తెస్సలోనికలో పౌలు పని

2 1. సోదరులారా! మేము మిమ్ము చూడవచ్చుట వ్యర్థము కాలేదని మీకే తెలియునుగదా!

2. మీరు ఎరిగినట్లు మేము మీయొద్దకు రాకముందు ఫిలిప్పి నగరములో బాధలు అవమానములు పడినప్పటికిని మేము దేవునియందు ధైర్యము తెచ్చుకొని ఎన్నియో ఆటంకముల మధ్య మీకు సువార్తను ప్రకటించితిమి.

3. ఏలయన, మా బోధ మోసపూరితమైనది కాదు, అశుద్ధమైనది కాదు. కపటబుద్ధితోనైనదియును కాదు.

4. అంతేకాక, దేవుడు మమ్ము ఎట్లు మాటాడగోరునో ఎల్లవేళలయందును అటులే పలికెదము. ఏలయన, ఆయన మమ్ము ఆమోదించి, సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడును ప్రయత్నింపక, మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే యత్నింతుము.

5. ఏలయన ముఖస్తుతితో మేము మీయొద్దకు రాలేదు. ధనాపేక్షను మరుగుచేయు మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టముగా తెలియును. ఇందుకు దేవుడే సాక్షి!

6. మీ నుండి గాని, ఇతరుల నుండిగాని, ఎవరి నుండియైనను పొగడ్తలు పొందవలెనని మేము యత్నింపలేదు.

7. అంతేకాక, క్రీస్తు యొక్క అపోస్తలులుగా మీపై అధికారమును ప్రదర్శింపగలిగి ఉండియు అటుల చేయలేదు సుమా! పాలిచ్చుతల్లి తన పిల్లల విషయమై మృదువుగ శ్రద్ధ వహించినట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంతటి మృదువుగ ప్రవర్తించితిమి.

8. మీపై మాకున్న ప్రేమవలననే, దేవుని సువార్తను మాత్రమే కాక, మా జీవితమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. మీరు మాకు అంతి ప్రేమపాత్రులైతిరి.

9. సోదరులారా! మేము ఎట్లు కృషిచేసితిమో, శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా! మీకు దేవుని సువార్తను ప్రకటించినపుడు, మీకు ఎట్టి శ్రమను కలిగింపకుండుటకై, మేము రేయింబవళ్ళు పనిచేసితిమి.

10. విశ్వాసులైన మీపట్ల మేము ఎట్లు పరిశుద్ధముగను, నీతిగను, నిందారహితముగను ప్రవర్తించితిమో అందుకు మీరే మాకు సాక్షులు. అట్లే దేవుడును సాక్షి.

11. తండ్రి పిల్లలను ఎట్లు చూచునో, అట్లే మీలో ప్రతివ్యక్తిని మేము చూచితిమని మీకు తెలియును. మేము మీలో ప్రతివానిని హెచ్చరించితిమి. ప్రోత్సహించితిమి.

12. తన రాజ్యమునకును మహిమకును మిమ్ము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకొనవలెనని సాక్ష్యమిచ్చితిమి.

13. మరియొక కారణము వలన కూడా మేము సర్వదా దేవునకు కృతజ్ఞతలను అర్పింతుము. దేవుని వాక్కును మేము మీకు తీసికొని వచ్చినపుడు, మీరు దానిని మానవుని సందేశముగా కాక దేవుని  సందేశముగ గ్రహించితిరి. నిజమే అది అట్టిదే. ఏలన, విశ్వాసులైన మీయందును ఆ వాక్కు సత్క్రియలను కలుగజేయుచున్నది.

14. సోదరీ సోదరులారా! మీరు యూదయాలోని దైవసంఘమును అనుకరించి, అచ్చటి యేసుక్రీస్తు ప్రజలు ఎట్టి శ్రమలు అనుభవించిరో మీ స్వదేశీయులద్వారా అవియే  మీరును అనుభవించిరి.

15. ఆ యూదులు యేసు ప్రభువును, ప్రవక్తలను చంపి మమ్ము హింసించిరి. వారు దేవునకు ఎంతయో అసంతృప్తిని కలిగించుచు  మానవులకును అంతే విరోధులైరి.

16. అన్యజనులకు రక్షణను ప్రసాదించు సందేశమును మేము బోధింపకుండునట్లు కూడ మమ్ము వారు అడ్డగించిరి. వారు సర్వదా చేయు పాపములకిది పూర్ణపరిణామము. కడన అంతమొందించుటకు దేవుని ఆగ్రహము వారిపై వచ్చినది.

పునఃసందర్శనము – పౌలు కోరిక

17. సోదరులారా! శారీరకముగా మీ ఎడబాటు కొలది కాలమే అయినను మేము మనస్సున మిమ్ము తిరిగి చూడవలెనని ఎంతో ఆతృతతో అమితముగా ఆశించితిమి.

18. కావున తిరిగి మిమ్ము చేరవలెనని కోరితిమి. పౌలునైన నేను అనేక పర్యాయములు వెనుదిరిగి మీ యొద్దకు పోవలెనని ప్రయత్నించితిని కాని, సైతాను  మాకు అడ్డుపడెను.

19. మన యేసు ప్రభువు వచ్చినపుడు ఆయన సన్నిధిని మా విజయమును గూర్చి పొగడుకొనుటకు మా నమ్మికయు, ఆనందమును, కీర్తి కిరీటమును మీరే, నిశ్చయముగా మీరే.

20. నిజముగా మీరే మా మహిమయు, ఆనందము!

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము