1,44,000 మంది యిస్రాయేలు ప్రజలు
7 1. పిమ్మట ప్రపంచము నాలుగు మూలలను నలుగురు దేవదూతలు నిలిచిఉండుట గమనించితిని. భూమిపైగాని, సముద్రముపైగాని, ఏ చెట్టుపైననుగాని గాలి వీచకుండ వారు నాలుగుదిక్కులయందును గాలులను నిరోధించిరి.
2. తూర్పు దిక్కునుండి సజీవ దైవముయొక్క ముద్రతో మరియొక దేవదూత వచ్చుట చూచితిని. భూమిని, సముద్రమును నాశనము చేయు టకు దేవునిచే అధికారము నొసగబడిన నలుగురు దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను.
3. ”మా దేవుని సేవకులనుదుటిపై ముద్రవేయువరకు భూమినిగాని, సముద్రమునుగాని, చెట్లనుగాని నాశన మొనర్పకుడు” అని ఆ దేవదూత వారితో పలికెను.
4. తమ నొసళ్ళపై దేవునిముద్రను పొందినవారి సంఖ్య నాకు ఎరిగింపబడెను. వారు యిస్రాయేలునందలి అన్ని గోత్రములనుండి గ్రహింపబడిన నూటనలువది నాలుగువేలమంది మాత్రమే.
5. ముద్రాంకితులైన వారు యూదాగోత్రములనుండి పండ్రెండువేలు, రూబేనుగోత్రమునుండి పండ్రెండువేలు, గాదు గోత్రమునుండి మరి పండ్రెండు వేలు.
6. ఆషేరు గోత్రమునుండి యింకొక పండ్రెండు వేలు, నఫ్తాలి గోత్రమునుండి వేరొక పండ్రెండు వేలు, మనష్షే గోత్రమునుండి ఒక పండ్రెండువేలు, 7. షిమ్యోను గోత్రమునుండి పండ్రెండువేలు, లేవీ గోత్రమునుండి పండ్రెండువేలు, యిస్సాఖారు గోత్రమునుండి వేరొక పండ్రెండువేలు, 8. సెబులూను గోత్రమునుండి ఇంకొక పండ్రెండువేలు, యోసేపు గోత్రమునుండి ఒక పండ్రెండువేలు, బెన్యామీను గోత్రమునుండి పండ్రెండువేలును అట ఉండిరి.
గొప్ప జనసమూహము
9. తదనంతరము నేను అటు చూడగా అట ఒకగొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను! అందు అన్ని జాతులవారును, అన్ని తెగలవారును, అన్ని వర్గములవారును, అన్ని భాషలవారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకును, గొఱ్ఱెపిల్లకును ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసికొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి.
10. ”సింహాసనాసీనుడగు మా దేవునివలనను, ఈ గొఱ్ఱెపిల్ల వలనను మాకు రక్షణ లభించుచున్నది, స్తోత్రము!” అని వారు బిగ్గరగ పలికిరి.
11. దేవదూతలందరు సింహాసనము చుట్టును, పెద్దల చుట్టును, నాలుగు జీవుల చుట్టును నిలుచుండిరి. అంతట వారు సింహాసనమునకు ఎదురుగా సాష్టాంగపడి 12. ”ఆమెన్! మన దేవునకు సదా స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము, శక్తియు కలుగును గాక! ఆమెన్!” అని వారు పలుకుచు దేవుని ఆరాధించిరి.
13. ”ఈ తెల్లని దుస్తులు ధరించినవారు ఎవరు? వారు ఎట నుండి వచ్చిరి?” అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను.
14. ”అయ్యా, నీకే తెలియును” అని నేను అంటిని. ”భయంకర హింసను సురక్షితముగ అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొఱ్ఱెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళన మొనర్చుకొని వానిని తెల్లనివిగ చేసికొనిరి.
15. అందుచేతనే వారు దేవుని సింహాసనము ఎదుట నిలిచి రాత్రింబవళ్ళు ఆయన దేవాలయములో సేవలు చేయుదురు. సింహా సనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును.
16. ఎన్నటికిని వారికి ఇక ఆకలి దప్పులు ఉండవు. సూర్యుడుగాని, ఏ వేడిమిగాని వారిని దహింపదు.
17. ఏలయన, సింహాసనమునకు మధ్యనున్న గొఱ్ఱెపిల్ల వారికి కాపరిఅగును, వారిని జీవజలమువద్దకు తీసికొనిపోవును. దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచి వేయును” అని ఆ పెద్ద నాతో పలికెను.