స్వజనుల నిరాదరణ

(మత్తయి 13:53-58; లూకా 4:16-30)

6 1. ఆయన అక్కడనుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి.

2. విశ్రాంతిదినమున ప్రార్థనామందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన  బోధనలను వినుచున్న  జనులు ఆశ్చర్యపడి, ”ఈయనకు ఇవి అన్నియు ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుతకార్యములను ఎట్లు చేయుచున్నాడు?

3. ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను  అనువారల సోదరుడు కాదా? ఈయన అక్క చెల్లెండ్రు మనమధ్య ఉన్నవారు  కారా?”  అని  చెప్పుకొనుచు తృణీకరించిరి.

4. ”ప్రవక్త తన పట్టణమునను, బంధువులమధ్యను, తన ఇంటను తప్ప ఎచటనైనను గౌరవింపబడును” అని యేసు వారితో పలికెను.

5. ఆయన అచట కొలదిమంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచెను కాని, మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయెను.

6. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి, ప్రజలకు బోధింపసాగెను.

వేద ప్రచారము

(మత్తయి 10:5-15; లూకా 9:1-6)

7. యేసు పన్నిద్దరు శిష్యులను తనచెంతకు పిలిచి, బోధించుటకు జంటలుగా వారిని   గ్రామము లకు పంపుచు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను.

8. ”ప్రయాణములో మీరు చేతికఱ్ఱను తప్ప మరిఏమియు తీసికొనిపోరాదు. రొట్టెగాని, జోలెగాని, సంచిలో ధనమునుగాని వెంటతీసుకొని పోరాదు.

9. పాదరక్షలు తొడుగుకొనుడు కాని, రెండు అంగీలను తీసికొనిపోవలదు.

10. మీరు ఎచ్చట ఒకఇంట పాదముమోపుదురో, అచటి నుండి వెడలి పోవునంతవరకు ఆ ఇంటనే ఉండుడు. 11. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో, వారికి తిరస్కారసూచకముగా మీ కాలి దుమ్మును అచట దులిపి, వెళ్ళిపొండు” అని యేసు తన శిష్యులతో చెప్పెను.

12. అంతట ఆయన శిష్యులు పోయి, ప్రజలు పశ్చాత్త్తాపముతో హృదయపరివర్తనము పొందవలెనని బోధించిరి. 13. వారు అనేక పిశాచములను పార ద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థ పరచిరి.

యోహాను శిరచ్ఛేదనము

(మత్తయి 14:1-12; లూకా 9:7-9)

14. ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. ”స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను. అందువలననే ఇతనియందు అద్భుత శక్తులు కార్యరూపములు తాల్చుచున్నవి” అని కొందరు  15. ”ఇతడు ఏలియా” అని మరికొందరు, ”ఇతడు ప్రవక్తలలో ఒకనివలె ఉన్నాడు” అని ఇంక కొందరును చెప్పుకొనుచుండిరి.

16. కాని, అది వినిన హేరోదు ”నేను శిరచ్ఛేదనము గావించిన యోహానే మృతులనుండి లేపబడెను” అని పలికెను. 17. తన తమ్ముడగు ఫిలిప్పుభార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానునుపట్టి, బంధించి, చెరసాలలో పడవేసెను. ఏలయన, అతడు హేరోదియాను వివాహమాడియుండెను.

18. అంతే కాక యోహాను ”నీవు నీ సహోదరుని భార్యను వివాహ మాడుట సరికాదు” అని హేరోదును హెచ్చరించు చుండెను.

19.హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. కాని, ఆమెకు అది సాధ్యము కాకపోయెను.

20 ఏలయన, యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలతచెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను.

21. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మ దినోత్సవమున కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలీయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను.

22. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి, హేరోదు ప్రభువునకు, ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అపుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి ”నీ ఇష్టమైన దానిని కోరుకొనుము. ఇచ్చెదను.  

23. నీవు ఏమి కోరినను, నా అర్ధ రాజ్యము నైనను ఇచ్చెదను” అని ప్రమాణ పూర్వకముగా పలికెను.

24. అపుడు ఆమె వెలుపలకు పోయి, తన తల్లితో ”నేనేమి కోరుకొనవలెను?” అని అడుగగ, ఆమె ”స్నాపకుడగు యోహాను తలను కోరుము” అని చెప్పెను.

25. అంతట ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, ”స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పళ్ళెములో పెట్టి ఇప్పింపుము” అని కోరెను.

26. అందులకు రాజు మిగుల బాధపడెను. కాని, అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను.

27. కనుక, అతడు ”యోహాను తలను తీసికొనిరమ్ము” అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి, 28. ఒక పళ్ళెములోపెట్టి  ఆ బాలికకు ఈయగా, ఆమె తన తల్లికి ఇచ్చెను.

29. ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి, ఆ భౌతిక దేహమును తీసికొనిపోయి సమాధిచేసిరి.

ఐదువేల మందికి ఆహారము

(మత్తయి 14:13-21; లూకా 9:10-17; యోహాను 6:1-14)

30. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను, బోధలను తెలియచేసిరి.

31. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే, ఆయన వారితో ”మీరు ఏకాంత స్థలమునకు వచ్చి, కొంత తడవు విశ్రాంతి తీసికొనుడు” అని చెప్పెను.

32. అంతట వారందరు ఒక పడవనెక్కి సరస్సును దాటి, ఒక నిర్జనస్థలమునకు వెళ్ళిరి.

33. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కులనుండి వారికంటె ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చిచేరిరి.

34. యేసు పడవనుదిగి, జనసమూహమును చూచి కాపరిలేని గొఱ్ఱెలవలెనున్న వారిపై కనికరముకలిగి, వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను.

35. వేళ అతిక్రమింపగా, శిష్యులు ఆయనను సమీపించి, ”ఇది నిర్జనప్రదేశము. ఇప్పిటికే చాల ప్రొద్దుపోయినది. 36. ఇక వీరిని పంపివేయుడు. పరిసరమునగల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజనపదార్థములను చూచుకొందురు” అని  విన్నవించిరి.

37. అపుడు యేసు ”మీరే వీరికి కావలసిన భోజనసదుపాయములను చేయుడు” అని చెప్పెను. అందుకు వారు ”మేము వెళ్ళి రెండువందల దీనారములను వెచ్చించి, రొట్టెలను కొని వీరందరికి పంచిపెట్టుమందురా?” అని అడిగిరి.

38. ”మీయొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయిచూడుడు” అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప ”ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నవి” అని చెప్పిరి.

39. అంతట యేసు, ఆ జనసమూహమును ”పచ్చికబయళ్ళపై పంక్తులు దీరి కూర్చుండుడు” అని ఆజ్ఞాపించెను.

40. అపుడు ఆ జనులు నూరునూరుగా, ఏబది, ఏబదిగా పంక్తులుదీరి కూర్చుండిరి.

41. ఆయన ఐదురొట్టెలను, రెండుచేపలను అందుకొని, ఆకాశము వైపు కన్నులెత్తి, కృతజ్ఞతావందనములు సలిపి, ఆశీర్వదించి, రొట్టెలను త్రుంచి ”జనులకు వడ్డింపుడు” అని శిష్యులకు అందించెను. అటులనే ఆ రెండుచేపలను అందరకు వడ్డనచేయించెను.

42. అందరు సంతృప్తిగా భుజించిరి.

43. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేపముక్కలను ప్రోవుచేసి పండ్రెండు గంపలకు నింపిరి.

44. భుజించినవారు ఐదువేల మంది పురుషులు.

నీటిపై నడక

(మత్తయి14:22-33; యోహాను 6:15-21)

45. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి, ఆవలి తీరమందలి ‘బెత్సయిదా’ పురమును చేరవలెనని చెప్పెను.

46. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వతప్రాంతమునకు వెళ్ళెను.

47. సాయం సమయమునకు ఆ పడవ సరస్సుమధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగ ఉండెను. 48. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువజామున ఆయన వారిని దాటి పోవలయునని, నీటిపై నడచుచు వారిచెంతకు వచ్చెను.

49. అటుల సముద్రముపై నడచివచ్చు యేసును చూచి, ‘భూతము’ అని తలంచి, వారు కేకలు వేసిరి.

50. ఏలయన, వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు, ”ధైర్యము వహింపుడు. నేనే కదా! భయపడకుడు” అనెను.

51. అంతట ఆయన వారిపడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి.

52. వారు ఐదురొట్టెల అద్భుతములోని ఆంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలయన వారి హృదయములు కఠినమాయెను.

గెన్నెసరేతు తీరమున స్వస్థత

(మత్తయి 14:34-36)

53. వారు సరస్సును దాటి, గెన్నెసరేతు ప్రాంతము చేరి, పడవను అచట కట్టి వేసిరి.

54. వారు పడవ నుండి వెలుపలికి వచ్చినవెంటనే, అచి జనసమూహము ఆయనను గుర్తించెను.

55. పిమ్మట వారు పరిసరప్రాంతములకెల్ల పరుగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసికొనివచ్చిరి.

56. గ్రామములలోగాని, పట్టణములలోగాని, మారుమూల పల్లెలలోగాని, యేసు ఎచట ప్రవేశించినను జనులు సంతలలో, బహిరంగ స్థలములలో రోగులనుంచి, ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. ఆ విధముగా ఆయనను తాకిన వారందరును స్వస్థతపొందుచుండిరి.