మృత్యుంజయుడు
(మత్తయి 28:1-10; లూకా 24:1-12; యోహాను 20:1-10)
16 1. విశ్రాంతి దినము గడచిన తరువాత మగ్దలా మరియమ్మ, యాకోబుతల్లి మరియమ్మ, సలోమియమ్మ యేసు భౌతికదేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములనుకొని, 2. ఆదివారము వేకువజామున బయలుదేరి సూర్యోదయసమయమునకు సమాధిని చేరిరి.
3. ”సమాధి ద్వారమునుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు?” అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి.
4. అది ఒక పెద్దరాయి. కాని వారు వెళ్ళి చూచునప్పిటి కే ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి.
5. వారు సమాధి లోనికి పోగా, తెల్లనివస్త్రములు ధరించి సమాధి కుడిప్రక్కన కూర్చుండియున్న ఒక యువకుని చూచి ఆశ్చర్యచకితులైరి.
6. అతడు వారితో ”మీరు భయపడకుడు. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకు చున్నారు. ఆయన పునరుత్థానుడయ్యెను. ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు.
7. మీరు వెళ్ళి పేతురునకు, తక్కిన శిష్యులకు ‘ఆయన మీకంటె ముందు గలిలీయకు వెళ్ళుచున్నాడు. తాను చెప్పినట్లు మీరు ఆయనను అచట చూచెదరు’ అని చెప్పుడు” అనెను.
8. వారు ఆశ్చర్యముతోను, భయముతోను, బయటకువచ్చి అచటనుండి పరుగెత్తిరి. వారు భయ పడినందున ఎవ్వరితో ఏమియు చెప్పలేదు.
సుదీర్ఘ సమాప్తము
మగ్దలా మరియమ్మకు దర్శనము
(మత్తయి 28:9-10; యోహాను 20:11-18)
9. ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్థాను డైన యేసు, తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలామరియమ్మకు మొదట దర్శనమిచ్చెను.
10. ఆమె వెళ్ళి ఆయనతో ఉండినవారును, దుఃఖసాగర ములో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందజేసెను.
11. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి.
ఇద్దరు శిష్యులకు దర్శనము
(లూకా 24:13-35)
12. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శన మిచ్చెను. 13. వారు ఇద్దరు తిరిగివచ్చి తక్కినవారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు.
శిష్యులందరకు దర్శనము
(మత్తయి 28:16-20; లూకా 24:36-49; యోహాను 20:19-23; అ.కా. 1:6-8)
14. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యమునకును వారిని గద్దించెను.
15. మరియు ఆయన వారితో ఇట్లనెను: ”మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.
16. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపనివానికి దండన విధింపబడును.
17. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. అన్యభాషలను మ్లాడెదరు.
18. పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకర మైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములనుంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు.”
మోక్షారోహణము
(లూకా 24:50-53; అ.కా. 1:9-11)
19. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను.
20. పిదప శిష్యులు వెళ్ళి అంతట సువార్తనుప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు, అద్భుతములద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను.
సంక్షిప్త సమాప్తము
9. ఆ స్త్రీలు వెళ్ళి పేతురుతోను, ఆయన సహచ రులతోను ఈ సంగతులను గూర్చి సంక్షిప్తముగా తెలియజేసిరి. పిదప పవిత్రమును, సజీవమును అగు ఈ నిత్యరక్షణ సువార్తను యేసే తన శిష్యుల మూలమున లోకమంతట వ్యాపింపజేసెను.