ప్రభువు రాకడకు సంసిద్ధత
5 1. సోదరులారా! ఈ విషయములు సంభవించు కాలములను గూర్చిగాని నిర్ణీత సమయములను గూర్చిగాని మీకు వ్రాయనక్కర లేదు.
2. ఏలయన, ప్రభువు దినము రాత్రివేళ దొంగవలె వచ్చునని మీకు తెలియునుగదా!
3. ”అంతయు ప్రశాంతముగ, సురక్షితముగ ఉన్నది” అని ప్రజలు అనుకొనునపుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణియగు స్త్రీ ప్రసవవేదనవలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు.
4. కాని సోదరులారా! మీరు చీకటియందులేరు. కనుక, దొంగవలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొలుపగూడదు.
5. మీరు అందరు వెలుగు కుమారులును, పగటి కుమారులునై వున్నారు. మనము రాత్రికిగాని, చీకటికిగాని సంబంధించినవారము కాము.
6. కనుక ఇతరుల వలె, మనము నిద్రించు చుండరాదు. మేల్కొని జాగరూకులమై ఉండవలెను.
7. నిద్రించువారు రాత్రివేళ నిద్రింతురు. మత్తుగా నుండువారు రాత్రివేళ మత్తుగా నుందురు.
8. కాని, మనము పగటివారము కనుక అప్రమత్తులమై ఉండవలెను. విశ్వాసమును, ప్రేమను కవచముగను, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగను మనము ధరింపవలెను.
9. దేవుని కోపమునకు గురికాక, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణను పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను.
10. యేసుక్రీస్తు వచ్చు దినమునకు మనము జీవించియున్నను, మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను.
11. కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు. ఒకరి కొకరు తోడ్పడుడు.
తుది ఉత్తర్వులు – శుభాకాంక్షలు
12. మీకు మార్గదర్శకులుగను, బోధకులుగను ఉండుటకు దేవునిచే ఎన్నుకొనబడి మీతో పనిచేయు వారికి తగినంత గౌరవమును ఈయవలసినదిగ సోదరులారా! మిమ్ము మేము బ్రతిమాలుకొనుచున్నాము.
13. వారు చేయు పనికొరకై వారిని అధికముగ ప్రేమతో గౌరవింపుడు. మీలో మీరు సమాధానముగ ఉండుడు.
14. సోదరులారా! సోమరిపోతులను హెచ్చరింపుడు, పిరికివారిని ప్రోత్సహింపుడు, బలహీనులకు తోడ్పడుడు, అందరితోడను ఓర్పువహింపుడు అని మిమ్ము అర్థించుచున్నాము.
15. ఎవ్వడును అపకారమునకు అపకారము చేయకుండ చూడుడు. అంతేకాక, ఎల్లవేళల ఒకరికొకరు ఉపకారము చేసికొనుటయు అందరికిని తోడ్పడుటయు మీ ధ్యేయముగా ఉంచుకొనుడు.
16. సర్వదా సంతోషముగ ఉండుడు.
17. సదా ప్రార్థింపుడు.
18. సర్వావస్థలయందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే.
19. ఆత్మను అడ్డగింపకుడు.
20. ప్రవచనమును తృణీకరింపకుడు.
21. సమస్తమును పరీక్షింపుడు. మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు.
22. అన్ని విధములైన చెడునకు దూరముగ ఉండుడు.
23. మనకు శాంతినొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక! మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహిత మొనర్చును గాక!
24. మిమ్ము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును. ఏలయన, ఆయన విశ్వసనీయుడు.
25. సోదరులారా! మా కొరకు కూడ ప్రార్థింపుడు.
26. సోదరులకు అందరకు పవిత్రమైన ముద్దుతో శుభాకాంక్షలను అందింపుడు.
27. ప్రభువు యొక్క అధికారముతో, ఈ లేఖను సోదరులకు అందరకును చదివి వినిపింపవలసినదిగ మిమ్ము అర్థించుచున్నాను.
28. మన ప్రభువగు యేసుక్రీస్తుయొక్క కృప మీతో ఉండునుగాక!