పసిబిడ్డలు – పరలోకరాజ్యము
(మార్కు 9:33-37; లూకా 9:46-48)
18 1. ఆ సమయమున శిష్యులు యేసువద్దకు వచ్చి, ”పరలోకరాజ్యమున అందరికంటె గొప్పవాడు ఎవ్వడు?” అని అడిగిరి.
2. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారిమధ్యన నిలిపి, 3. ”మీరు పరివర్తనచెంది చిన్నబిడ్డలవలె రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించు చున్నాను.
4. కాబట్టితనను తాను తగ్గించుకొని ఈ బాలునివలె రూపొందువాడే పరలోకరాజ్యమున గొప్పవాడు.
5. ఇట్టిచిన్నవానిని నా పేరిట స్వీకరించు వాడు నన్ను స్వీకరించుచున్నాడు.
దుర్మాతృక వలన అనర్థములు
(మార్కు 9:42-48; లూకా 17:1-2)
6. ”నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవ్వనినైన పాపమునకు ప్రేరేపించుటకంటె అట్టివాని మెడకు తిరుగిరాయి కట్టిఅగాధ సముద్రములో పడద్రోయుట వానికి మేలు.
7. ఆటంకములతో కూడిన ప్రపంచమా! అనర్థము! ఆటంకములు తప్పవు. కాని అందుకు కారకుడైన వానికి అనర్థము!
8. నీ చేయికాని, నీ కాలుకాని నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. కాళ్ళు, చేతులతో ఆరని ఆగ్నిలో దహింపబడుటకంటె, అంగహీనుడవై అమరజీవము పొందుట మేలు.
9. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కనులతో నీవు నరకాగ్నిలో దహింపబడుటకంటె ఒంటికంటితో నిత్య జీవము పొందుట మేలు.
10. ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలయన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
త్రోవ తప్పిన గొఱ్ఱె
(లూకా 15:1-7)
(11. ”మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చియున్నాడు.)
12. ఒకడు తనకున్న నూరుగొఱ్ఱెలలో ఒకి తప్పిపోయినచో, తక్కిన తొంబది తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా?
13. అది దొరికినపుడు తప్పిపోని తక్కిన తొంబది తొమ్మిదింటికంటె దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను.
14. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు.
సోదరుని సరిదిద్దుట
(లూకా 17:3)
15.”నీ సోదరుడు నీకు విరుద్ధముగ తప్పిదము చేసినయెడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధిచెప్పుము. నీ మాటలు అతడు ఆలకించినయెడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదువు.
16. నీ మాటలను అతడు ఆలకింపనియెడల ఒకరిద్దరను నీ వెంట తీసికొని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతిమాట స్థిరపడును.
17. అతడు వారి మాట కూడ విననియెడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘ మును కూడ అతడు లెక్కింపనియెడల, వానిని అవిశ్వాసునిగను, సుంకరిగను పరిగణింపుము.
18. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోక మందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను.
19. భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను, పరలోకమందుండు నా తండ్రి వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
20. ఏలయన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారిమధ్య ఉన్నాను” అనెను.
క్షమా ధర్మములు
21. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ”ప్రభూ! నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండ నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? ఏడు పర్యాయములా?” అని అడిగెను.
22. అందుకు యేసు ”ఏడు కాదు, ఏడు డెబ్బది పర్యాయములు” అని సమాధానమిచ్చెను.
23. ఏలయన పరలోకరాజ్యము ఇట్లున్నది: ఒక రాజు తన సేవకులనుండి లెక్కలు సరిచూచుకొనగోరెను.
24.ఆరాజులెక్కలుచూచుకొన ప్రారంభింపగనే కోటివరహాల1 ఋణస్థుడొకడు అతని సముఖమునకు తీసికొని రాబడెను.
25. వానికి ఋణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికి ఉన్నదంతయును విక్రయించి, ఆ ఋణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను.
26. అపుడు ఆసేవకుడు అతని కాళ్ళపై పడి ‘కొంత ఓపిక పట్టుము. నీ ఋణమునంతయు చెల్లింతును’ అని వేడుకొనెను.
27.ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచి పెట్టెను. వాని అప్పును కూడ క్షమించెను.
28. కాని, అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనకు కొంతధనము2 ఋణపడియున్న తన తోడి సేవకులలో నొకనిని చూచి, ‘నీ అప్పు చెల్లింపుము’ అని గొంతు పట్టుకొనెను.
29. ఆ తోడి సేవకుడు అపుడు సాగిలపడి ‘కొంచెము ఓపిక పట్టిననీ ఋణ మంతయు చెల్లింతును’ అని ప్రాధేయపడెను.
30. అందులకు వాడు అంగీకరింపక ఋణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను.
31. ఇది చూచిన తోటిసేవకులు ఎంతో బాధపడి, జరిగినది అంతయు తమ యజమానునకు ఎరిగించిరి.
32. అపుడు ఆ యజమానుడు వానిని పిలిపించి ‘నీచుడా! నీవునన్నుప్రార్థించుటచేనీఋణమంతయుక్షమించితిని.
33. నేను నీపట్ల దయచూపినట్లు నీవు నీ తోటిసేవకునిపై దయచూపవలదా?’ అని 34. మండిపడి బాకీనంతయు చెల్లించువరకు వానిని తలారులకు అప్పగించెను.
35. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల పరలోకమందలి నా తండ్రియు మీ యెడల అటులనే ప్రవర్తించును.”