15 1. బలవంతులమైన మనము మనలను మనము సంతోషపెట్టుకొనక బలహీనుల లోపములను సహింపవలెను.

2. అంతేకాక, మనలో ప్రతి వ్యక్తియు, తన సోదరుని మేలుకొరకు వాని క్షేమాభి వృద్ధికొరకు వానిని సంతోష పెట్టవలెను.

3. ఏలయన, క్రీస్తు తనను తాను సంతోషపెట్టుకొనలేదు.

”నిన్ను నిందించువారి నిందలు

నా పైననే పడినవి”

అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

4. ఏలయన, వ్రాయబడినవి అన్నియు మనకు బోధించుట కొరకే వ్రాయబడినవి. లేఖనములు మనకు ఒసగు సహనము ప్రోత్సాహముల ద్వారా మనకు నిరీక్షణ కలుగుట కొరకే అవి వ్రాయబడినవి. 

5.  సహనమునకును, ప్రోత్సాహమునకును కర్తయగు దేవుడు, క్రీస్తుయేసును అనుసరించుట ద్వారా మీకు పరస్పరము సామరస్యమును కలిగించునుగాక!

6. అప్పుడు మీరు అందరును కలిసి ఏకకంఠముతో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడును, తండ్రియును అయిన ఆయనను స్తుతింతురు.

అన్యజనులకు సువార్త

7. కనుక, క్రీస్తు మిమ్ము స్వీకరించినట్లే, దేవుని మహిమకై మీరు ఒకరిని ఒకరు స్వీకరింపుడు.

8. ఏలయన, నేను ఒక్క విషయమును చెప్పుచున్నాను.  వినుడు! పితరులకు ఒసగిన  వాగ్దానములను నెరవేర్చుటలో  దేవుడు  సత్యవంతుడని  చూపుటకును,                  

9. ఆయన కనికరమునకై అన్యజనులు దేవుని స్తుతించునట్లు చేయుటకును, క్రీస్తు సున్నతి పొందినవారికి పరిచారకుడు అయ్యెను.

”కనుక, అన్యులలో నేను నిన్ను స్తుతింతును.

నీ నామ సంకీర్తనము చేయుదును”

అని వ్రాయబడియున్నట్లుగ:

10.         మరల, ”అన్యజనులారా!

               ఆయన ప్రజలతో ఆనందింపుడు!”

అనియు అది పలుకుచున్నది.

11.           తిరిగి, ”అన్యజనులారా!

               మీరందరును  ప్రభువును స్తుతింపుడు!

               ప్రజలందరును ఆయనను స్తుతింపుడు!”

అనియు అదియే చెప్పుచున్నది.

12.          అటులనే యెషయా,

               ”యీషాయినుండి ఒకడు వచ్చును.

               అన్యులను పరిపాలించుటకు 

               ఆయన ఉద్భవించును.

               వారు ఆయన యందు

               నమ్మకము కలిగియుందురు”

అని పలికెను.

13. నిరీక్షణకు మూలమగు దేవుడు, ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణమగు ఆనందమును, సమాధానమును కలిగించునుగాక! పవిత్రాత్మ ప్రభావమున మీ నిరీక్షణ సంపూర్ణమగును.

విశేషాధికారము – పౌలు వివరణము

14. నా సోదరులారా! మీ వరకు మీరు మంచి తనముతోను, సమస్త జ్ఞానముతోను నిండినవారై ఒకరికి ఒకరు ఉపదేశించుకొనగలరని నేను నమ్ముచున్నాను.

15. కాని ఎంతయో ధైర్యముతో మీకు కొన్ని విషయములను గుర్తుచేయుటకు వ్రాసితిని. దేవుని అను గ్రహము వలననే నేను అంతధైర్యమును చూపితిని.

16. క్రీస్తు యేసు సేవకుడనై అన్యులకొరకు పని చేయుటకే నేను అనుగ్రహమును పొందితిని. అన్యులు పవిత్రాత్మ ద్వారా దేవునకు అంకితము కావింపబడి, ఆయనకు అంగీకారయోగ్యమైన నైవేద్యము అగుటకై, దేవుని సువార్తను బోధించుటలో నేను ఒక అర్చకునిగ పనిచేయుచున్నాను.

17. కావున క్రీస్తు యేసునందు దేవునికొరకై నేను చేసిన వానిని గూర్చి గర్వింప వచ్చును.

18. క్రీస్తు నా ద్వారా, నా మాటల వలనను, చేతల వలనను, 19. సూచకక్రియల చేతను, అద్భు తముల చేతను, ఆత్మయొక్క శక్తి మూలమునను, అన్య జనులను దేవునకు విధేయులను చేయుటకై చేసిన దానిని గూర్చి మాత్రమే ధైర్యమువహించి పలికెదను. కనుక, యెరూషలేమునుండి ఇల్లూరికు వరకు పయనించుటవలన క్రీస్తునుగూర్చిన సువార్తను సంపూర్ణ ముగ ప్రకించితిని.

20. ఎవరో వేసిన పునాదిపై నిర్మింపకుండుటకై, క్రీస్తునుగూర్చి వినని ప్రదేశము లోనే సువార్తను ప్రకటింపవలెననునది సర్వదా నా గాఢ వాంఛయై యున్నది.

21.          ”ఆయనను గూర్చి తెలియజేయబడనివారు

               చూతురు. విననివారు అర్థము చేసికొందురు”  అని లేఖనమునందు వ్రాయబడియున్నది గదా!

రోమును చూచుటకై పౌలు ఆలోచన

22. ఈ కారణముననే, మీవద్దకు రాకుండ అనేక మార్లు నాకు ఆటంకములు కలిగినవి.

23.కాని, ఈ ప్రాంతములలో నా పని ఇప్పటికి పూర్తియైనది. అంతేకాక మిమ్ము చూడ రావలయునని చాల కాలము నుండి ఆశించుచున్నాను.

24. ఇప్పుడు స్పెయిను దేశమునకు పోవుచు త్రోవలో మిమ్ము చూచి, కొంత కాలము మీతో ఆనందముగ గడిపి, నా ప్రయాణమునకు మీ తోడ్పాటును పొందగల ననుకొనుచున్నాను.

25. కాని ప్రస్తుతము యెరూషలేములోని దైవప్రజల సేవకై నేను అచ్చటికి పోవుచున్నాను.

26. ఏలయన, మాసిడోనియా, గ్రీసులోని దైవసంఘములు యెరూషలేము నందలి దైవప్రజలలోని పేదలకు సాయపడ వలెనని నిర్ణయించినవి.

27. వారి యంతట వారే అటుల చేయుటకు నిర్ణయించుకొనిరి. కాని  నిజముగా,  ఆ పేదలకు సాయపడ వలసిన బాధ్యత వారికి ఉన్నది. ఏలయన, యూదులు తమ ఆధ్యాత్మిక ఆశీర్వాదములను అన్యులతో పంచుకొనిరి. కనుకనే తమ ఐహికమైన ఆశీర్వాదములతో అన్యులు  యూదు లకు సాయపడవలెను.

28. కావున ఈ పనిని ముగించి, వారి కొరకై ప్రోగు చేయబడిన ఈ ధనము వారికి అప్పగించిన తరువాత, నేను స్పెయినుకు వెళ్ళుచు, త్రోవలో  మిమ్ము  చూచెదను.

29. నేను మీయొద్దకు వచ్చునపుడు, క్రీస్తుయొక్క సంపూర్ణ ఆశీర్వాదముతో చేరుదునని నాకు తెలియును.

30.  సోదరులారా!  నాకొరకై దేవుని ఆసక్తితో ప్రార్థించి నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువగు యేసు క్రీస్తును బట్టియు, ఆత్మయొక్క ప్రేమను బట్టియు మిమ్ము అర్థించుచున్నాను.

31. యూదయాలోని అవిశ్వాసుల నుండి నేను రక్షింపబడునటులును, యెరూషలేములో నా సేవలు అచటి దైవప్రజలకు అంగీకార యోగ్యమగునట్లును ప్రార్థింపుడు.

32. కనుక, అది దేవుని చిత్తమైన, నేను సంతోషముతో మిమ్ముచేరి, మీతో ఆనందింపగలను.

33. సమాధానకర్తయగు దేవుడు మీ అందరితో ఉండును గాక! ఆమెన్‌.