హెచ్చరిక

(మార్కు 12:38-40; లూకా 11:39-47; 20:45-47)

23 1. అప్పుడు యేసు జనసమూహములతోను,  తన శిష్యులతోను ఇట్లనెను: 2. ”ధర్మశాస్త్రబోధకులును, పరిసయ్యులును మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు.

3.కాబట్టి వారిక్రియలనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయన  వారు బోధించునది వారే ఆచరింపరు.

4. వారు మోయ సాధ్యముకాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెనవ్రేలైనను కదపరు.

5. తమ పనులెల్ల ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులు1గా ధరింతురు. అంగీయంచులు పొడవు చేసికొందురు.

6. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధానాసనములను కాంక్షింతురు.

7. అంగడి వీధులలో వారు వందనములను అందుకొనుటకును, ‘బోధకుడా,’ అని పిలిపించు కొనుటకును  తహతహ లాడుదురు.

8. మీరు ‘బోధకులు’ అని పిలిపించు కొనవలదు. ఏలయన, మీకు బోధకుడు ఒక్కడే. మీరందరు సోదరులు.

9. ఈ లోకమున మీరు ఎవ్వరిని గాని ‘తండ్రీ’ అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే. ఆయన పరలోకమందున్నాడు.

10. మీరు ‘గురువులు’ అని పిలిపించుకొనవలదు. ఏలయన క్రీస్తు ఒక్కడే మీ గురువు.

11. మీ అందరిలో గొప్ప వాడు మీకు సేవకుడైయుండవలయును.

12. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.

యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను గద్దించుట

13. ”వంచకులయిన ధర్మశాస్త్ర బోధకులారా! పరిసయ్యులారా! మీరు మనుష్యులయెదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింప ప్రయత్నించువారిని ప్రవేశింపనీయరు.

14. అయ్యో! కపటభక్తులైన ధర్మశాస్త్రో పదేశకులారా! పరిసయ్యులారా! మీరు పరులు చూడవలెనని దీర్ఘజపములు జపించుచు, వితంతువుల యిండ్లను దోచుకొనుచున్నారు. కావున  కఠినశిక్షకు  గురియగుదురు.

15. అయ్యో! కపటభక్తులైన ధర్మ శాస్త్రోపదేశకులారా! పరిసయ్యులారా! మీరు ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములుదాటిఎన్నోదేశములు చుట్టివత్తురు. అది సఫలమైన పిదప, మీకంటె రెండింతలుగా నరకముపాలు చేయుదురు.

16. ”అయ్యో! అంధులైన మార్గదర్శకులారా! ఒకడు దేవాలయముతో శపథముచేసిన అతడు దానికి కట్టువడియుండనక్కరలేదనియు, దేవాలయమందున్న బంగారముతో ఒట్టుపెట్టినఅతడు దానికి కట్టుబడి యుండవలయుననియు మీరు బోధింతురు.

17. అంధులైన అవివేకులారా! బంగారము గొప్పదియా? బంగారమును పవిత్రముచేయు దేవాలయము గొప్పదియా?

18. ఒకడు బలిపీఠముతో ఒట్టుపెట్టుకొనిన అతడు దానికి కట్టువడియుండనవసరములేదనియు, బలిపీఠముపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టువడియుండవలెననియు మీరు ఉపదేశింతురు.

19. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యము గొప్పదియా? లేక నైవేద్యమును పవిత్ర పరచు బలిపీఠము గొప్పదియా? 20. బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోను, దాని పైనున్న నైవేద్యములన్నితోను ప్రమాణము చేయు చున్నాడు.

21. దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోను, దానియందు నివసించు వానితోను ప్రమాణము చేయుచున్నాడు.

22. పరలోకముతోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనముతోను, దానిపై ఆసీనుడగు దేవునితోను ప్రమాణము చేయుచున్నాడు.

23. ”అయ్యో! మోసగాండ్రయిన ధర్మశాస్త్ర బోధకులారా! పరిసయ్యులారా! మీరు పుదీనా, సోంపు, జీలకఱ్ఱ మొదలగు వానిలో గూడ పదియవవంతును చెల్లించుచున్నారు. కాని, ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైనచట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కాని, వీనిని ఏ మాత్రము నిర్లక్ష్యము చేయరాదు.

24. అంధులైన  మార్గదర్శకులారా! మీరు వడబోసి దోమనుతీసివేసి, ఒంటెను దిగమ్రింగు చున్నారు.

25. ”అయ్యో! వంచకులయిన ధర్మశాస్త్ర బోధకు లారా! పరిసయ్యులారా! మీరు గిన్నెను, పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుదురు గాని,  మీ అంతరంగము పూర్త్తిగా దౌర్జన్యముతోను, దురాశతోను నిండి యున్నది. 26. గ్రుడ్డి పరిసయ్యుడా! గిన్నెయు పళ్ళెమును వెలుపలకూడ శుద్ధియగునట్లు ముందు వాని లోపల శుద్ధిచేయుము.

27. అయ్యో! కపటభక్తులైన ధర్మశాస్త్రోపదేశ కులారా! పరిసయ్యులారా! మీరు సున్నముకొట్టినసమాధులవలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను, లోపల మృతుల ఎముకలతోను, దుర్గంధ పదార్థముతోను నిండియుండును.

28. అటులనే మీరును బయటకు నీతిమంతులవలెకన్పట్టినను, లోపల కపటముతోను, కలుషముతోను నిండియున్నారు.

శిక్షార్హులు

(లూకా 11:47-51)

29. ”అయ్యో! కపటభక్తులైన ధర్మశాస్త్రోప దేశకులారా! పరిసయ్యులారా! మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు.

30. ‘మా పితరుల కాలమందు మేము జీవించియున్నయెడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండెడి వారముకాము’ అని మీరు చెప్పుదురు.

31. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని  మీకు మీరే  రుజువుచేసికొనుచున్నారు.

32. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తిచేయుడు.

33. సర్పములారా! సర్పసంతానమా! నరక శిక్షనుండి మీరు ఎట్లు తప్పించుకొనగలరు?

34. అందుచేత ఇదిగో! నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర బోధకులను పంపుచున్నాను. వారిలో కొందరిని మీరు చంపెదరు, కొందరిని సిలువ వేసెదరు, మరికొందరిని మీ ప్రార్థనా మందిరములలో కొరడాలతోకొట్టించి, ఒక పట్టణమునుండి మరియొక పట్టణమునకు  తరిమెదరు.

35. దీని ఫలితముగా నీతిమంతుడగు హేబెలు హత్య మొదలుకొని, ఆలయమునకు, బలి పీఠమునకు మధ్య మీరు గావించిన బరాకియా కుమారుడగు జెకర్యా హత్యవరకును, చిందించిన నీతిమంతుల రక్తాపరాధము మీపై పడును.

36. వీటన్నిటికిగాను ఈ తరము వారు శిక్షను అనుభవించి తీరుదురని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”.

యెరూషలేము – యేసు విలాపము

(లూకా 13:34-35)

37. ”ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తలను చంపి, దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడి రెక్కలు చాపి తన పిల్లలను ఆదుకొనునట్లు, నేను ఎన్ని పర్యాయములు నీ పిల్లలను చేరదీయగోరినను, నీవు అంగీకరింపకపోతివి.

38. ఇదిగో! నీ గృహము నిర్మానుష్యమగును.

39. ‘ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!’ అని సన్నుతించువరకు నీవు నన్ను చూడజాలవు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”