తోడి క్రైస్తవులకు తోడ్పాటు
9 1. పవిత్రప్రజలకు పంపబడుచున్న సాయమును గూర్చి వ్రాయవలసిన అవసరము ఏ మాత్రము లేదు.
2. మీరు తోడ్పడుటకు సమ్మతింతురని నాకు తెలిసినదే. కనుకనే మాసిడోనియా ప్రజలకు మిమ్ము గురించి గొప్పగ చెప్పితిని. ”అకాయియలోని ప్రజలు క్రింది సంవత్సరమునుండి తోడ్పడుటకు సంసిద్ధులే” అని అంటిని. మీ ఆసక్తి వారిలో పెక్కుమందిని చైతన్యపరచినది.
3. కనుకనే ఈ సోదరులను మీ వద్దకు పంపుచున్నాను. మిమ్ము గూర్చి మేము పలికిన పొగడ్తలు వ్యర్థములు కాకుండుగాక! కాని నేను పలికినట్లు మీరు మీ సాయముతో సిద్ధముగా ఉందురుగదా!
4. అట్లుకాక, మాసిడోనియా ప్రజలు నాతోపాటు వచ్చి, మీరు సంసిద్ధులుగ లేరని కనుగొన్నచో మీరు సిగ్గుపడుమాట అటుండ మిమ్ము గూర్చి అంత దృఢవిశ్వాసము కలిగిన మేము ఎంత సిగ్గు పడుదుమోకదా!
5. కనుక ఈ సోదరులు నాకంటె ముందే మిమ్ము చేరునట్లు ప్రోత్సహించుట అవసరమని తలచితిని. మీరు వాగ్దానమొనర్చిన దానము వారు ముందుగనే సిద్ధమొనర్చెదరు. ఆవల నేను వచ్చినపుడు అది సిద్ధముగా ఉండగలదు. అంతేకాక మీరు ఈయవలసి వచ్చి ఇచ్చుటకాక, ఈయవలెననెడి కోరికచే ఇచ్చితిరని అది స్పష్టము చేయును.
6. విత్తనములు కొలదిగ చల్లినవానికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లినవానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచు కొనుడు.
7. కావున, చింతతోగాని, ఒత్తిడివలనగాని కాక ప్రతివ్యక్తియు తనకు తోచినట్లు దాన మొనర్ప వలెను, సంతోషముతో దానమొనర్చువానిని దేవుడు ప్రేమించును.
8. మీ అవసరముకంటె ఎక్కువగా దేవుడు మీకు ఈయగలడు. కనుక, మీరు సర్వదా అవసరమైనంత కలిగిఉండుటయేకాక, ప్రతి ఉచితకార్యము నకును అవసరమైన దానికంటె ఎక్కువ కలిగిఉందురు.
9.”పేదలకు ఆయన ఉదారముగ ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును” అని లేఖనము పలుకుచున్నది.
10. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చుదేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలయునో అన్నియు సమకూర్చి, వానిని వర్ధిల్లజేసి మీ ఉదారగుణమువలన మంచి పంట పండునట్లు చేయును.
11. మీరు సర్వదా ఉదారస్వభావులగునట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును. మా ద్వారా మీరు పంపు దానములకు పెక్కుమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పింతురు.
12. ఎట్లన, మీరు ఒనర్చు ఈ సేవ, పవిత్రప్రజల అవసరములకు సాయపడుటయే కాక, వారిచే దేవునకు అనంతముగా కృతజ్ఞతలను అందింప చేయును.
13. మీరు ఒనర్చిన ఈ సేవల నిదర్శ నమును బట్టి, మీరు బోధించు క్రీస్తు సువార్తయందు మీకుగల విశ్వాసమునకును, అందరితో పాలు పంచుకొను మీ ఉదారస్వభావమునకును అసంఖ్యాకులు దేవునకు మహిమ చెల్లింతురు.
14. దేవుడు మీపై ప్రదర్శించిన అసాధారణమగు కృపకు అనురాగముతో మీకై వారు ప్రార్థనలు సలిపెదరు.
15. మనము దేవుని అమూల్యమగు వరమునకు కృతజ్ఞతలను అర్పింతము!