భూస్వామి – కౌలుదార్లు

(మత్తయి 21:33-46; లూకా 20:9-19)

12 1. యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. ”ఒకడు ద్రాక్షతోటను వేసి దానిచుట్టు కంచెనాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి, గోపురమును కట్టించి, కౌలుదార్లకు గుత్తకుఇచ్చి, దేశాటనము వెడలెను.

2. పంటకాలమున ఆ కౌలు దార్లనుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదార్లవద్దకు తన సేవకునొకనిని పంపెను.

3. కాని, వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి.

4. ఆ యజమానుడు మరియొక సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి.

5. అంతట యజమానుడు మరియొక సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి  మరికొందరిని చంపివేసిరి.

6. ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారియొద్దకు పంపెను.

7. ఆ కౌలుదార్లు వానిని చూచి ‘ఇదిగో ఇతడే వారసుడు. రండు, ఇతనిని తుద ముట్టింతము. ఈ ఆస్తి మనకు దక్కును’ అని తమలోతాము చెప్పుకొనిరి.

8. ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టిచంపి తోటవెలుపల పారవేసిరి.

9. ”అప్పుడు ద్రాక్షతోట యజమానుడు, కౌలుదారులను ఏమిచేయును?” అని యేసు ప్రశ్నించెను. ”అతడు వచ్చి ఆ దుష్టులను మట్టు పెట్టి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును” అని వారు పలికిరి.

10. ”ఈ లేఖనమును మీరు చదువ లేదా?

               ‘ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి

               ముఖ్యమైన మూలరాయి ఆయెను.

11.ఇది ప్రభువు ఏర్పాటు,

               ఎంత ఆశ్చర్యకరము!’ ”

అని యేసు పలికెను.

12. ఈ ఉపమానము విశేషించి తమ్ము గురించి పలికెనని యూద ప్రముఖులు గ్రహించి ఆయనను బంధింపదలచిరి. కాని, జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి.

సుంకమును గూర్చిన సమస్య

(మత్తయి 22:15-22; లూకా 20:20-26)

13. అంతట వారు యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడపన్ని పరిసయ్యులలో, హేరోదీయులలో కొందరిని ఆయనవద్దకు పంపిరి.

14. వారు వచ్చి ”బోధకుడా! నీవు సత్యసంధుడవు. ఎవరికిని భయపడవు. మోమాటము లేనివాడవు. దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించు వాడవు. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయ సమ్మతమా? కాదా? నీ అభిప్రాయమేమి? అని అడిగిరి.

15. యేసు వారి కపటోపాయమును గుర్తించి, ”నన్ను ఏల పరీక్షింతురు? సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు” అని అడుగగా 16. వారు ఒక దీనారమును ఆయనకు అందించిరి.  అపుడు  ఆయన ”అందలి రూపమును,  నామధేయమును ఎవరివి?” అని వారిని ప్రశ్నింప, ”కైసరువి” అని వారు ప్రత్యుత్తర మిచ్చిరి.

17. ”అట్లయిన కైసరువి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు” అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి.

మృతుల పునరుత్థానము

సద్దూకయ్యుల పన్నాగము

(మత్తయి 22:23-33; లూకా 20:27-40)

18.  అపుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, 19. ”బోధకుడా!  ఒకడు సంతానములేక మరణించిన యెడల, అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలుగజేయవలయునని మోషే ఆజ్ఞాపించెనుకదా!

20. ఒకానొకప్పుడు ఏడుగురు అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను.

21. రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను. కాని అతడును సంతానము లేకయే మరణించెను. మూడవవానికిని ఆ గతియే పట్టెను.

22. అట్లే ఏడుగురికిని సంభవించెను. తుట్టతుదకు ఆమెయు మరణించెను.

23. ఆ ఏడుగురు సోదరులు ఆమెను వివాహమాడిరికదా! పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును?” అని ప్రశ్నించిరి.

24. అందులకు యేసు ”మీరు లేఖనములను, దేవుని శక్తిని ఎరుగక పొరబడు చున్నారు.

25. పునరుత్థానమైన పిదప వారు వివాహము చేసికొనరు, వివాహమునకు ఈయబడరు, పరలోక మందలి దేవదూతలవలె ఉందురు.

26. ‘నేనే అబ్రహాముదేవుడను, నేనే ఈసాకుదేవుడను, నేనే యాకోబుదేవుడను’, అని మండుచున్న పొదనుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదువలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్థావనకాదా?

27. మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడుకాని మృతులకుకాదు అని ప్రత్యుత్తర మిచ్చెను.

ప్రముఖ శాసనము

(మత్తయి 22:34-40; లూకా 10:25-28)

28. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి, యేసు చక్కగా సమాధానము ఇచ్చెనని గ్రహించి, ”ఆజ్ఞలన్నిలో ప్రధానమైనది ఏది?” అని ప్రశ్నించెను.

29. అందుకు యేసు ”యిస్రాయేలీయులారా! వినుడు. మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు.

30.  నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, పూర్ణఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణశక్తితోను ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ.

31. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానినిప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరియొకటి లేదు” అని సమాధానమిచ్చెను.

32. అప్పుడతడు ”బోధకుడా! నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే. ఆయన తప్ప మరియొకడు లేడు. 33. ఆయనను పూర్ణ హృదయముతోను, పూర్ణమనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకొనునట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుటయు, సమస్త దహనబలులకంటెను సమస్త బలులకంటెను ఘనమైనది” అని పలికెను.

34. చక్కగా సమాధాన మిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు ”దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు” అనెను. అటుతరువాత ఆయనను ఎవరును ఏమియును అడుగుటకు సాహసింపలేదు.

మెస్సయాను గూర్చిన ప్రశ్న

(మత్తయి 22:41-46; లూకా 20:41-44)

35. యేసు దేవాలయములో బోధించుచు, ”క్రీస్తు దావీదుకుమారుడని ధర్మశాస్త్రబోధకులు ఎట్లు చెప్పుచున్నారు?

36. దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను: ‘నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నాకుడిప్రక్కన కూర్చుండుము అని ప్రభువు, నా ప్రభువుతో1 పలికెను.’

37. ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును?” అని ప్రశ్నించెను. జనసమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆలకించుచుండిరి.

ధర్మశాస్త్రబోధకులను గూర్చి హెచ్చరిక

(మత్తయి 23:1-36; లూకా 20:45-47)

38. యేసు ఇట్లు ఉపదేశించుచు ”మీరు ధర్మ శాస్త్ర బోధకుల విషయమై కడుజాగరూకులై మెలగుడు. వారు నిలువుటంగీలను ధరించి తిరుగుటను, అంగడి వీధులలో వందనములు అందుకొనుటకును కోరుకొందురు.

39. ప్రార్థనామందిరములందు ప్రధానాసనములను, విందులయందు అగ్రస్థానములను వారు కాంక్షింతురు. 40. వారు దీర్ఘజపములను చేయునట్లునించుచు, వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురికాగలరు” అనెను.

విధవరాలి కానుక

(లూకా 21:1-4)

41. పిమ్మట యేసు కానుకలపెట్టెయొద్ద కూర్చుండి, అందు ప్రజలు కానుకలు వేయురీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండిరి.

42. అప్పుడు ఒక పేదవిధవరాలు వచ్చి, రెండు నాణెములను మాత్రమే వేసెను.

43. ఆయన శిష్యులను పిలిచి, ”ఈ కానుక పెట్టెలో డబ్బులువేసిన వారందరికంటె ఈ పేదవిధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని అనెను.

44. ”ఏలయన, వారందరు తమ సమృద్ధినుండి కానుకలు వేసిరి. కాని ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు, తన జీవనాధార మంతయు త్యాగము చేసినది” అనెను.