పునరుత్థానము
(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; లూకా 24:1-12)
20 1. ఆదివారము తెలతెలవారకముందే మగ్దలా మరియమ్మ సమాధియొద్దకు వెళ్ళి, ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను.
2. అంతట ఆమె సీమోను పేతురువద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యునియొద్దకు పరుగెత్తుకొనిపోయి, ”వారు ప్రభువును సమాధినుండి ఎత్తికొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము” అని చెప్పెను. 3. అపుడు పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి.
4. ఆ ఇద్దరును పరుగెత్తు చుండిరి. కాని, ఆ శిష్యుడు పేతురుకంటె వేగముగ పరుగెత్తి ముందుగ సమాధియొద్దకు చేరెను.
5. అతడు వంగి నారవస్త్రములు అచట పడియుండుటను చూచెను. కాని, లోనికి వెళ్ళలేదు.
6. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి, సమాధిలో ప్రవేశించి, అచట పడియున్న నారవస్త్రములను, 7. ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రము లతోపాటు కాక, విడిగ చుట్టి ఉంచబడెను. 8. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడుకూడ లోనికి వెళ్ళి చూచి నమ్మెను.
9. యేసు మృతులలోనుండి సజీవుడుగ లేవవలయునను లేఖనమును వారు అప్పటికిని గ్రహింపలేకపోయిరి. 10. పిమ్మట ఆ శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి.
మగ్దలా మరియమ్మకు దర్శనము
(మత్తయి 28:9-10)
11. కాని, మరియమ్మ సమాధియొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు, ఆమె వంగి సమాధి లోనికి తొంగిచూడగా 12. ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి, కాళ్ళవైపున ఒకరు, తలవైపున ఒకరు యేసు భౌతికదేహమును ఉంచినచోట కూర్చుండియుండిరి.
13. ”అమ్మా! ఎందుకు నీవు ఏడ్చుచున్నావు?” అని వారు అడిగిరి. ”నా ప్రభువును ఎవరో ఎత్తుకొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను” అని ఆమె చెప్పెను.
14. అట్లు చెప్పి, ఆమె వెనుకకుతిరిగి, యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని, ఆమె ఆయనను గుర్తింపలేదు.
15. యేసు ఆమెతో ”అమ్మా! నీవు ఎందుకు ఏడ్చుచు న్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు?” అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, ”అయ్యా! నీవు ఆయనను తీసికొని వెళ్ళినయెడల, ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము. నేను వెళ్ళి తీసికొనిపోయెదను” అనెను.
16. ”మరియమ్మా” అని యేసు పలికెను. ఆమె ఆయన వంకతిరిగి హీబ్రూ భాషలో ”రబ్బూని” అని పిలిచెను. (అనగా ‘బోధకుడా’ అని అర్థము).
17. యేసు ఆమెతో ”నన్ను ముట్టుకొనవద్దు. నేను ఇంకను తండ్రియొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము: నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వానియొద్దకు ఆరోహణమై పోవుచున్నాను” అని చెప్పెను.
18. మగ్దలా మరియమ్మ వెళ్ళి, శిష్యులతో, ”నేను ప్రభువును చూచితిని” అని వారికి ప్రభు సందేశమును అందజేసెను.
శిష్యులకు దర్శనము
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; లూకా 24:36-49, 1 కొరి 15:5)
19. అది ఆదివారము సాయంసమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొనియుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలువ బడి, ”మీకు శాంతి కలుగునుగాక!” అనెను.
20. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తనచేతులను, ప్రక్కనుచూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి.
21. యేసు మరల వారితో, ”మీకు శాంతి కలుగును గాక! నాతండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను” అని పలికెను.
22. అటుల పలికి, ఆయన వారిమీద శ్వాస ఊది ”పవిత్రాత్మను పొందుడు.
23. ఎవరి పాపములనైనను మీరు క్షమించినయెడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపనియెడల అవి క్షమింప బడవు” అని చెప్పెను.
తోమా అవిశ్వాసము
యేసు దర్శనము
24. యేసు వచ్చినపుడు పన్నిద్దరిలో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను.
25. తక్కిన శిష్యులు అతనితో ”మేము ప్రభువును చూచితిమి” అని చెప్పిరి. అందుకు అతడు ”నేను ఆయన చేతులలోని చీలలగంట్లు చూచి, అందు నా వ్రేలుపెట్టి, ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను” అనెను.
26. ఎనిమిది దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటిలోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారిమధ్య నిలుచుండి, ”మీకు శాంతి కలుగునుగాక!” అనెను.
27. అపుడు యేసు తోమాతో ”నీ వ్రేలు ఇక్కడ ఉంచుము. నా చేతులు చూడుము. నీ చేయిచాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివికాక, విశ్వాసివై ఉండుము” అని చెప్పెను.
28. అపుడు తోమా ”నా ప్రభూ! నాదేవా!” అని పలికెను. 29. ”నీవు విశ్వసించినది నన్ను చూచుటవలన కదా! చూడకయే నన్ను విశ్వ సించువారు ధన్యులు” అని యేసు పలికెను.
ఈ గ్రంథరచన ఉద్దేశము
30. యేసు మరెన్నియో సూచకక్రియలు శిష్యుల ఎదుట చేసెను. అవన్నియు ఈ గ్రంథమున వ్రాయ బడలేదు.
31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసముద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయ బడినవి.