దివ్యలోకపు ఆరాధన
4 1. ఈ సమయమున నాకు మరియొక దృశ్యము గోచరించినది. దేవలోకమున ఒక ద్వారము తెరువబడి ఉండుట గమనించితిని. నాతో ఇదివరకు సంభాషించియున్న బాకానాదమువంటిస్వరము ”ఇటు రమ్ము. తదనంతరము ఏమి జరుగవలయునో నీకు చూపెదను” అని నన్ను ఉద్దేశించి పలికెను.
2. ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవలోకమున ఒక సింహాసనము ఉన్నది. దానిపై ఎవరో ఆసీనుడైయుండుట గమనించితిని.
3. ఆసీనుడైనవాని వదనము సూర్యకాంత మణివలెను, కురువింద రత్నమువలెను దేదీప్యమానమై ఉండెను. సింహాసనము చుట్టును మరకతమణివర్ణముగల రంగులధనుస్సు వెలుగొందుచుండెను.
4. ఆ సింహాసనము చుట్టును మరి ఇరువది నాలుగు సింహాసనములు ఉండెను. వానిపై ఇరువది నలుగురు పెద్దలు కూర్చుండియుండిరి. వారు ధవళవస్త్రములను ధరించి శిరస్సులపై బంగారపు కిరీటములను కలిగి యుండిరి.
5. ఆ సింహాసనమునుండి మెరుపులు మెరయుచుండెను. గర్జనలును, ఉరుములును వెలువడుచుండెను. ఆ సింహాసనము ఎదుట ఏడు దివిటీలు వెలుగుచుండెను. ఇవి దేవుని సప్తఆత్మలు.
6. సింహాసనమునకు ఎదురుగా స్ఫటికమువలె స్వచ్ఛమై, పారదర్శకమై సముద్రమువలె గోచరించునది ఏదియో ఉండెను.
సింహాసనమును పరివేష్టించి దానికి ఒక్కొక్క పార్శ్వమున, ముందు వెనుకల నేత్రములుగల నాలుగుజీవులు ఉండెను.
7. అందు మొదిది సింహమువలె ఉండెను, రెండవది ఆవుదూడవలె కనపడెను, మూడవది మానవుని ముఖాకృతి కలిగి ఉండెను, నాలుగవది ఎగురుచున్న గ్రద్దను పోలి యుండెను.
8. ఈ నాలుగు జీవులలో ప్రతిజీవియు ఆరురెక్కలుగలిగి, లోపలను, వెలుపలను నేత్రములతో నిండిఉండెను. అవి రేయింబవళ్ళు ఇట్లు పాడుచునే ఉండును.
”సర్వశక్తిమంతుడును, దేవుడును అయిన ప్రభువు
పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు;ఆయనయే త్రికాలస్థితుడు”.
9. సింహాసనాసీనుడును, నిత్యుడును అగు వ్యక్తికి వైభవకీర్తి కృతజ్ఞతాస్తోత్రములను ఆ నాలుగుజీవులును పెక్కుమారులు అర్పించినవి.
10. అట్లే ఆ సింహాసనాసీనుని ఎదుట ఆ ఇరువది నలుగురు పెద్దలును సాష్టాంగపడిరి. ఆ శాశ్వతుని పూజించిరి. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట ఉంచి ఇట్లు స్తుతించిరి:
11. ”ప్రభూ! ఓ దేవా! మహిమ, గౌరవము,
శక్తిపొందుటకు నీవు అర్హుడవు.
ఏలయన, సర్వమునకు నీవే సృష్టికర్తవు
నీ సంకల్పముననే అవి జీవమును పొంది బ్రతుకుచున్నవి.”