క్రీస్తుపై కుట్ర

(మత్తయి 26:1-5; లూకా 22:1-2;  యోహాను 11:45-53)

14 1. పాస్క, పులియని రొట్టెల పండుగకు రెండు దినములు ముందు ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కపోపాయముచే యేసును ఏ విధముగా  బంధించి చంపుదుమా అని సమాలోచనము చేయ సాగిరి.

2. కాని ప్రజలలో అలజడి కలుగునని, అది పండుగలో చేయతగదని తలంచిరి.

బెతానియాలో అభిషేకము

(మత్తయి 26:6-13; యోహాను 12:1-8)

3. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా ఒక స్త్రీ విలువైన పరిమళతైలముగల పాత్రతో వచ్చి, ఆ పాత్రను పగుల గొట్టి, దానిని ఆయన శిరస్సుపై పోసెను.

4. అది చూచిన కొందరు కోపపడి ”ఈ వృథా వ్యయము ఎందులకు?

5. దీనిని మూడువందల దీనారములకంటె ఎక్కువధరకు అమ్మి పేదలకు దానము చేయవచ్చునుగదా!” అని ఆమెను గూర్చి సణుగుగొనసాగిరి.

6. యేసు అది గ్రహించి వారితో ”ఈమె జోలికి పోవలదు, ఈమెను మీరేల నొప్పించెదరు? నా పట్ల ఈమె మంచిపనియే చేసినది.

7. పేదలు మీతో ఎల్లప్పుడును ఉందురు.  మీ  ఇష్టము వచ్చినప్పుడెల్ల వారికి మీరు సహాయపడవచ్చును. కాని, నేను మీతో ఎల్లప్పుడు ఉండను.

8. ఈమె తన శక్తికొలది చేసినది. భూస్థాపనార్థము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళముతో అభిషేకించినది.

9. ప్రపంచము నందంతట ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసినది, ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింప బడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” అనెను.

గురు ద్రోహము

(మత్తయి 26:14-16; లూకా 22:3-6)

10. పన్నిద్దరిలో ఒకడగు యూదాఇస్కారియోతు యేసును పట్టియిచ్చుటకై ప్రధానార్చకులవద్దకు వెళ్ళెను.

11. అది విని వారు మిగుల సంతసించి వానికి కొంతరొక్కమును ఇచ్చుటకు వాగ్దానము చేసిరి. కనుక వాడు ఆయనను పట్టియిచ్చుటకు కాచుకొని యుండెను.

కడరాత్రి భోజనము

(మత్తయి 26:17-25; లూకా 22:7-14, 21-23; యోహాను 13:21-30)

12. పాస్కబలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదిదినమున శిష్యులు యేసువద్దకు వచ్చి ”మేము మీకు ఎచ్చట పాస్కభోజనమును సిద్ధపరుప గోరుచున్నారు?” అని అడిగిరి.

13. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు ”మీరు పట్టణములోనికి పొండు. అచట కడవతో నీటి ని తీసికొనివచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును.

14. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో ”నా శిష్యులతో నేను పాస్క భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడ? అని మా గురువు అడుగుచున్నాడు” అని చెప్పుడు.

15. అప్పుడు అతడు మేడపై సిద్ధపరుపబడిన విశాలమైన గదిని మీకు చూపును. అందు మనకు పాస్కభోజన మును సిద్ధపరపుడు” అని చెప్పెను.

16. అంతట ఆశిష్యులు బయలుదేరి నగర ములో ప్రవేశించి, యేసు చెప్పినట్లు కనుగొని పాస్కభోజనమును సిద్ధపరచిరి.

17. సాయంసమయమున పన్నిద్దరు శిష్యులతో యేసు అచ్చటకు వచ్చెను.

18. వారు భోజనము చేయుచుండ ఆయన వారితో ”ఇక్కడ నాతో భుజించుచున్న మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించునని మీతో నిజముగా చెప్పుచున్నాను” అనెను.

19. అందుకు వారు మిగులచింతించి ”నేనా? నేనా?” అని ఒక్కొక్కరు అడుగసాగిరి.

20. అందుకు ఆయన ”పన్నిద్దరిలో ఒకడు నాతో ఈ పాత్రలోనే రొట్టెను అద్దుకొనువాడే.”

21. ”మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడినట్లు ఆయన మరణించును. కాని, మనుష్యకుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము! అతడు జన్మింపకుండిన అతనికి మేలుగా ఉండెడిది” అనెను.

ప్రభు భోజనము

(మత్తయి 26:26-30; లూకా 22:14-20; 1 కొరి. 11:23-25)

22. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని, ఆశీర్వదించి, త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు ”దీనిని మీరు తీసికొని భుజింపుడు. ఇది నా శరీరము” అనెను.

23. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దానినుండి వారు అందరు త్రాగిరి.

24. యేసు వారితో ”ఇది అనేకుల కొరకు చింద బడనున్న నూతననిబంధనయొక్క నా రక్తము.

25. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షరసమును నూతన ముగా పానముచేయు దినమువరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను” అనెను.

26. వారొక స్తుతిగీతము పాడిన పిదప ఓలివుకొండకు వెళ్ళిరి.

పేతురు బొంకు – ప్రభు ప్రవచనము

(మత్తయి 26:31-35; లూకా 22:31-34; యోహాను 13:36-38)

27. అప్పుడు యేసు వారితో ”మీరు నన్ను విడిచి పోయెదరు. ఏలయన

‘నేను గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, 

గొఱ్ఱెలన్నియు చెల్లాచెదరగును’

అని వ్రాయబడియున్నది.

28. కాని నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటె ముందుగా గలిలీయసీమకు వెళ్ళెదను” అని పలికెను.

29. ”అందరు మిమ్ము విడిచివెళ్ళినను నేను మాత్రము మిమ్ము విడిచివెళ్ళను” అని పేతురు పలికెను.

30. అందుకు యేసు ”ఈ రాత్రి కోడి రెండవమారు కూయకమునుపే నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.

31. అప్పుడు పేతురు ఆయనతో ”మీతో మరణింపవలసివచ్చినను నేను మిమ్ము ఎరుగను అని బొంకను” అని నొక్కి పలికెను. అటులనే శిష్యులందరును పలికిరి.

గెత్సెమనిలో ఆవేదన

(మత్తయి 26:36-46; లూకా 22:39-46)

32. అంతట యేసు తనశిష్యులతో గెత్సెమని తోటకువచ్చి, ”నేను ప్రార్థనచేసికొని వచ్చువరకు మీరు ఇచట కూర్చుండుడు” అని చెప్పెను.

33. పేతురును, యాకోబును, యోహానులను తనతో వెంటబెట్టుకొని పోయెను. అప్పుడు ఆయన ఆవేదనపడుచు చింతాక్రాంతుడాయెను.

34. ఆయన వారితో ”నా ఆత్మ మరణవేదన పడుచున్నది. మీరు ఇచటనే ఉండి జాగరణచేయుడు” అని పలికెను. 35. ఆయన కొంత దూరము వెళ్ళి, నేలపై సాగిలపడి, సాధ్యమైనయెడల ఆ గడియ తననుండి తొలగిపోవలయునని ప్రార్థించెను.

36. ”అబ్బా! తండ్రీ! నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. ఈ పాత్రమును నానుండి తొలగింపుము. అయినను, నా ఇష్టము కాదు. నీ చిత్తమే నెరవేరనిమ్ము” అని ప్రార్థించెను.

37. అంతట ఆయన తన శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుటను చూచి, పేతురుతో, ”సీమోనూ! నిద్రించుచున్నావా?ఒక గంట సేపయినను మేల్కొని ఉండలేకపోతివా?” అని, 38. వారితో ”మీరు శోధనకు గురికాకుండుటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తికలిగియున్నను, దేహము దుర్బలముగా ఉన్నది” అనెను.

 39. ఆయన మరల రెండవమారు వెళ్ళి, అట్లే ప్రార్థించెను.

40. తిరిగివచ్చి, వారి నేత్రములు నిద్రాభారముచే మూతబడుచుండుట చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెనో వారికి తోచలేదు.

41. ఆయన మూడవపర్యాయము వచ్చి, వారితో ”మీరు ఇంకను నిద్రించుచు, విశ్రమించు చున్నారా? ఇక చాలును. గడియ సమీపించినది. ఇదిగో! ఇప్పుడే మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు.

42. లెండు, పోదము రండు. నన్ను పట్టియిచ్చువాడు సమీపించుచున్నాడు” అనెను.

శత్రువుల చేతిలో ప్రభువు

(మత్తయి 26:47-56; లూకా 22:47-53; యోహాను 18:3-12)

43.ఆయన ఇట్లు మాటలాడుచుండగా పన్నిద్దరిలో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలపెద్దలు పంపిన జనసమూహము కత్తులను, బడితలను చేతబూని అతనితో వచ్చెను.

44. ”నేను ఎవరిని ముద్దుపెట్టుకొందునో అతడే ఆయన. అతనిని పట్టి బంధించి, భద్రముగా తీసికొని పొండు” అని ఆ గురుద్రోహి వారికి ఒక గురుతును ఇచ్చెను.

45. అతడు యేసు వద్దకు వచ్చిన వెంటనే ‘రబ్బీ’ అని ఆయనను ముద్దుపెట్టుకొనెను. 46. వారు ఆయననుపట్టి బంధించిరి.

47. వెంటనే అచట నిలిచియున్న వారిలో ఒకడు తన కత్తిని తీసి, ప్రధానార్చకుని సేవకునికొట్టి వాని చెవి తెగనరికెను.

48. యేసు వారలతో ”మీరు నన్ను పట్టుకొనుటకు కత్తులను, బడితలను తీసికొని దొంగపైకి వచ్చినట్లు వచ్చితిరా? 

49. ప్రతిదినము నేను దేవాలయములో మీమధ్య ప్రసంగించుచుంటిని, మీరు అపుడు నన్ను పట్టుకొనలేదు. కాని, లేఖనములు ఇట్లు నెరవేరవలసి ఉన్నవి” అనెను.

50. అపుడు శిష్యులు అందరు ఆయనను విడిచి పారిపోయిరి.

51. యువకుడు ఒకడు తన దిగంబర శరీరముపై నారవస్త్రము వేసికొని యేసును అనుసరించుచుండెను. వారు అతనిని పట్టుకొనిరి.

52. కాని అతడు నార వస్త్రము విడిచి దిగంబరుడై పారిపోయెను.

న్యాయపీఠము ఎదుట యేసు

(మత్తయి 26:57-68; లూకా 22:54-55, 63-71; యోహాను 18:13-14, 19-24)

53. వారు యేసును బంధించి, ప్రధానార్చకుని యొద్దకు తీసికొనిపోయిరి. అచట ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు  అందరు  సమావేశమైరి.

54.పేతురు దూరదూరముగ యేసును అనుసరించుచు ప్రధానార్చకుని గృహప్రాంగణమును ప్రవేశించి పరిచారకులతో కలసి చలిమంటయొద్ద కూర్చుండెను.

55. ప్రధానార్చకులు, న్యాయస్థానాధిపతులందరు యేసుకు మరణశిక్ష విధించుటకై అబద్ధపుసాక్ష్యములు వెదుకనారంభించిరి. కాని వారికి ఏమియు లభింప లేదు.

56. జనులు అనేకులు ఆయనకు విరుద్ధముగా తప్పుడు సాక్ష్యములు చెప్పిరి. కాని వారి సాక్ష్యములు ఒకదానితో ఒకి పొసగలేదు.

57. అపుడు కొందరులేచి ఆయనకు విరుద్ధముగా సాక్ష్యము ఇచ్చుచు, 58. ”మానవనిర్మితమగు ఈ దేవాలయమును ధ్వంసముచేసి తిరిగి మూడు దినములలో మానవనిర్మితము కాని వేరొక దేవాలయ మును నిర్మింపగలనని ఇతడు చెప్పుచుండగా మేము స్వయముగా వింటిమి” అనిరి.

59. కాని, ఈ సాక్ష్యము కూడ సరిపడలేదు.

60. అపుడు ప్రధానార్చకుడు లేచి సభామధ్య మున నిలువబడి యేసును చూచి, ”నీపై మోపబడిన నేరమునకు ఏమి సమాధానము ఇచ్చెదవు?” అని ప్రశ్నించెను.

61. ఆయన బదులు పలుకక మౌనము వహించెను. మరల ప్రధానార్చకుడు ఆయనను ”దేవుని కుమారుడవు అగు క్రీస్తువు నీవేనా?” అని ప్రశ్నించెను.

62. అందుకు యేసు ”అవును, నేనే. సర్వశక్తిమంతుని కుడిప్రక్కన మనుష్యకుమారుడు కూర్చుండియుండుటయు, ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటయు  మీరు చూడగలరు” అని సమాధానము ఇచ్చెను. 

63.  అపుడు ప్రధానార్చకుడు మండిపడుచూ, తన వస్త్రములను చింపుకొని ”ఇప్పుడు ఇక మనకు సాక్షు లతో పనియేమి?

64. ఇతని దేవదూషణ మీరును వింటిరికదా! మీ ఉద్దేశమేమి?” అని అడిగెను.వారందరు ఏకకంఠముతో ”ఇతడు మరణదండనకు పాత్రుడు” అని నిర్ణయించిరి.

65. కొందరు ఆయనపై ఉమిసిరి. మరి కొందరు ఆయన ముఖమును మూసి, గ్రుద్దుచు, ”నిన్ను గ్రుద్దినవారెవరు? ప్రవచింపుము!” అని హేళన చేసిరి. భటులు ఆయనను పిడికిళ్ళతో గ్రుద్దిరి.

పేతురు బొంకు

(మత్తయి 26: 69-75; లూకా 22:56-62; యోహాను 18:15-18, 25-27)

66. పేతురు ఆ గృహప్రాంగణమున ఉండగా ప్రధానార్చకుని దాసీలలో ఒకతె వచ్చి, 67. చలి కాచుకొనుచున్న పేతురును చూచి ”నీవు కూడ నజరేతు నివాసియగు యేసు వెంట ఉన్నవాడవుకావా?”  అని  ప్రశ్నించెను.

68. అందుకు అతడు ”నేను ఏమియు ఎరుగను. నీవు ఏమి చెప్పునది నాకు తెలియుట లేదు” అని బొంకుచు, పంచలోనికి వెళ్ళిపోయెను. వెంటనే  కోడికూసెను.

69. అచట ఉన్న దాసి అతనిని చూచి దగ్గర నిలిచియున్నవారితో ”ఈతడు వారిలోని వాడే” అని పలికెను. 70. అతడు మరల బొంకెను. ఆ పిదప, అచట ఉన్నవారు పేతురునుచూచి, ”నీవు నిశ్చయ ముగా వారిలోని వాడవే, నీవును గలిలీయ నివాసివే” అనిరి.

71. అందుకు పేతురు శపించుకొనుచు, ఆనపెట్టి ”మీరు చెప్పుచున్న ఆ మనుష్యుని ఎరుగనే ఎరుగను” అని పలికెను.

72. అంతలో రెండవ పర్యాయము కోడికూసెను. ”కోడి రెండుపర్యాయ ములు కూయకమునుపే ముమ్మారు నీవు నన్ను ఎరుగనని పలుకుదువు” అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము రాగా పేతురు వెక్కివెక్కి ఏడ్చెను.