ఎఫెసుకు సందేశము

21. ఎఫెసు  సంఘ దూతకు  ఇట్లు వ్రాయుము: 

”తన దక్షిణహస్తమున సప్తతారకలను దాల్చు వాని సందేశము ఇది. సప్త దీపస్తంభముల నడుమ నడచువాని సందేశమే యిది.

2. మీరు ఏమి ఒనర్చితిరో నాకు తెలియును. మీరు ఎంత శ్రమపడి పనిచేసితిరో, ఎంత సహనమును ప్రదర్శించితిరో నేను ఎరుగుదును. దుష్టులను మీరు సహింపజాలరనియు నాకు విదితమే. అపోస్తలులు కాకుండగనే, అపోస్తలుల మని చెప్పుకొను వారిని పరీక్షించి, వారు అసత్యవాదులని మీరు కనుగొంటిరనియు నాకు తెలిసినదే.

3. మీరు ఓర్పును చూపితిరి. నా నామము నిమిత్తము కష్టములను అనుభవించితిరి. అయినను మీ పూనికను త్యజింపలేదు.

4. కాని మొదివలె ఇప్పుడు మీరు నన్ను  ప్రేమించుటలేదు. ఇదియే మీపై నేను చేయు నేరారోపణ.

5. మీరెంత భ్రష్టులైతిరో ఒకపరి గుర్తుకు తెచ్చుకొనుడు. మారుమనస్సు పొంది, మొదట మీరు చేసిన క్రియలనుచేయుడి. అటులగాక, మారు మనస్సు పొందనియెడల, నేనే వచ్చి మీ ద్వీపస్తంభమును దాని స్థానమునుండి తొలగింతును.

6.కాని, నికోలాయితుల చేష్టలను నేను ఎంతగ ద్వేషింతునో మీరును అంతే ద్వేషింతురు. ఇది మీయందలి సుగుణము.

7. మీకు వీనులున్నచో దైవసంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు! 

గెలుపొందిన వారికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవవృక్షపు ఫలమును ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహింతును.”

స్ముర్నాకు సందేశము

8.  స్ముర్నా  సంఘదూతకు  ఇట్లు వ్రాయుము:

”ఆద్యంతములైనవాడును, మరణించియు సజీవుడగువాని సందేశము ఇది.

9. మీ బాధలు నాకు తెలియును. మీరు నిరుపేదలగుట ఎరుకే. కాని యథార్థముగ మీరు భాగ్యవంతులే! మీపై ఆరోపింపబడు దోషములు నాకు ఎరుకయే. దోషారోపణ మొనర్చువారు యూదులమని చెప్పుకొందురు. నిజమునకు వారు యూదులు కారు. వారు సైతాను బృందము!

10.మీకు కలుగబోవు ఎట్టిశ్రమలను గూర్చియు భయపడకుడు. ఆలకింపుడు! సైతాను మిమ్ము శోధించును. మీలోకొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు పదిదినములు మాత్రమే. మరణించువరకు విశ్వా సపాత్రులై ఉండుడు. అప్పుడు మీకు జీవకిరీటమును అనుగ్రహించెదను.

11. మీకు వీనులున్నచో,దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధతో ఆలకింపుడు! గెలుపొందినవారు రెండవ మరణముచే బాధింపబడరు.”

పెర్గమూనకు సందేశము

12. పెర్గమూ సంఘ దూతకు ఇట్లు వ్రాయుము:

”వాడియైన రెండంచులుగల ఖడ్గధారి సందేశము ఇది: 13. మీ నివాసము నాకు తెలియును. సైతాను సింహాసనమును అచటనే ఉన్నది. నా నామమందు స్థిరముగానున్నారు. నా విశ్వాసపాత్రుడును సాక్షియునైన అంతిప అనువాడు సైతాను నివాసస్థానమున చంపబడినాడుగదా! ఆనాడును మీరు నాయందలి మీ విశ్వాసమును త్యజింపలేదు.

14. కాని, మీపై నేను ఒనర్చు ఆరోపణలు ఇవి: బిలాము అనుయాయులు కొందరు మీలో ఉన్నారు. బాలాకునకు అతడే బోధకుడుగదా! ఆ బాలాకు యిస్రాయేలు ప్రజలను పాపాత్ములను చేసెను. ఆ యిస్రాయేలు ప్రజలు విగ్రహములకు అర్పింపబడిన ఆహారములనే భుజించుచు, జారత్వము చేయునట్లు అతడు చేసెను.

15. అట్లే            నికోలాయితుల బోధలను అనుసరించువారును మీ యందు ఉన్నారు.

16. కనుక హృదయపరివర్తన చెందుడు. లేనిచో నేనే త్వరలో మిమ్ము చేరి నా నోటి నుండి వెలువడు ఖడ్గమున వారితో యుద్ధము చేసెదను.

17. మీకు వీనులున్నచో, దైవసంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. జయము నొందిన వారికి దాచబడియున్న మన్నాలో భాగము ఇత్తును. వారిలో ప్రతి వ్యక్తికిని ఒక తెల్లని రాతిపలకను ఇత్తును. దానిపై ఒక క్రొత్త నామ ముండును. అది, పొందినవానికి తప్ప మరెవ్వనికిని తెలియదు.”

తియతైరకు సందేశము

18. తియతైర సంఘదూతకు ఇట్లు వ్రాయుము:

”ఎవనికన్నులు అగ్నిజ్వాలలవలె వెలుగొందునో, ఎవని పాదములు మెరుగుపెట్టిన ఇత్తడివలె ప్రకాశించునో ఆ దేవపుత్రుని సందేశము ఇది.

19. మీరు ఏమి చేసితిరో నాకు తెలియును. మీ ప్రేమ, విశ్వాసము, సేవ, సహనము నాకు ఎరుకే. మొదట చేసిన దానికంటె నేడు మీరు అధికముగ చేయుచున్నారనియు నాకు తెలియును.

20. కాని మీ పై  చేయు ఆరోపణ యిది:  ప్రవక్తినని చెప్పుకొనెడి యెసెబెలు అను  స్త్రీని  మీరు సహింతురుగదా! ఆమె నా సేవకులను దుర్బోధ లొనర్చి తప్పుదారి ప్టించుచున్నది. అందువలన  వారు జారత్వమొనర్చుచు, విగ్రహములకు అర్పించిన ఆహారమును భుజించుచున్నారు.

21. ఆమె హృదయ పరివర్తన చెందుటకు తగినంత సమయము ఒసగి యుంటిని. కాని, తన జారత్వమునుండి ఆమె మరలుటకు నిరాకరించుచున్నది.

22.చూడుడు. నేను ఆమెను జబ్బుతో మంచమున పడియుండునట్లు  చేసెదను. ఆమెతో వ్యభిచరించువారు హృదయ పరివర్తన చెందనిచో వారిని నేను భయంకర వేదనలకు గురిచేసెదను.

23. ఆమె పుత్రులను కూడ సంహరించెదను. అప్పుడైన దైవసంఘములన్ని నన్ను మానవుల మనస్సుల, హృదయములయందలి ఆలోచనలను, ఆశలను గ్రహింపగలవానినిగ గుర్తించును. మీరొనర్చు కృత్యములను బట్టియే మీకు ప్రతిఫలమిత్తును.

24. ”కాని తియతైరనందు మిగిలిన మీరు ఈ దుష్టబోధనలను అనుసరింపలేదు. ‘సైతాను నిగూఢ రహస్యములు’ అని పేర్కొనబడు వానిని మీరు అభ్యసింపలేదు. మీపై ఇక ఎట్టి భారమును మోపనని వాగ్దానము చేయుచున్నాను.

25. కాని నేను వచ్చు నంతవరకును, మీకు ఉన్నదానిని మీరు పిష్టముగ నిలుపుకొనవలయును.

26-27. జయము నొందినవారికిని, తుది దాకా నా ఆశయమును నెరవేర్చువారికిని,  నా  తండ్రి నుండి నేను ఎట్టి అధికారమును పొందితినో, అట్టిఅధికారమునే ప్రసాదింతును. మానవాళిపై వారికి అధికార మిచ్చెదను. వారు ఇనుపదండముతో పరిపాలింతురుగాక! మ్టికుండలవలె వారిని ముక్కలు చేయుదురుగాక!

28. వారికి వేగుచుక్కను కూడ  అనుగ్రహింతును.

29. మీకు వీనులున్నచో దైవసంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు!”