లాజరు మరణము
11 1. బెతానియాలో ‘లాజరు’ అను వ్యక్తి వ్యాధి గ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ, ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండిరి.
2. యేసుకు పరిమళ తైలముపూసి, ఆయన పాదములను తలవెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు.
3. కనుక, అక్కచెల్లెండ్రు ”ప్రభూ! మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు” అని యేసుకు వర్తమానము పంపిరి.
4. అది విని యేసు, ”ఈ వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదు. ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమపరుపబడుటకును వచ్చినది” అనెను.
5. యేసు మార్తమ్మను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను.
6. లాజరు జబ్బుపడెనని వినియు, యేసు తాను ఉన్నచోటనే ఇంకను రెండు రోజులు ఉండెను.
7. ఆ పిమ్మట ఆయన తన శిష్యు లతో, ”మనము యూదయాకు తిరిగిపోవుదము రండు” అనెను.
8. ”బోధకుడా! ఇంతకు ముందే యూదులు మిమ్ము రాళ్ళతో కొట్టదలచిరి. అయినను మీరు అక్కడకు తిరిగివెళ్ళెదరా?” అని శిష్యులు అడిగిరి.
9. అందుకు యేసు ఇట్లనెను: ”పగలు పండ్రెండుగంటలు ఉన్నవి కదా! ఎవడేని పగటివేళ నడచినయెడల తొట్రుపడడు. ఏలయన, వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును.
10. కాని, రాత్రి వేళ నడచినయెడల వాడు తొట్రుపడును. ఏలయన, వానియందు వెలుగులేదు.”
11. ఆయన వారితో మరల, ”మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు. నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను” అని చెప్పగా, 12. శిష్యులు ”ప్రభూ! అతడు నిద్రించు చున్నచో బాగుపడును” అనిరి.
13. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పెను. కాని, వారు అతని నిద్రవిశ్రాంతి గురించి చెప్పెనని తలంచిరి.
14. అపుడు యేసు వారితో స్పష్టముగ, ”లాజరు మరణించెను.
15. మీరు విశ్వసించుటకు, మీ నిమి త్తమై నేను అచట లేనందున సంతసించుచున్నాను. రండు ఇపుడు మనము అతని యొద్దకు వెళ్ళు దము” అని పలికెను.
16. అపుడు ‘దిదీము’ అనబడు తోమా ”మనముకూడ వెళ్ళి ఆయనతోపాటు చని పోవుదము” అని తనతోటి శిష్యులతో అనెను.
పునరుత్థానము – జీవము
17. యేసు అక్కడకుచేరిన పిమ్మట లాజరు సమాధిచేయబడి అప్పటికి నాలుగు దినములైనదని తెలిసికొనెను.
18. బెతానియాగ్రామముయెరూషలేము నకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది.
19. వారి సహోదరునిగూర్చి, మార్తమ్మ, మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి.
20. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురువెళ్ళెను. కాని మరియమ్మ ఇంటి యందే కూర్చుండి ఉండెను.
21. మార్తమ్మ యేసుతో, ”ప్రభూ! మీరు ఇచట ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండెడివాడుకాడు. 22. ఇప్పుడైనను దేవుని మీరు ఏమిఅడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియును” అనెను. 23. యేసు ఆమెతో ”నీ సహోదరుడు మరలలేచును” అని చెప్పెను.
24. అందుకు మార్తమ్మ ”అంతిమదినమున పునరుత్థాన మందు అతడు మరలలేచునని నేను ఎరుగుదును” అని పలికెను.
25. అపుడు యేసు ”నేనే పునరుత్థాన మును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించి నను జీవించును. 26. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణము చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా?” అని ప్రశ్నింపగా, 27. ఆమె ”అవును ప్రభూ! లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను” అని చెప్పెను.
యేసు కన్నీరు కార్చుట
28. ఆమె ఇట్లు పలికి వెళ్ళి, తన సహోదరి మరియమ్మతో, ”బోధకుడు ఇక్కడ ఉన్నాడు. నిన్ను రమ్మనుచున్నాడు” అని రహస్యముగా చెప్పెను.
29. అది విని, మరియమ్మ వెంటనేలేచి ఆయనవద్దకు వెళ్ళెను.
30. యేసు ఇంకను గ్రామము చేరలేదు, మార్తమ్మ తనను కలిసికొనిన స్థలముననే ఉండెను.
31. ఇంటి యొద్ద మరియమ్మను ఓదార్చుచున్న యూదులు, ఆమె ఉన్నపాటున లేచి, వెలుపలకు బయలుదేరుట చూచి, ఆమె వెంటవెళ్ళిరి. ఏలయన, ఆమె సమాధియొద్ద విలపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి.
32. మరియమ్మ యేసు ఉన్నచోటుకు వచ్చి ఆయన పాదములపైబడి, ”ప్రభూ! మీరు ఇక్కడ ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండెడి వాడు కాడు” అనెను.
33. ఆమెయు, ఆమె వెంట వచ్చిన యూదులును విలపించుటను చూచినపుడు యేసుహృదయము ద్రవించెను.
34. ఆయన దీర్ఘముగ నిట్టూర్చి, ”మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి?” అని అడిగెను. ”ప్రభూ! వచ్చి చూడుడు!” అని వారు పలికిరి.
35. యేసు కంటతడి పెట్టెను.
36. అంతట యూదులు ”ఈయన అతనిని ఎంతగా ప్రేమించు చున్నాడో చూడుడు!” అని చెప్పుకొనిరి.
37. కాని వారిలో కొందరు ”గ్రుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యువునుండి తప్పింపలేకపోయెనా?” అనిరి.
పునర్జీవము పొందిన లాజరు
38. యేసు మరల దీర్ఘముగ నిట్టూర్చి, సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ, 39. ”రాతిని తొలగింపుడు” అని యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, ”ప్రభూ! అతడు చనిపోయి నాలుగు దినములైనది. ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును” అనెను.
40. యేసు ఆమెతో ”నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా?” అనెను.
41. అంతటవారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ”ఓ తండ్రీ! నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు కృతజ్ఞుడను.
42. నీవు నన్ను ఎప్పుడును ఆలకించెదవని నేను ఎరుగుదును. కాని ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై, నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితిని” అనెను.
43. పిమ్మట యేసు బిగ్గరగ ”లాజరూ! వెలుపలకు రమ్ము” అని పలికెను.
44. చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. అతని కాలుసేతులు ప్రేతవస్త్రముతో బంధింపబడియుండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడియుండెను. యేసు వారితో ”కట్లు విప్పి, అతనిని పోనిండు” అనెను.
క్రీస్తుపై కుట్ర
(మత్తయి 26:1-5; మార్కు 14:1-2; లూకా22:1-2)
45. మరియమ్మతో కలసి వచ్చి ఈ కార్యమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వ సించిరి.
46. కాని, వారిలోకొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి, యేసు చేసిన ఈ కార్యమును గురించి వివరించిరి.
47. అంతట ప్రధానార్చకులు, పరిసయ్యులు సభనుసమావేశపరచి ”మనము ఏమిచేయుదుము? ఇతడేమో అనేక సూచకక్రియలు చేయుచున్నాడు.
48. మనము ఇతనినిఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరు ఇతనిని విశ్వసింతురు. అపుడు రోమీయులు వచ్చి, మన పవిత్రస్థలమును, మనజాతిని, రెంటిని నాశనము చేసెదరు” అని చెప్పిరి.
49. కాని, వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా,”మీకు ఏమియు తెలియదు.
50. జాతి అంతయు నాశనమగుటకంటె, ఒక మనిషి ప్రజలకొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా?” అనెను.
51. ఈ మాటను అతడు తానుగాగాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక, యేసు ఆ జాతి అంతటికొరకై మరణింప నున్నాడని ప్రవచించెను.
52. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అటుల మరణించునని పలికెను.
53. కావున వారు ఆనాటినుండియు యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి.
54. అందుచే యేసు అప్పటినుండియు యూదులమధ్య బహిరంగ ముగ సంచరించుట మానివేసెను. ఆయన అచట నుండి నిర్జనప్రాంతము సమీపమునయున్న ఎఫ్రాయీము పట్టణమునకు వెళ్లి తనశిష్యులతో అచటనే ఉండెను.
55. యూదుల పాస్కపండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లెప్రాంతముల నుండి తమను తాము శుద్ధిచేసికొనుటకై పండుగకు ముందుగనే యెరూషలేమునకు వచ్చియుండిరి.
56. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు ”నీకు ఏమితోచుచున్నది? అతడు పండుగకురాడా?” అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి.
57. ప్రధానార్చ కులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడఉన్నాడో ఎరిగినపక్షమున వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అటుల ఆజ్ఞాపించిరి.