4 1. కావున లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమొనర్చి ఉన్నను, ఆ విశ్రాంతియందు ప్రవేశింపక మీలో ఎవ్వరైనను తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందము.

2. వారు ఎట్లు వినిరో, అట్లే మనమును సువార్తను వింటిమి. వారు సందేశమును వినినను, అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము.

3. కావున, విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే,

               ”నేను కోపించి ఇట్లొక శపథమొనర్చితిని:

               ‘వారు ఎన్నడును నా విశ్రమస్థానమును

               ప్రవేశించి విశ్రమింపకుందురుగాక!’ ”

జగత్తును సృష్టించినప్పుడు ఆయన  పనులన్ని పూర్తియైయున్నను, ఆ విశ్రాంతినిగూర్చి ఆయన అటుల చెప్పెను.

4. మరియుఏడవ దినమును గూర్చి ఆయన ఒకచోట చెప్పియున్నట్లు: ”దేవుడు ఏడవ దినమున తన అన్ని పనులనుండి విశ్రమించెను.”

5. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది: ”వారు ఎన్నడును నా విశ్రమస్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక!”

6. ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశింపవలసి ఉన్నది. ముందు ఆ సువార్తను వినినవారు అనేకులు తమ అవిధేయతచేత ప్రవేశింపక పోయిరి. కనుక ఇతరులు లోపల ప్రవేశించి దేవునితోవిశ్రమింపగలరు.

7.’ఈదినము’ అను మరియొక దినమును దేవుడు నిర్ణయించుట దీనిని నిరూపించుచున్నది.

               ”ఈ దినము మీరు దేవుని మాట వినినచో,

               మీ హృదయములను కఠినపరచుకొనకుడి”

అని పరిశుద్ధ గ్రంథమునందు చాలాకాలము తరువాత దావీదు ద్వారా దేవుడు దానినిగూర్చి మరల పలికెను.

8. యెహోషువ ప్రజలను దేవుని విశ్రాంతికి నడిపియున్నచో, తదనంతరకాలమున మరియొకదినమును గూర్చి దేవుడు పలికి ఉండెడివాడు కాడు.

9. కావున ఎటులైనను, సప్తమదిన విశ్రాంతి దేవుని ప్రజలకొరకై ఇంకను మిగిలియున్నది.

10. దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే దేవునితో విశ్రమించు ఏ వ్యక్తియైనను తన పనులనుండి విశ్రాంతిని పొందును.

11. కావున దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగ కృషిచేయుదము. వారివలె మనము, మనలో ఏ ఒక్కడును అవిధేయుడై పోకుండా, విశ్రాంతిలో ప్రవేశింపయత్నించుదము.

12. దేవుని వాక్కు సజీవమును, చైతన్యవంతము నైనది. అది పదునైన రెండంచుల ఖడ్గముకంటెను పదునైనది. జీవాత్మల సంయోగస్థానమువరకును, కీళ్ళు, మజ్జ కలియువరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు.

13. దేవునివద్ద నుండి దాచగలిగినది ఏదియును లేదు. సర్వసృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము.

యాజకాగ్రగణ్యుడగు యేసు

14. ఆకాశమండలముగుండ వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగ నిలిచియుందము.

15. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధానయాజకుడు. అంతేకాక మనవలెనే అన్ని విధములుగా శోధింపబడియు, పాపము చేయని వ్యక్తి మన ప్రధానయాజకుడు.

16. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము.