దేవుని సంతోషపెట్టు జీవితము
4 1. చిట్టచివరిగా, సోదరులారా! దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకను అధికముగ అటులనే జీవించుచు, అభివృద్ధి సాధింపవలెనని, మేము మిమ్ము ఇపుడు ప్రభువగు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము.
2. ఏలయన, యేసు ప్రభువు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తరువులను జారీ చేసితిమో మీకు ఎరుకయే కదా!
3. మీరు పవిత్రులై ఉండవలె ననియు భోగవాంఛలకు దూరముగ ఉండవలెననియు మీ విషయమున దేవుడు సంకల్పించియున్నాడు.
4. మీలో ప్రతివ్యక్తియు పవిత్రముగ, గౌరవనీయముగ తన శరీరమును అదుపులో పెట్టుకొనుట తెలిసికొనవలెను.
5. దేవుని ఎరుగని అన్యజనులవలె మీరు వ్యామోహపూరితమగు కాంక్షతో మెలగరాదు.
6. కనుక, ఈ విషయమున ఏ వ్యక్తియు తన సోదరునకు హాని చేయరాదు. అతని హక్కులకు భంగము చేయదగదు. ఏలయన అట్టి వారిని ప్రభువే శిక్షించునని మీకు పూర్వమే చెప్పి, హెచ్చరించి యుంటిమి.
7. అపవిత్రత యందు జీవింపుమని దేవుడు మనలను పిలువలేదు. పవిత్ర జీవమును గడపుమనియే ఆయన పిలుపు.
8. కనుక ఇట్టి దేవుని పిలుపును తిరస్కరించువాడు మానవుని తిరస్కరించుట కాదు, తన పవిత్రాత్మను మీకొసగు దేవుని తిరస్కరించుచున్నాడు.
9. తోడి విశ్వాసులయెడల ప్రదర్శింపవలసిన ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఏలయన, మీరు పరస్పరము ఎట్లు ప్రేమించుకొనవలెనో మీకు దేవుని చేతనే బోధింపబడెను.
10. మాసిడోనియా అంతటను ఉన్న సోదరులందరిని మీరు నిజముగ ప్రేమించుచున్నారు. సోదరులారా, అయినను మీరు ఇంకను ఎక్కువగా ప్రేమను చూపవలెనని హెచ్చరించుచున్నాము.
11. మేము పూర్వమే మీకు చెప్పినట్లుగా ప్రశాంతముగ జీవించుటకును పరుల జోలికి పోక, మీ స్వవిషయములను చూచుకొనుటకును, జీవనాధారమును కష్టించి సంపాదించుకొనుటకును ఆశింపవలెను. 12. ఈ విధముగ అవిశ్వాసుల వలన మీరు గౌరవమును పొందగలరు. మీ అవసరములకై ఇతరులపై ఆధారపడవలసిన పనిఉండదు.
ప్రభువు రాకడ
13. సోదరులారా! నమ్మకము లేని వ్యక్తులవలె మీరు విచారపడకుండుటకు, చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలెనని మా కోరిక.
14. యేసు మరణించి పునరుత్థానము చెందెనని మనము విశ్వసింతుము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును.
15. ఏలయన, మేము మీకు చెప్పెడు ప్రభువు బోధన ఇది. ప్రభువువచ్చెడి దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారికంటె ముందు పోము.
16.ఆజ్ఞారావమును, ప్రధాన దేవదూత పిలుపును, దేవుని బాకా ధ్వనియును అచట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకమునుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానమును పొందుదురు.
17. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలిసికొనుటకు వారితోపాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభువు తోడనే ఉందుము.
18. కావున ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు.