పదిమంది కన్యలు

25 1. ”పరలోకరాజ్యము ఇట్లుండును: పదిమంది కన్యలు తమ కాగడాలతో పెండ్లికుమారునకు స్వాగతమీయ ఎదురేగిరి.

2. అందు అయిదుగురు వివేకవతులు, మరియైదుగురు అవివేకవతులు.

3. అవివేకవతులు తమ కాగడాలతోపాటు నూనెను తీసికొనిపోలేదు.

4. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసికొనిపోయిరి.

5. పెండ్లి కుమారుని రాక ఆలస్యముకాగా, వారెల్లరు కునికి పాట్లు పడుతు నిద్రించుచుండిరి.

6.అర్ధరాత్రి సమయమున ‘ఇదిగో! పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. అతనికి ఎదురు వెళ్ళుడు’ అను కేక వినబడెను.

7. అపుడు ఆ కన్యలందరు నిదురనుండి మేల్కొని తమ కాగడాలను సవరించు కొనసాగిరి.

8. అవివేకవతులు వివేకవతులతో ‘మా కాగడాలు కొడిగట్టుచున్నవి. మీ నూనెలో కొంత మాకీయుడు’ అని కోరిరి.

9. అందుకు ఆ వివేకవతులు, ‘మాకును మీకును ఇది చాలదు. అంగడికి వెళ్ళి కొనితెచ్చుకొనుడు’ అనిరి.

10. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగనున్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను.         

11. తరువాత మిగిలిన  కన్యలు వచ్చి ‘ప్రభూ! ప్రభూ! తలుపుతీయుడు’ అని మొరపెట్టిరి.

12. ఆయన ‘నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను’ అనెను.

13. కనుక మెలకువతో ఉండుడు. ఏలయన, ఆ దినమును, ఆ గడియను మీరెరుగరు.

సేవకుని కర్తవ్యము – నిర్వహణవిధానము

(లూకా 19:11-27)

14. ”ఒకడు దూరదేశమునకు ప్రయాణమై పోవుచు సేవకులను పిలిచి, తన ఆస్తిని వారికి అప్పగించెను.

15. వారివారి సామర్థ్యమునుబట్టి ఒకనికి ఐదులక్షలు1 వరహాలను, మరియొకనికి రెండు లక్షలు వరహాలను, ఇంకొకనికి ఒకలక్ష వరహాలను ఇచ్చివెళ్ళెను.

16. ఐదులక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారముచేసి మరియైదులక్షలు సంపాదించెను.

17. అట్లే రెండులక్షల వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను.

18. కాని ఒక లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచెను.

19. చాలకాలము గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగివచ్చి, వారితో లెక్కలు సరిచూచు కొననారంభించెను.

20. ఐదులక్షల వరహాలను పొందిన సేవకుడు  మరి యైదులక్షల వరహాలను తెచ్చి, ‘స్వామీ! తమరు నాకు అయిదులక్షల వరహాలను ఇచ్చితిరి. ఇదిగో! మరియైదులక్షలు సంపాదించితిని’ అనెను.

21. అపుడు ఆ యజమానుడు వానితో ‘మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలుపంచుకొనుము’ అనెను.

22. రెండులక్షల వరహాలను పొందినవాడు వచ్చి, ‘స్వామీ! మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చితిరిగదా! ఇదిగో! మరి రెండు లక్షలు సంపాదించితిని’ అనెను.

23. అప్పుడు ఆ యజమానుడు అతనితో, ‘మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్పవిషయములందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో పాలుపంచుకొనుము’ అనెను.

24. పిదప ఒకలక్ష వరహాలను పొందినవాడు వచ్చి, ‘అయ్యా! నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు  నాటనిచోట కోయువాడవు. విత్తనములను చల్లనిచోట పంట కూర్చు కొనువాడవు.

25. కనుక నేను భయపడి, వెళ్ళి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని. ఇదిగో  నీ  ధనమును నీవు తీసికొనుము’ అని పలికెను.

26. అపుడు ఆ యజమానుడు వానితో, ‘ఓరీ దుష్టసేవకా! సోమరీ! నేను నాటనిచోట పంట కోయువాడననియు, విత్తన ములు చల్లనిచోట పంట కూర్చుకొనువాడననియు నీవు ఎరుగుదువు కదా!

27. అట్లయిన నా ధనమును వడ్డీకిచ్చియుండవలసినది. నేను తిరిగివచ్చినపుడు  వడ్డీతో సహా సొమ్ము పుచ్చుకొనియుందునుగదా!’

28. అని పలికి సేవకులతో ‘ఆ లక్ష వరహాలను వీనినుండి తీసివేసి పదిలక్షల వరహాలు కలవానికి ఈయుడు.    29. ఉన్న ప్రతివానికి ఇంకను ఈయబడును. అపుడు అతనికి సమృద్ధికలుగును. లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును.

30. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు’ అని పలికెను.

తుది తీర్పు

31. ”మనుష్యకుమారుడు సమస్తదూతల సమేతముగా తన మహిమతో వచ్చునపుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును.

32. అపుడు సకలజాతులవారు ఆయన సముఖమునకు చేర్చ బడుదురు. గొఱ్ఱెలకాపరి మేకలను, గొఱ్ఱెలను వేరు పరచునట్లు ఆయన వారిని వేరుపరచును.

33. ఆయన గొఱ్ఱెలను తన కుడిప్రక్కన, మేకలను తన ఎడమప్రక్కన నిలుపును.

34. అపుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడిప్రక్కన ఉన్నవారితో ‘నా తండ్రిచే దీవింపబడిన వారలారా! రండు. ప్రపంచ ప్రారంభమునుండి మీకై సిద్ధపరుపబడిన రాజ్యమును చేకొనుడు.

35. ఏలయన నేను ఆకలిగొనినపుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పికగొనినపుడు దాహము తీర్చితిరి, పరదేశినై యున్నపుడు నన్ను ఆదరించితిరి, 36. నేను వస్త్ర హీనుడనైయున్నపుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నపుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నపుడు నన్ను దర్శింపవచ్చితిరి’ అని పలుకును.

37. అపుడు ఆ నీతిమంతులు ‘ప్రభూ! నీవు ఎప్పుడు ఆకలిగొనియుండుట చూచి, భోజనము పెట్టితిమి? దప్పికగొనియుండుట చూచి దాహము తీర్చితిమి?

38. ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి? వస్త్రహీనుడవైయుండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి?

39. ఎప్పుడు రోగివైయుండుటచూచి, పరామర్శించితిమి? చెరసాలలో ఉండగా దర్శింప వచ్చితిమి?’ అని అడుగుదురు.

40. అందుకు రాజు ‘ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’ అని వారితో చెప్పును.

41. అపుడు ఆయన తన ఎడమప్రక్కనున్న వారితో, ‘శాపగ్రస్తులారా! నా నుండి తొలగి, పిశాచమునకు, దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యనరకాగ్నిలోనికి పొండు.

42. ఏలయన నేను ఆకలిగొని యుంటిని, మీరు అన్నము పెట్టలేదు. దప్పికగొని యుంటిని, దాహము తీర్చలేదు. 43. పరదేశినై యుంటిని, నన్ను ఆదరింపలేదు. వస్త్రహీనుడనై యుంటిని, నాకు వస్త్రములను ఈయలేదు. రోగినై యుంటిని, నన్ను పరామర్శింపలేదు. చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు’ అనును.

44. అపుడు వారు కూడ ‘ప్రభూ! నీవు ఆకలి గొనియుండుట, దప్పికగొనియుండుట, పరదేశివై యుండుట, వస్త్రహీనుడవైయుండుట, రోగివైయుండుట, చెరసాలలో నుండుట, మేము ఏనాడు చూచి, పరిచర్య చేయక పోతిమి?’ అని ప్రశ్నింతురు.

45. అందుకు ఆయన, ‘ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయ నప్పుడు నాకును చేయనట్లే’ అని నిశ్చయముగా చెప్పు చున్నానని వారితో చెప్పును.

46. వీరు నిత్యశిక్షకు వెడలిపోవుదురు. నీతిమంతులు నిత్యజీవములో ప్రవేశింతురు” అని పలికెను.