క్రీస్తు పునరుత్థానము
15 1. సోదరులారా! నేను బోధించునదియు మీరు గ్రహించినదియు, మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తనుగూర్చి మీకు జ్ఞాపకము చేయనెంచు చున్నాను.
2. మీరు ఉద్దేశరహితముగ విశ్వసించి ఉండిననే తప్ప, నేను మీకు బోధించిన విధముగ మీరు దానికి గ్టిగ అంటిపెట్టుకొని ఉంటిరేని, మీరు రక్షింపబడుదురు.
3. నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. లేఖనమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను.
4. లేఖనమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి, మూడవ దినమున సజీవుడుగ లేవనెత్తబడెను.
5. ఆయన పేతురునకు తదుపరి పండ్రెండుమంది అపోస్తలుల కునుకనబడెను.
6. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో ఐదువందలమందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియేయున్నారు.
7. ఆపైన యాకోబునకును తదుపరి అపోస్తలులకందరికిని ఆయన కనబడెను.
8. అకాలమందు జన్మించినట్లున్నవాడనైనను, చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను.
9. ఏలయన, అపోస్తలులందరిలో నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడనగుటచే అపోస్తలుడనని పిలువబడుటకు నేను అయోగ్యుడను.
10. కాని దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలులకంటె నేను ఎంతయో అధికముగా శ్రమించితిని. కాని అది నిజముగ నా ప్రయాస కాదు. అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే.
11. కనుక, నేను కాని, వారు కాని మేమందరమును బోధించునది ఇదియే. ఇదియే మీరు విశ్వసించినది.
మన పునరుత్థానము
12. మృత్యువునుండి క్రీస్తుజీవముతో లేవనెత్త బడెనని గదా మా సందేశము! మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు?
13. అదియే నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనియే గదా దాని అర్థము!
14. మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
15. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తెననుటచే, దేవుని విషయములో మేము అసత్యమాడినట్లే. ఏలయన, మరణించినవారు జీవముతో లేవనెత్త బడరనునదియే నిజమైనచో, దేవుడు ఆయనను లేవ నెత్తనట్లేకదా!
16. మృతులు లేవనెత్తబడనిచో, క్రీస్తు లేవనెత్తబడలేదు.
17. క్రీస్తు లేవనెత్తబడనిచో, మీ విశ్వాసము వ్యర్థము. మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు.
18. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే.
19. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితముకొరకే అయినచో, ప్రపంచములో అందరికంటెను మనము అత్యంత దయనీయులము.
20. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువునుండి లేవనెత్త బడినవారిలో ప్రథముడనుట సత్యము.
21. ఏలయన, ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే, మృతుల పునరుత్థానము కూడ ఒక మనుష్యుని మూలముననే వచ్చినది.
22. ఆదాము నందు అందరు ఎట్లు మృతి చెందుచున్నారో, అటులనే క్రీస్తు నందు అందరు బ్రతికింపబడుదురు.
23. కాని ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే: ప్రథమఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు.
24. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరిని క్రీస్తు జయించి రాజ్యమును తండ్రియగు దేవునికి అప్పగించును.
25. ఏలయన, దేవుడు శత్రువులనందరను ఓడించి ఆయన పాదములక్రింద ఉంచువరకు క్రీస్తు పరిపాలింపవలెను.
26. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు.
27. ”ఏలయన దేవుడు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచెను” అని లేఖనము పలుకుచున్నది. సమస్తము, అనగా దేవుడు మినహా సమస్తమును, ఆయనయే క్రీస్తు పాదముల క్రింద ఉంచెననునది సుస్పష్టము.
28. కాని, సమస్తమును క్రీస్తు పాలనకు లోనుగావించిన తరువాత, కుమారుడగు ఆయనయే సమస్తమును తనకు లోబరచిన దేవునకు తనను తాను లోబరచుకొనును. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును.
29. మరి మృతులకొరకై జ్ఞానస్నానమును పొందిన వారి విషయమేమి? వారు ఏమి సాధింప గోరెదరు? వారు చెప్పుకొను విధమున మరణించిన వారు మరల లేవనెత్తబడరనుటయే యథార్థమైనచో, మరి మృతులకొరకై వారు ఏల జ్ఞానస్నానమును పొందుచున్నారు.
30. మరి మనకు ఏల అనుక్షణ మును ప్రమాదములు సంభవించుచున్నవి?
31. సోదరులారా! ప్రతిదినమును నేను మృత్యుముఖమును చూచుచున్నాను? మన ప్రభువగు యేసు క్రీస్తు నందలి మన జీవితమున మీయందు నాకున్న గర్వము నాచే ఇట్లు చెప్పించుచున్నది.
32. కాని, మనుష్య రీతిగా ఎఫెసులోని మృగములతో నేను పోరాడియున్నచో నేను పొందిన లాభమేమి? మరణించినవారు జీవముతో లేవనెత్తబడనిచో, ”రేపు మనము మర ణింతుము కనుక హాయిగా తిని త్రాగుదము.”
33. మోసపోకుడు: ”దుష్టసాంగత్యము మంచి నడవడికను నాశనము చేయును.”
34. జ్ఞానము కలిగి పాపమార్గమునుండి మరలిపోవుడు. మీలో కొందరు దేవుని ఎరుగరు. మీరు సిగ్గుపడుటకై యిట్లు చెప్పు చున్నాను.
పునరుత్థాన శరీరము
35. ”చనిపోయినవారు ఎట్లు జీవముతో లేవనెత్తబడుదురు? వారికి య్టెి శరీరముండును?” అని ఎవడైన ప్రశ్నింపవచ్చును.
36. మూర్ఖుడా! ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు అది మరణింపనిదే మొలకెత్తదు.
37. నీవు భూమిలో నాటునది విత్తనము మాత్రమే. నీవు నాటునది గోధుమగింజయో, లేక మరియొకటియో; కాని పెద్దది కాబోవు మొక్కకాదు.
38. తన సంకల్పమును అనుసరించి దేవుడు దానికి శరీరమును ఒసగును. ఒక్కొక్క గింజ కును దానికి తగిన శరీరమును ఒసగును.
39. అట్లే జీవకోటియొక్క శరీరములన్నియు ఒకే విధముగా ఉండవు. మానవులకు ఒక విధము, జంతువులకు మరియొక విధము, పకక్షులకు వేరొక విధము, చేపలకు ఇంకొక విధము.
40. అట్లే ఆకాశ వస్తురూపములును, భూవస్తురూపములును ఉన్నవి. భూవస్తు రూపముల వైభవము ఒక విధమైనది. ఆకాశ వస్తురూపముల వైభవము వేరొక విధమైనది.
41. సూర్యుని వైభవము ఒక విధము. చంద్రునిది వేరొక విధము. నక్షత్రములది మరియొక విధము. ఆ నక్షత్రములలోను పెక్కువిధములగు వైభవములున్నవి.
42. మృతులు పునర్జీవితులు చేయబడునపుడు ఇట్లుండును: శరీరము క్షయమగునదిగా విత్తబడి అక్షయమగునదిగా లేపబడును.
43. అది గౌరవము లేనిదిగా విత్తబడి, వైభవముగలదిగా లేపబడును. అది బలహీనమైనదిగా విత్తబడి, బలముగలదిగా లేప బడును.
44. భౌతికశరీరముగా అది విత్తబడి, ఆధ్యాత్మిక శరీరముగా అది లేపబడును. భౌతికశరీరము ఉన్నది కనుక ఆధ్యాత్మికశరీరమును ఉండవలెను.
45. ఏలయన, ”మొదటి మానవుడు ఆదాము సజీవిగ సృష్టింపబడెను” అని లేఖనము పలుకుచున్నది. కాని, చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ.
46. మొదట వచ్చునది ఆధ్మాత్మికమైనది కాదు. మొదట భౌతికము, తదుపరి ఆధ్మాత్మికము.
47. మొదటి ఆదాము భువియందలి మట్టితో చేయబడెను. రెండవ ఆదాము దివినుండి వచ్చెను.
48. భువికి సంబంధించిన వారు భువినుండి చేయబడినవానిని పోలియుందురు. దివికి సంబంధించిన వారు దివినుండి వచ్చినవానిని పోలియుందురు.
49. భువినుండి పుట్టిన వానిని పోలి యుండిన మనము దివినుండి వచ్చిన వాని పోలికను పొందగలము.
50. సోదరులారా! నా భావమిది: రక్త మాంసములతో చేయబడినది దేవుని రాజ్యమున పాలుపంచు కొనలేదు. భౌతికమైనది అమరత్వమును పొందలేదు.
51. ఈ రహస్యమును వినుడు. అందరమును మరణింపము. కాని, చివరి బాకా మ్రోగగానే, 52. రెప్పపాటులో మనయందు మార్పు సంభవించును. ఏలయన, అది మ్రోగుటతో మృతులు అమరులై లేవ నెత్తబడుదురు. మనము అందరమును మారిపోవుదుము.
53. ఏలయన, భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనవలెను. మరణించునది మరణింపని దానిని ధరించుకొనవలెను.
54. కనుక భౌతికమయినది అమరమయిన దానిని కప్పుకొనినపుడు, మరణించునది మరణింపనిదానిని ధరించినపుడు,
”మృత్యువు నాశనము చేయబడినది;
విజయము సంపూర్ణము”
అను లేఖనవాక్యము యథార్థమగును.
55. ఓ మృత్యువా! నీ విజయము ఎక్కడ? ఓ మృత్యువా! బాధకలిగింపగల నీ ముల్లు ఎక్కడ?
56. మరణపు ముల్లు పాపము. పాపమునకున్నబలము ధర్మశాస్త్రమే.
57. కాని మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు!
58. కనుక, ప్రియతమ సోదరులారా! దృఢముగా స్థిరముగా నిలబడుడు. ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధచూపుడు. ఏలయన, ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియునుగదా!