1 1. మనుష్యులనుండి కాని, మనుష్యునిద్వారా కాని కాక యేసుక్రీస్తు ద్వారా, ఆయనను మృతులలో నుండి లేవనెత్తిన తండ్రియగు దేవుని ద్వారా, అపోస్తలు నిగా పిలుపును పొందిన పౌలు వ్రాయునది.

2. ఇటనున్న సోదరులు అందరును నాతో కలసి గలతీ యలోని క్రైస్తవ సంఘములకు శుభాకాంక్షలను పంపు చున్నారు.

3. మన తండ్రియగు దేవుడును, ప్రభువగు యేసు క్రీస్తును మీకు కృపను సమాధానమును ప్రసాదింతు రుగాక!

4. ఈ ప్రస్తుత దుష్టయుగమునుండి మనకు విముక్తి కలిగించుటకై మన తండ్రియగు దేవుని సంకల్పమును అనుసరించి, మన పాపముల కొరకు క్రీస్తు ఆత్మార్ప ణము చేసికొనెను.

5. దేవునకు సదా మహిమ కలుగునుగాక! ఆమెన్‌.

ఏకైక సువార్త

6. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది! క్రీస్తుయొక్క కృపకు మిమ్ము పిలిచినవానిని ఇంత త్వరగా విడనాడి, మరియొక సువార్తవైపుకు మరలు చున్నారుగదా!

7. నిజమునకు అది మరియొక సువార్త కాదు. కాని కొందరు మిమ్ము కలవరపెట్టి, క్రీస్తు సువార్తను మార్పుచేయ ప్రయత్నించుచున్నారు.

8. మేము కాని, లేక దివినుండి దిగివచ్చిన దేవదూతయే కాని, మేము బోధించిన దానికంటె భిన్నమైన సువార్తను మీకు బోధించినయెడల అతడు శపింపబడునుగాక!

9. ఇది మేము పూర్వమే చెప్పియుంటిమి. కాని ఇప్పుడు  మరల  చెప్పుచున్నాము. మీరు స్వీకరించిన సువార్తకంటె వేరైన మరియొక సువార్త మీకు ఎవడేని బోధించినచో అతడు శాపగ్రస్తుడగునుగాక!

10. నేను ఇపుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా? లేక దేవుని ఆమోదమునా? లేక నేను మానవులను సంతోష పెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను.

పౌలు ప్రేషితత్వ ప్రస్తావన

11. సోదరులారా! నేను మీకు తెలియజేయు చున్నాను: నేను బోధించు సువార్త మానవకల్పితము కాదు.

12. నేను దానిని ఏ మనుష్యునివద్దనుండి పొందలేదు. ఎవ్వరును దానిని నాకు బోధింపలేదు. యేసు క్రీస్తే దానిని నాకు బయలుపరచెను.

13. పూర్వము నేను యూద మతమునందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగ హింసించి, దానిని నాశనముచేయ ప్రయత్నించితినో మీరు వినియున్నారుగదా!

14. యూదమతమును అవలంబించు టలో నా వయసుగల తోడియూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనైయుంటిని. మన పూర్వుల సంప్రదాయ ములపై ఎంతో ఆసక్తి కలిగియుండెడివాడను.

15. కాని నా తల్లి గర్భమునందే దేవుడు దయతో నన్ను తనసేవకై ప్రత్యేకించి పిలిచెను. 

16. ఆయనను అన్యులకు బోధించుటకుగాను, దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినపుడు నేను వెంటనే సలహాకొరకు ఏ మనుష్యుని వద్దకును పోలేదు.

17. నా కంటె ముందు అపోస్తలులైన వారిని చూచుటకు కూడ నేను యెరూషలేమునకు పోలేదు. కాని వెంటనే అరేబియాకు వెళ్ళిపోతిని. దమస్కు పట్టణ మునకు తిరిగివచ్చితిని.

18. మూడు సంవత్సరముల తరువాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో పదిహేను రోజులు గడిపితిని.

19. ప్రభువు సహోద రుడైన యాకోబును తప్ప నేను మరి ఏ ఇతర అపోస్తలుని చూడలేదు.

20. నేను మీకు వ్రాయుచున్న విషయములలో అబద్ధమాడుటలేదని దేవుని ఎదుట పలుకుచున్నాను.

21. తదనంతరము నేను సిరియా, సిలీషియాలలోని ప్రాంతములకు వెళ్ళితిని.

22. అంత వరకును యూదయాలోని క్రీస్తు సంఘముల వారికి నాతో ముఖపరిచయము లేకుండెను.

23. ”ఒకప్పుడు మనలను హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలనము చేయనెంచిన విశ్వాసమును బోధించుచున్నాడు” అని మాత్రము వారు వినుచుండిరి. 24. నన్నుగూర్చి వారు దేవుని స్తుతించిరి.