మృత్యుంజయుడు
(మార్కు 16:1-10; లూకా 24:1-12; యోహాను 20:1-10)
28 1.విశ్రాంతిదినము గడచిన పిదప ఆదివారము ప్రాతఃకాలమున మగ్దలా మరియమ్మయు, వేరొక మరియమ్మయు సమాధిని చూడవచ్చిరి.
2. అదిగో! అపుడు పెద్దభూకంపము కలిగెను. ఏలయన, పరలోకమునుండి దేవదూత దిగివచ్చి, ఆ రాతిని దొర్లించి, దానిపై కూర్చుండెను.
3. అతని రూపము మెరుపువలెను, వస్త్రము మంచువలెను తెల్లగా ఉండెను.
4. కావలివారు భయపడి మరణించిన వారివలె పడిపోయిరి.
5. కాని దూత ఆ స్త్రీలతో ”భయపడకుడు. మీరు సిలువవేయబడిన యేసును వెదకు చున్నారు అని నేను ఎరుగుదును.
6. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు సమాధినుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు.
7. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతులలోనుండి లేచెనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో! మీ కంటె ముందు యేసు గలిలీయకు వెళ్ళుచున్నాడు. అచట మీరు ఆయనను దర్శింతురు. అదియే నేను మీతో చెప్పునది” అనెను.
8. అపుడు వారు భయానందములతో, వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధియొద్ద నుండి పరుగెత్తుచుండగా, 9. యేసు వారిని సమీపించి, ”మీకు శుభము” అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి.
10. యేసు వారితో ”భయపడవలదు, మీరు వెళ్ళి, నా సోదరులతో గలిలీయకు పోవలయునని చెప్పుడు. వారచట నన్ను చూడగలరు” అనెను.
కావలి వారి నివేదిక
11. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా, సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి, జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపిరి.
12. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి: 13.’మేము నిదురించుచుండ అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొనిపోయిరి’ అని చెప్పుడు.
14. ఇది అధిపతియొక్క చెవినబడిన అతనిని మేము ఒప్పింతుము. మీకు ఏమాత్రము ప్రమాదము కలుగదు” అని పలికిరి.
15. వారు ధనమును తీసికొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి యున్నది.
అంతిమ సందేశము
(మార్కు 16:14-18; లూకా 24:36-49; యోహాను 20:19-23; అ.కా. 1:6-8)
16. యేసు ఆజ్ఞానుసారము పదునొకండుగురు శిష్యులు గలిలీయలోని పర్వతమునకు వెళ్ళిరి.
17. అపుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి.
18. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ”ఇహపరములందు నాకు సర్వాధికార మీయబడినది.
19. కనుక మీరు వెళ్ళి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు.
20. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును” అని అభయ మొసగెను.