ప్రజలకు లొంగిపోయిన పిలాతు
(మత్తయి 27:15-31; మార్కు 15:6-20; లూకా 23:13-25)
19 1. అపుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను.
2. సైనికులు ముళ్ళకిరీటమును అల్లి, దానిని ఆయన శిరస్సుపైపెట్టి, ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి.
3. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, ”యూదులరాజా! నీకు శుభము!” అని నమస్కరించి, ఆయనను చెంపపై కొట్టిరి.
4. పిలాతు మరల బయటకు వెళ్ళి, ప్రజలతో ”ఇదిగో! ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలిసికొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసికొని వచ్చుచున్నాను” అని చెప్పెను.
5. అపుడు యేసు ముళ్ళకిరీటమును ఊదావస్త్రమును ధరింప చేయ బడినవాడై బయటకు వచ్చెను. ”ఇదిగో ఈ మనుష్యుడు” అని పిలాతు వారితో చెప్పెను.
6. ప్రధానార్చకులును, బంట్రౌతులును ఆయనను చూచినంతనే ”వానిని సిలువవేయుడు, సిలువ వేయుడు” అని కేకలు వేసిరి. ”ఈయన యందు నాకు ఏ దోషము కనిపించుట లేదు. మీరే ఈయనను తీసికొని వెళ్ళి సిలువవేయుడు” అని చెప్పెను.
7. అపుడు యూదులు ”దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనుచున్నాడు. కనుక, మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే” అనిరి.
8. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి, 9. మరల అధికారమందిరములోనికి వెళ్ళి, యేసును ”నీవు ఎక్కడినుండి వచ్చితివి?” అని ప్రశ్నించెను. కాని యేసు ఏమియు బదులుపలుకలేదు.
10. కనుక, పిలాతు ”నీవు నాతో కూడ మాట్లాడవా? నిన్ను విడిచి పెట్టుటకును, సిలువవేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా?” అనెను.
11. అందుకు యేసు, ”పైనుండి నీకు అధికారము ఈయబడని యెడల నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండెడిది కాదు. అందుచే, నన్ను నీచేతికి అప్పగించిన వాడు, ఎక్కువపాపము కట్టుకొనుచున్నాడు” అని పలికెను.
12. అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువగ ప్రయత్నింపసాగెను. కాని యూదులు, ”ఇతనిని విడిచి పెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు. తననుతాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి” అని కేకలువేసిరి.
13. పిలాతు ఈ మాటలు విని, యేసును వెలుపలకు తీసికొనివచ్చి, రాళ్ళుపరచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో ‘గబ్బతా’ అందురు.
14. అది పాస్కపండుగకు సిద్ధపడుదినము. ఇంచుమించు మధ్యాహ్నము పండ్రెండుగంటల సమ యము. పిలాతు యూదులతో ”ఇదిగో మీ రాజు!” అనెను.
15.అందుకు వారు,”ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువవేయుడు” అని కేకలుపెట్టిరి. పిలాతు వారితో ”నేను మీ రాజును సిలువ వేయుదునా?” అనెను. అందుకు ప్రధానార్చకులు ”సీజరు తప్ప మాకు వేరొకరాజు లేడు” అని పలికిరి.
16. అపుడు పిలాతు యేసును సిలువవేయుటకు వారి చేతికి అప్పగించెను.
సిలువపై యేసు
(మత్తయి 27:32-44; మార్కు 15:21-32; లూకా 23:26-43)
కనుక వారు ఆయనను తీసుకొనిపోయిరి.
17. యేసు తన సిలువను మోసికొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో ‘గొల్గొతా’ అందురు.
18. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపుల మరి యిద్దరిని అట్లే సిలువ వేసిరి.
19. ‘నజరేయుడగు యేసు, యూదుల రాజు’ అను బిరుదమును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను.
20. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగ ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను.
21. అంతట యూదుల ప్రధానా ర్చకులు పిలాతుతో, ”యూదులరాజు అని వ్రాయ కుము.’నేను యూదులరాజును’అని అతడు చెప్పెనని వ్రాయుము” అనిరి.
22. అందుకు పిలాతు, ”నేను వ్రాసినదేమో వ్రాసితిని. అంతే” అనెను.
23. యేసును సిలువవేసిన పిమ్మట, సైనికులు ఆయన వస్త్రములను నాలుగు భాగములు చేసి తల కొక భాగము తీసికొనిరి. వారు అంగీని సహితము తీసికొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టులేకుండ నేయబడియున్నందున, 24. ”దీనిని చింపవద్దు. ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసికొందము” అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
”వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి.
నా అంగీకొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి”
అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందు వలననే సైనికులు ఇట్లు చేసిరి. 25. యేసు సిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి, క్లోఫా భార్య యగు మరియమ్మయు, మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి.
26. తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి యుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, ”స్త్రీ! ఇదిగో నీ కుమా రుడు!” అనెను.
27. ఆ తరువాత శిష్యునితో ”ఇదిగో నీ తల్లి” అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసికొని పోయెను.
యేసు మరణము
(మత్తయి 27:45-56; మార్కు 15:33-41; లూకా 23:44-49)
28. పిదప, యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, ”నాకు దాహమగుచున్నది” అనెను. (లేఖనము ఇట్లు నెరవేరెను.)
29. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని ‘హిస్సోపు’ కోలకు తగిలించి ఆయనకు అందించిరి.
30. యేసు ఆ రసమును అందుకొని ”సమాప్తమైనది” అని తల వంచి, ప్రాణము విడిచెను.
బల్లెపు పోటు
31. అది పాస్కపండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, ”రేపటి విశ్రాంతి దినము గొప్పదినము. ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరుగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతినిండు” అని అడిగిరి.
32. కావున సైనికులు వెళ్ళి, యేసుతో పాటు సిలువవేయ బడిన మొదటివాని కాళ్ళను, మరియొకని కాళ్ళను విరుగగొట్టిరి.
33. కాని వారు యేసు వద్దకు వచ్చిన ప్పుడు ఆయన అప్పికే మరణించి ఉండుటను చూచి, ఆయన కాళ్లు విరుగగొట్టలేదు.
34. అయితే, సైనికు లలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను.
35. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పి నది వాస్తవము.మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును.
36. ”ఆయన ఎముకలలో ఒకటైనను విరుగ గొట్టబడదు” అను లేఖనము ఇట్లు నెరవేరెను.
37. ”వారు తాము పొడిచిన వాని వంకవీక్షిం తురు” అను మరియొక లేఖనము ఇట్లు నెరవేరెను.
భూస్థాపనము
(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; లూకా 23:50-56)
38. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్లి, యేసు భౌతిక దేహమును ఈయగోరెను. యూదుల భయమువలన ఈ యోసేపు బహిరంగ ముగగాక, రహస్యముగ యేసు శిష్యుడైయుండెను. పిలాతు అనుమతినొసగ అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసికొనిపోయెను.
39. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడ ఇంచుమించు నూట ఏబది సేర్ల బరువుగల పరిమళ ద్రవ్యమును, అత్తరును తీసికొని వచ్చెను.
40. వారు యేసు దేహ మును తీసికొని, యూదుల భూస్థాపన సంప్రదా యానుసారము దానికి పరిమళద్రవ్యమును పూసి నారవస్త్రముతో చుట్టిరి.
41. యేసు సిలువవేయబడిన చోట ఒక తోట గలదు. ఆ తోటలో ఎవ్వరును భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను.
42. అది విశ్రాంతిదినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను, ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి.