కానా పల్లెలో పెండ్లి
2 1. మూడవ దినమున గలిలీయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచటఉండెను.
2. యేసు, ఆయన శిష్యులును ఆ వివాహమునకు ఆహ్వా నింపబడిరి.
3. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి ”వారికి ద్రాక్షరసము లేదు” అని ఆయనతో చెప్పెను.
4. ”స్త్రీ! అది నాకేమి? నీకేమి? నా గడియ ఇంకను రాలేదు” అని యేసు పలికెను.
5. ఆయన తల్లి సేవకులతో ”ఆయన చెప్పినట్లు చేయుడు” అనెను.
6. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ ఆరురాతి బానలుండెను. ఒక్కొక్క బానలో రెండు మూడు కడవల నీరుపట్టును.
7. ”ఆ బానలను నీటితో నింపుడు” అని యేసు వారికిచెప్పెను. అట్లేవారు వానిని అంచులవరకు నింపిరి.
8. అంతట ఆయన ”మీరు ఇప్పుడు విందు పెద్దయొద్దకు కొంచెము ముంచుకొని పొండు” అని చెప్పగా వారు అట్లే తీసికొనిపోయిరి.
9. విందు నడిపెడిపెద్ద ద్రాక్షరసముగ మారిన ఆ నీటిని రుచిచూచెను. అది ఎక్కడనుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియును. కనుక అతడు పెండ్లికుమారుని పిలిచి, 10. ”ఎవడైనను మొదట శ్రేష్ఠమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరు మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపురసమును ఇచ్చును. కాని, నీవు శ్రేష్ఠమైన ద్రాక్ష రసమును ఇప్పటివరకు ఉంచితివి” అని పలికెను.
11. ఈ విధముగా యేసు గలిలీయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచకక్రియను ప్రదర్శించి, తన మహిమను వెల్లడిచేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి.
12. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్నిదినములు ఉండిరి.
యెరూషలేము దేవాలయము
బేరగాండ్ల పలాయనము
(మత్తయి 21:12-13; మార్కు 11:15-19; లూకా19:45-48)
13. యూదుల పాస్కపండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్లెను.
14. దేవాలయములో ఎడ్లను, గొఱ్ఱెలను పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. 15. ఆయన త్రాళ్లతో కొరడాపేని, గొఱ్ఱెలను, ఎడ్లను అన్నింటిని ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడ ద్రోసెను.
16. పావురములను అమ్మువారితో ”వీనిని ఇక్కడనుండి తీసికొనిపొండు. నా తండ్రి ఇంిని వ్యాపారగృహముగా చేయవలదు” అని చెప్పెను.
17. ”నీ గృహమునందు నాకుగల ఆసక్తి నన్ను దహించును” అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అపుడు తలపునకు వచ్చెను.
18. యూదులు అపుడు ఆయనతో ”నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు?” అని ప్రశ్నించిరి.
19. అందుకు యేసు ”ఈ ఆలయమును మీరు పడగొట్టుడు. నేను దీనిని మూడురోజులలో లేపుదును” అని వారికి సమాధాన మిచ్చెను.
20. ”ఈ ఆలయ నిర్మాణమునకు నలువది ఆరు సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని మూడు రోజులలో లేపగలవా?” అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి.
21. కాని, వాస్తవముగ ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే.
22. ఆయన మృతులలోనుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి.
23. యెరూషలేములో పాస్కపండుగ సందర్భ మున ఆయన చేసిన అద్భుతకార్యములను చూచిన అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
24. కాని, యేసు వారిని అంతగా నమ్మలేదు.
25. ఏలయన, వారందరిని గూర్చి ఆయనకు తెలియును. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక, మానవస్వభావమును గూర్చి ఆయనకు ఎవ్వరును సాక్ష్యమీయనక్కరలేదు.