బిడ్డలు – తల్లిదండ్రులు
6 1. బిడ్డలారా! ప్రభువునందు మీరు మీ తల్లి దండ్రులకు విధేయులై ఉండవలెను. ఇది మీ ధర్మము.
2. ”నీ తల్లిదండ్రులను గౌరవింపుము. అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ: అప్పుడు, 3. నీకు క్షేమము కలుగును. నీవు భువియందు చిర కాలము వర్ధిల్లుదువు”.
4. తండ్రులారా! మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను, ప్రభువు బోధనలోను పెంచుడు.
సేవకులు – యజమానులు
5. బానిసలారా! మానవులగు మీ యజమా నులకు విధేయతచూపుడు. వారిని గూర్చి భయ ముతోను వణకుతోనునడువుడు. కాని క్రీస్తునే సేవించు చున్నట్లుగ హృదయపూర్వకముగ అటుల చేయుడు.
6. వారి ముఖప్రీతికొరకై వారు చూచుచున్నపుడు మాత్రమే కాక, క్రీస్తు సేవకులుగ దేవుని సంకల్పమును హృదయపూర్వకముగ చేయుడు.
7. సేవకులుగ మీ పనిని సంతోషముతో చేయుడు. కేవలము మానవు లను సేవించుచుంటిమి అనుకొనక, ప్రభుసేవ చేయు చుంటిమిఅని భావింపుడు.
8. సేవకుడు కానిండు, స్వతంత్రుడు కానిండు, అతడు చేసిన పనికి దేవుడు ప్రతివ్యక్తిని బహూకరించునను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు.
9. యజమానులారా! మీ బానిసలపట్ల మీరును అట్లే ప్రవర్తింపుడు. వారిని భయపెట్టుట మానివేయుడు. మీరును మీ సేవకులును పరలోకమునందలి ఒకే యజమానునికి సంబంధించిన వారను మాట జ్ఞాప కము ఉంచుకొనుడు. ఆయనయందు పక్షపాతము ఉండదు.
దేవుని సంపూర్ణ కవచము
10. చివరిగా, ప్రభువుతో ఏకమై, ఆయన మహా శక్తి ద్వారా, మీ బలమును అభివృద్ధిపరచుకొనుడు.
11. సైతాను టక్కరిజిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు.
12. ఏలయన, మనము పోరాడునది రక్తమాంస ములతోనుండు శరీరధారులతో కాదు! ప్రధాను లతోను, అధికారులతోను, ఈ యుగపు అంధకార శక్తులతోను, ఆకాశమందలి దురాత్మలతోను మనము పోరాటము చేయుచున్నాము.
13. కనుక ఇపుడు దేవుని పూర్ణకవచమును ధరింపుడు! ఆ దుష్టదినము వచ్చిననాడు మీరు శత్రుబలములను ఎదుర్కొనగలిగి, తుదివరకు పోరాడి నిలద్రొక్కుకొందురు.
14. కనుక, సిద్ధపడుడు. సత్యమును నడుమునకు తోలుదిట్టీగా బిగింపుడు. నీతిని కవచముగా ధరింపుడు.
15. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకైన సంసిద్ధ తను మీ పాదరక్షలుగ చేసికొనుడు.
16. అన్ని సమయ ములందును, విశ్వాసమును డాలుగ చేసికొనుడు. దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటినిదానితో ఆర్పివేయగలరు.
17. రక్షణను శిరస్త్రాణ ముగను, దేవుని వాక్కును ఆత్మయొసగు ఖడ్గముగను, మీరు గ్రహింపుడు.
18.ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును, విజ్ఞాపనములతో ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు. పవిత్రప్రజల కొరకై సదాప్రార్థింపుడు.
19. ధైర్యముగా నోరువిప్పి మాట్లాడుచు సువార్త పరమరహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశము కలుగునట్లు ప్రార్థింపుడు.
20. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంకెళ్ళతో ఉన్నాను. కనుక నేను దానిని గూర్చివలసినంత ధైర్యముతో ప్రకటించునట్లు ప్రార్థింపుడు.
తుది శుభాకాంక్షలు
21. దైవసేవలో మన ప్రియ సోదరుడును, విశ్వాసపాత్రుడైన సేవకుడును అగు తుకికు నేను ఎట్లు జీవించుచున్నానో సమస్తమును మీకు తెలియజేయ గలడు.
22. కనుక, ఇచటి మా అందరి జీవితమును మీకు వివరించి, మీ హృదయములకు ధైర్యము చేకూర్చుటకై అతనిని మీ వద్దకు పంపుచున్నాను.
23. తండ్రి దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తును విశ్వాసముతో కూడిన సోదరులకు అందరకును, శాంతిని, ప్రేమను ప్రసాదించుగాక!
24. తరిగి పోని ప్రేమతో మన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించు వారందరికి దేవునికృప తోడగునుగాక!