పౌలు – ఇతర అపోస్తలులు
2 1. అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత తీతును కూడ వెంటబెట్టుకొని బర్నబాతో తిరిగి యెరూషలేమునకు వెళ్ళితిని.
2. అటుల పోవలెనని దేవుడు నాకు తెలియజేయుటచేతనే నేను పోయితిని. నేను జరుపునదియు, జరిపినదియు, ఒకవేళ వ్యర్థమై పోవునేమో అని నేను అన్యులమధ్య వివరించుచున్న సువార్తను వారికి మరి ప్రత్యేకముగ పెద్దలని ఎంచబడిన వారికి విశదపరచితిని.
3. గ్రీసు దేశస్థుడేయైనను, నా తోడివాడగు తీతును సహితము సున్నతి పొందవలెనని బలవంతపెట్టలేదు.
4.కాని కొందరు సోదరులవలెనించి మా గుంపులో చేరి అతడు సున్నతి పొందవలెనని కోరిరి. వారు గూఢచా రులుగ రహస్యముగ మాయందు ప్రవేశించిరి. క్రీస్తు యేసుతో ఏకమగుటవలన మనకుగల స్వాతంత్య్ర మును వేగుచూచుట వారి ఉద్దేశము. మమ్ము బానిస లుగ చేయవలెనని వారి కోరిక.
5. కాని, సువార్త యందలి సత్యమును మీకు భద్రముగా ఉంచుటకు గాను, ఒక్క క్షణమైనను మేము వారికి లోబడలేదు.
6. కాని పెద్దలుగా ఎంచబడినవారు క్రొత్త సూచనలు ఏవియు నాకు చేయలేదు. వారు గతమున ఎట్టివారు అనునది నాకు అనవసరము. దేవుడు పక్షపాతము చూపడు.
7. అట్లుకాక, సున్నతి పొందిన వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు పేతురునకు అప్పగించినట్లే, సున్నతి పొందనివారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు నాకు అప్పగించె నని వారు గ్రహించిరి.
8. ఏలయన, సున్నతి పొందినవారికి పేతురును అపోస్తలుడుగా చేసినవాడే నన్నును అన్యులకు అపోస్తలునిగ చేసెను.
9. ఆధారస్తంభములుగ ఎంచబడిన యాకోబు, పేతురు, యోహానులు దేవుడు నాకు ఒసగిన ప్రత్యేక కృపావరమును గుర్తించిరి. మేము అన్యులలోను, వారు సున్నతి పొందిన వారల లోను పనిచేయవలెనని చెప్పి, తమతో భాగస్థుల మనుటకు సూచకముగ వారు నాతోను, బర్నబాతోను కుడిచేతితో కరచాలనము చేసిరి.
10. అచటి పేదలను మేము జ్ఞాపకము ఉంచుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. వాస్తవముగా అట్లు చేయుటకు నేను ఎంతయో ఆశించితిని.
పౌలు పేతురు భిన్నాభిప్రాయములు
11. పేతురు అంతియోకునకు వచ్చినపుడు స్పష్ట ముగ అతనిదే తప్పు కనుక, ముఖాముఖిగ నేను అతనిని వ్యతిరేకించితిని.
12. ఏలయన, యాకోబుచే పంపబడిన కొందరు అచటకు రాకమునుపు, పేతురు అన్యసోదరులతో కలిసి భుజించుచుండెడివాడు. కాని వీరు వచ్చిన తరువాత, అతడు అటుల చేయుట మానుకొని వారితో తినుటకు వెనుదీసెను. ఏలయన, అన్యులు సున్నతి పొందవలెనని వాదించువారికి అతడు భయపడుచుండెను.
13. మిగిలిన యూదులును అతనితోపాటు అటుల నటించిరి. బర్నబాకూడ వారి నటనకు లోనయ్యెను.
14. వారు సువార్తయందలి సత్యమును అనుసరించి ప్రవర్తించుటలేదు అని నేను గమనించిన తోడనే, వారి అందరి ఎదుట పేతురుతో ఇట్లంటిని: ”యూదుడవైన నీవు, యూదునివలెకాక అన్యునివలె జీవించుచుంటివి. అయినచో అన్యులు యూదులవలె జీవింపవలెనని నీవు ఎట్లు బలవంతము చేయగలవు?”
విశ్వాసము యూదుల,అన్యుల రక్షణసాధనము
15. నిజముగా, పుట్టుకచే మనము యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులముకాము.
16. కాని, ఎవడైనను యేసు క్రీస్తునందలి విశ్వాసముచేత నీతిమంతుడు అగును గాని, ధర్మశాస్త్రమును పాటించు టచే కాదని మనము ఎరుగుదుము. ధర్మశాస్త్రమును పాటించుటచే కాక, క్రీస్తునందలి విశ్వాసముచే మనము నీతిమంతులము అగుటకుగాను మనము కూడ యేసు క్రీస్తును విశ్వసించితిమి.
ఏలయన, ధర్మశాస్త్రమును పాటించుటచే ఎవడును నీతిమంతుడుకాడు.
17. అయినచో, క్రీస్తునందు నీతిమంతులు అగుటకు ప్రయ త్నించుచు అన్యులవలె మనమును పాపాత్ములముగా కనుగొనబడినచో అప్పుడు క్రీస్తు, పాపమునకు కారకుడేనా? ఎన్నటికిని కాదు!
18. నేను పడగొట్టిన వానిని తిరిగి నిర్మింప ప్రయత్నించినచో నేను ద్రోహిని అనుటకు అది నిదర్శనముకదా!
19. ధర్మశాస్త్రమునకు సంబంధించి నంతవరకు నేను మరణించినవాడనే. దేవుని కొరకు నేను జీవించుటకుగాను ధర్మశాస్త్ర విషయమున చనిపోయితిని. క్రీస్తుతోపాటు నేనును సిలువవేయ బడితిని.
20. కనుక ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రునియందలి విశ్వాసముచేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను.
21. దేవుని కృపను నేను నిరాకరింపను. ఎవడైనను ధర్మశాస్త్రమువలననే నీతిమంతుడు కాగలిగినచో క్రీస్తు మరణము వ్యర్థమే!