. యేసు అక్కడ నుండి గలిలీయ సముద్ర తీరమునకు వచ్చి, కొండపైకి ఎక్కి కూర్చుండెను.
30. అపుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసికొనివచ్చి, ఆయన పాదసన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థ పరచెను.
31. అపుడు మూగవారు మాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి, విస్మయ మొంది, యిస్రాయేలు దేవుని స్తుతించిరి.
ఎడారిలో ఆహారము
(మార్కు 8:1-10)
32. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ”ఈ జనులు మూడుదినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు ఇష్టము లేదు” అనెను.
33. అపుడు శిష్యులు, ”ఈ ఎడారిలో ఇంతి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచటనుండి కొనిరాగలము?” అని పలికిరి.
34. అంతట యేసు ”మీయొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి?” అని వారిని అడిగెను. ”ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి” అని శిష్యులు పలికిరి.
35. ఆయన జనసమూహమును నేలమీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను.
36. పిమ్మట ఆయన ఆ ఏడు రొట్టెలను చేపలను తీసికొని ధన్యవాదములు అర్పించి, త్రుంచి, తన శిష్యులకు ఈయగా వారు ఆ జనసమూహమునకు పంచిప్టిెరి.
37. వారు అందరు భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను ఏడు గంపలనిండ ఎత్తిరి.
38. స్త్రీలు, పిల్లలు మినహా భుజించినవారు నాలుగువేల మంది పురుషులు.
39. తరువాత యేసు జనసమూ హమును పంపివేసి పడవనెక్కి మగ్దలా ప్రాంతమునకు వెళ్ళెను.