దయ్యము పట్టిన వానికి స్వస్థత

(మత్తయి 8:28-34; లూకా 8:26-39)

5 1. పిదప వారు సరస్సునకు ఆవలనున్న గెరా సేనుల దేశమును చేరిరి.

2. యేసు పడవనుండి దిగినవెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలోనుండి ఆయనయొద్దకు వచ్చెను.

3. సమాధులలో నివసించుచున్నవానిని గొలుసులతో కూడ బంధింప ఎవరికిని సాధ్యము కాకుండెను.

4. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలుసేతులు కట్టివేసినను, వాడు ఆ గొలుసులను త్రెంపివేయు చుండెను. కనుక, వాడు ఎవ్వరికిని స్వాధీనము కాక పోయెను.

5. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందును, కొండకోనలయందును నివసించుచు, అరచుచుండెను. రాళ్ళతో తననుతాను గాయపరచు కొనుచుండెను.

6. వాడు దూరమునుండియే యేసును చూచి, పరుగెత్తుకొనివచ్చి పాదములపైబడి, 7. ఎలుగెత్తి ”సర్వోన్నతుడవగు దేవుని కుమారా! యేసూ! నాజోలి  నీకేల?  నన్ను  హింసింపవలదు. దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను” అని మొరపెట్టెను.

8. ”ఓరీ! అపవిత్రాత్మా! వీని నుండి వెడలిపొమ్ము” అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టెను.

9. పిమ్మట ఆయన ”నీ పేరేమి?” అని వానిని ప్రశ్నించెను. వాడు  అందులకు ”నా పేరు  దళము. ఎందుకనగా మేము అనేకులము” అని జవాబిచ్చెను.

10. ”మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు” అని ఆయనను మిక్కిలి వేడుకొనెను.

11. అపుడు ఆ కొండప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను.

12. ”మమ్ము అందరిని ఆ పందులమందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు” అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను.

13. ఆయన అట్లే అనుమతించెను. అంతట ఆ దయ్యములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి రెండువేల సంఖ్యగల ఆ మంద నిట్టనిలువు గానున్న మిట్టనుండి సరస్సులోపడి మునిగి ఊపిరాడక చచ్చెను.

14. అపుడు పందులను మేపువారు పరుగెత్తి పట్టణములలో పరిసర పల్లెపట్టులలో ఈ సమాచార మును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి.

15. దయ్యముపట్టిన వాడు వస్త్రములు ధరించి, స్వస్థుడై కూర్చుండి ఉండుటనుచూచి వారు భయపడిరి.

16. పందుల సంఘట నను, దయ్యములు పట్టినవానికి జరిగినది చూచిన వారు ఇతరులకు దానిని తెలియజేసిరి. 17. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి.

18. అంతట యేసు పడవ నెక్కునపుడు ”నన్ను మీ వెంటరానిండు” అని దయ్యముపట్టినవాడు ప్రార్థించెను.

19. అందుకు ఆయన సమ్మతింపక, ”నీవు నీ ఇంటికి, నీ బంధువులయొద్దకు పోయి, ప్రభువు నిన్ను కనికరించి, నీకుచేసిన మేలునుగూర్చి వారికి తెలియ చెప్పుము” అని వానిని ఆజ్ఞాపించెను.

20. వాడు పోయి, యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెకపోలి (అనగా పది పట్టణములు) ప్రాంతమున ప్రకటింప సాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్య పడిరి.

పాలకుని ప్రార్థన

(మత్తయి 9:18-26; లూకా 8:40-56)

21. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా, జనసమూహము ఆయన యొద్దకు చేరెను.

22. అటుల ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా, ప్రార్థనామందిరపు అధికారులలో ఒకడైన యాయీరు అనువాడువచ్చి, ప్రభువు పాదముల పై పడి, 23. ”ప్రభూ! నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి, ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థతపొంది, జీవింపగలదు”  అని  మిగుల బ్రతిమాలెను.

24. అంతట ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్పజనసమూహము ఆయనను వెంబడించుచు పైపైబడుచుండెను.

రక్తస్రావ రోగికి స్వస్థత

25. పండ్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ 26. ఎన్నో బాధలు పడి, ఎందరో వైద్యులయొద్ద  చికిత్సపొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను, ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెచ్చుపెరిగెను.

27. ఆమె యేసును గూర్చి విని, జనసమూహములోనుండి ఆయన వెనుకగా వచ్చి, 28. ”ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును” అని తలంచి ఆయన వస్త్ర ములను తాకెను.

29. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తనశరీరములో ఆ జబ్బునుండి స్వస్థతపొందినట్లు గుర్తించెను.

30. అపుడు తననుండి శక్తివెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి ”నా వస్త్రములను తాకిన వారెవ్వరు?” అని ఆ జన సమూహమును ప్రశ్నించెను.

31. ”ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారుగదా! ‘నన్ను తాకినదెవరు’ అని ప్రశ్నించుచున్నారేల?” అని శిష్యులు పలికిరి.

32. తనను తాకినది ఎవరో తెలిసి కొనవలెనని ఆయన నలుదెసలు తేరిపారజూచెను.

33. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడవణకుచు, ఆయన పాదములపైబడి జరిగిన దంతయు విన్నవించెను.

34. అందుకాయన ఆమెతో ”కుమారీ! నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము” అని పలికెను.

యాయీరు కుమార్తెకు ప్రాణదానము

35. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యకక్షుడగు యాయీరు ఇంటినుండి కొందరు వచ్చి ”నీ కుమార్తె మరణించినది. గురువును ఇంకను శ్రమపెట్టనేల?” అనిరి.

36. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక, ఆ మందిరాధ్యక్షునితో, ”నీవు ఏ మాత్రము అధైర్య పడకుము. విశ్వాసమును  కలిగియుండుము”  అని చెప్పెను.

37. పిదప పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును మాత్రము తనవెంట తీసి కొని, 38. ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచట జన సమూహము గొల్లున ఏడ్చుటయు,ప్రలాపించుటయు చూచి, 39. ఆయన లోపలికి ప్రవేశించి, ”మీరు ఏల ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు! ఈ బాలిక నిద్రించుచున్నదిగాని, చనిపోలేదు” అని వారితో పలికెను.

40. అందులకు వారు ఆయనను హేళనచేసిరి. అయినను, యేసు అందరిని వెలుపలకు  పంపి, ఆ బాలిక తల్లి దండ్రులతోను, తన శిష్యులతోను బిడ్డ పరుండియున్న గదిలో ప్రవేశించెను.

41. ఆ బాలిక చెయ్యిపట్టుకొని ”తలితాకూమీ” అనెను. ”ఓ బాలికా! లెమ్మని నీతో చెప్పుచున్నాను” అని ఈ మాటలకు అర్థము.

42. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె పండ్రెండేండ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరు ఆశ్చర్యచకితులైరి.

43. ”దీనిని ఎవరికిని వెల్లడింపకుడు” అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ”ఆమెకు తినుటకు ఏమైనపెట్టుడు” అని చెప్పెను.