సత్య, అసత్య ఆత్మలు

4 1. ప్రియులారా! కపట ప్రవక్తలు చాలమంది లోకమంతట వ్యాపించిఉన్నారు. కనుక ప్రతిఆత్మను నమ్మక ఆయాఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు.

2. అది దేవునిఆత్మ అగునో కాదో మీరు ఇట్లు తెలిసికొనగలరు: యేసు క్రీస్తు మానవశరీరము ధరించివచ్చెనని ఒప్పుకొను ప్రతిఆత్మ దేవుని సంబంధ మైనది.

3. కాని క్రీస్తును గూర్చి ఈ విషయము అంగీకరింపని ప్రతిఆత్మ దేవుని సంబంధమైనది కాదు. అట్టిఆత్మక్రీస్తు విరోధినుండి ఉద్భవించినది. అది వచ్చుచున్నదని దీనిని గూర్చియే మీరు వినియున్నారు. ఇప్పటికే అది లోకములోకి వచ్చియున్నది.

4. కాని చిన్నబిడ్డలారా! మీరు దేవునకు చెందిన వారై అసత్యప్రవక్తలను ఓడించితిరి. లౌకికులగు వారిలోనుండు ఆత్మకంటె, మీలోఉండు ఆత్మ శక్తిమంతమైనది. 5. వారు లౌకిక వ్యవహారములను గూర్చియే ముచ్చటింతురు. అయినను, వారు లౌకికుల గుటచే లోకము వారిని శ్రద్ధతో వినును.

6. కాని మనము దేవునకు సంబంధించినవారము. దేవుని ఎరిగిన ప్రతివ్యక్తియు మనలను వినును. దేవునితో సంబంధము లేనివాడు మనలను ఆలకింపడు. కనుక సత్యాత్మ, అసత్యాత్మల తారతమ్యమును మనము ఇట్లు గుర్తింపవచ్చును.

ప్రేమ స్వరూపి

7. ప్రియులారా! ప్రేమ దేవునినుండి పుట్టినది. కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించు వాడు దేవుని మూలముగ జన్మించినవాడు. అతడు దేవుని ఎరిగినవాడగును.

8. దేవుడు ప్రేమ స్వరూ పుడు. కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగని వాడే.

9. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగు టకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. 

10.  మనము దేవుని ప్రేమించితిమని కాదు. ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగ తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది.

11. ప్రియులారా! దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరియెడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను.

12. దేవుని ఎవరును, ఎన్నడును చూడలేదు. మనము ఒకరియెడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును.

13. ఆయన తనఆత్మను మనకు ఒసగుట వలన, మనము దేవునియందును, దేవుడు మనయందును ఉండుట మనకు రూఢి అగుచున్నది.

14. లోక రక్షకునిగ దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి. సాక్ష్యమిచ్చితిమి.

15. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తియైన ఒప్పుకొనినచో వానియందు దేవుడు, దేవునియందు అతడును ఉందురు.

16. దేవునకు మనపైగల ప్రేమ మనకు తెలియును. దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమస్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతనియందును ఉందురు.

17. తీర్పుదినమున మనము ధైర్యముతో ఉండునట్లు దైవప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలన, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమైఉన్నాము.

18. ప్రేమయందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమను దానికి శిక్షతో సంబంధము కలదు. కనుక, భయపడువాడు ఇంకను ప్రేమయందు పరిపూర్ణుడు కాలేదు.

19. దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము.

20. కాని ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ఎటుల ప్రేమింపగలడు?

21.  కనుక దేవుని ప్రేమించువాడు, తన సోదరుని కూడ ప్రేమింపవలెను అనునదియే క్రీస్తు మనకు ఒసగిన ఆజ్ఞ.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము