1 1. దైవసంకల్పముచే యేసుక్రీస్తు అపోస్తలుడగు పౌలు, క్రీస్తుయేసునందు విశ్వాసులైన ఎఫెసు లోని పవిత్ర ప్రజలకు వ్రాయునది:
2. మన తండ్రియగు దేవునినుండియు,
ప్రభువగు యేసుక్రీస్తునుండియు
మీకు కృపయు, శాంతి కలుగును గాక!
క్రీస్తునందు ఆధ్యాత్మిక ఆశీర్వాదములు
3. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! క్రీస్తునందు దేవుడు, మనలను ఆశీర్వదించి, మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగుచున్నాడు!
4. ఆయనఎదుట మనము పవిత్రులముగను, నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికిపూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగ ఎన్నుకొనెను.
5. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన, క్రీస్తుద్వారా మనలను కుమారులనుగ తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించు కొనియుండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము.
6. దేవుడు తన కుమారునిద్వారా మనకు ఉచితముగా ఒసగిన కృపావరమునకుమనముదేవుని స్తుతింతము.
7. క్రీస్తు రక్తమువలన మనము విముక్తుల మైతిమి. ఆయన కృపాఐశ్వర్యములచే మన పాప ములు క్షమింపబడినవి.
8. ఆయన మనకు అంత ఉదారముగా ఒసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది గదా!
9. తన సంపూర్ణజ్ఞానముచేతను, విషయ పరిచయముచేతను, దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక, క్రీస్తుద్వారా తాను పరిపూర్తి చేయదలచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను.
10. దివియందలి, భువియందలి సమస్తసృష్టిని క్రీస్తు నాయకత్వమున, ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెర వేర్చును.
11. సమస్తము దేవుని ప్రణాళికను, నిర్ణయ మును అనుసరించి జరుగును. కనుక, ఆదియందే ఆయన నిశ్చయించుకొనిన దానినిబట్టి, దేవుడు మన లను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు, తన ప్రజలుగ ఎన్నుకొనెను.
12. కనుక, క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమ ఫలమైన మనము దైవమహిమను స్తుతింతుముగాక!
13. మీ విషయములోను అంతే! మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్యసందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతట తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసా దించుటద్వారా మీరు తనవారుగ దేవుడు ధృవ పరచెను.
14. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగ మనము పొందుదుము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక!
క్రీస్తులో సంఘ ఐక్యత
15. యేసు ప్రభువునందలి మీ విశ్వాసమును, పవిత్ర ప్రజలందరిని గూర్చిన మీ ప్రేమను నేను వినియుంటిని. ఈ కారణముననే 16. మీ కొరకై దేవునకు కృతజ్ఞత లను అర్పించుట నేను ఏనాడును విరమింపలేదు. నా ప్రార్థనలలో మిమ్ము స్మరించి, 17. మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగ, మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును, మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించు చుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగ, ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి, దేవుని మీకు విదిత మొనర్చును.
18. ఆయన వెలుగును చూచునట్లుగ మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే, ఆయన మిమ్ము చేరబిలిచిన, ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దా నము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, 19. విశ్వాసులమగు మనలో వున్న ఆయన శక్తి ఎంత అతీ తమైనదో మీరు తెలిసికొనగలరు. 20. క్రీస్తును మృత్యువునుండి లేవనెత్తి పరలోకమున తన కుడిప్రక్కన కూర్చుండబెట్టుకొనినపుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది.
21. దివ్యులగు ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాథులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహపర లోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు.
22. దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను.
23. ఆ శ్రీసభయే క్రీస్తుశరీరము. సర్వత్ర సర్వమును పరిపూర్ణము చేయ గల ఆయనయొక్క పరిపూర్ణత్వమే దైవసంఘము.