భాగ్యవంతులకు హెచ్చరిక

5 1. భాగ్యవంతులారా! నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి, రోదింపుడు.

2. మీ భాగ్యములు మురిగిపోయినవి. బట్టలు చెదలుపట్టినవి.

3. మీ బంగారము, వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షియై మీ శరీరములను అగ్నివలె దహించును. ఈ అంత్యదినము లందు మీరు ధనరాసులను కూడబెట్టితిరి.
4. ఇదిగో, మీ పొలములో పనిచేసినవారికి ఇచ్చుటలో మీరు మోసముగ బిగపట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకధిపతియైన దేవుని చెవుల చొచ్చుచున్నవి.

5. మీ ఐహిక జీవితము భోగ భాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి.

6. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు.

ఓర్పు, ప్రార్థన

7. కనుక, సోదరులారా! ప్రభువు విచ్చేయునంత వరకు ఓపికపట్టుడు. పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము, కడపి వర్షము సమకూరువరకు రైతు ఓర్పుతోఉండి ఆ విలువైన పంటకొరకు ఎదురు చూచుచున్నాడుగదా!

8. కాబట్టి మీరుకూడ ఓపికతో ఉండవలెను. ప్రభువు విచ్చేయుదినము సమీపించినది. కనుక ధైర్యముతో ఉండుడు.

9. సోదరులారా! మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు. అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చేయడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవేశింపనున్నాడు.

10. సోదరులారా! ప్రభు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములలోసహనమననేమియో ఎరుగుటకు వారినిఉదాహరణముగ గైకొనుడు.

11. వారు సహనమును చూపిరి. కనుకనే వారిని ధన్యులనుచున్నాము. యోబు సహనమును గూర్చి వినియున్నాము. చివరకు ప్రభువు అతనికి ఏమి ఏర్పాటుఒనర్చెనో మీకు తెలియును. ప్రభువు ఎంతయోజాలియును, కనికరమును కలవాడు కదా!

12. సోదరులారా! ముఖ్యముగా, మీరేదైన వాగ్దానము చేయునప్పుడు ఒట్టుపెట్టుకొనరాదు. పరలోకముపైగాని, అన్యధాగాని ప్రమాణము చేయకుడు. అయినచో అవుననియు, కానిచో కాదనియు మాత్రమే పలుకుడు. అప్పుడు మీరు దేవుని తీర్పునకు గురి కాకుందురు.

13. మీలో ఎవడైన కష్టములో ఉన్నాడా? అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైన సౌఖ్యముగా ఉన్నాడా? ఉన్నచో అతడు స్తుతింపవలెను.

14. మీలో ఎవ్వడైన వ్యాధిగ్రస్తుడా? అయినచో అతడు సంఘపుపెద్దలను పిలువవలెను.వారు అతనికొరకు ప్రార్థింతురు. ప్రభువు నామమున వానిపై తైలమును పూయుదురు.

15. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును. వాని పాపములు క్షమింపబడును.

16. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు. ఒకరికొకరు ప్రార్థించుకొనుడు.అప్పుడు మీరు స్వస్థులగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తిమంతమైనది.

17. ఏలీయా మనవంటివాడే. వానలు కలుగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితముగ మూడున్నర సంవత్సరములపాటు లోకమున వానలు లేకుండెను.

18.మరల అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమియందు పంటలుపండెను.

19. సోదరులారా! మీలో ఎవ్వడైన సత్యమునకు దూరమయ్యెననుకొనుడు. మరియొకడు వానిని తిరిగి సన్మార్గమునకు తెచ్చెననుకొనుడు.

20. అటులైన దీనిని జ్ఞాపకము ఉంచుకొనవలెను. పాపాత్ముని దుర్మార్గము నుండి మరలించువాడు వానిఆత్మను మృత్యుముఖమునుండి కాపాడినవాడు అగును. వాని అనేక పాపములను క్షమింపజేసినవాడు అగును.