9 1. అంతట ఐదవ దేవదూత తన బాకాను ఊదెను. అప్పుడు దివినుండిరాలిన నక్షత్రము ఒకటి భువిపై కూలుట చూచితిని. అగాధపు తాళపుచెవి దానికి  ఒసగబడెను.

2. ఆ నక్షత్రము అగాధమును తెరచెను. పెద్ద కొలిమినుండి వెలువడు పొగవలె ఆ అగాధమునుండి ధూమపంక్తులు పైకి ఉబుకు చుండెను. ఆ అగాధము నుండి బయల్వెడలిన పొగచే సూర్యుడు, గాలియు నల్లబడెను.

3. ఆ పొగనుండి ఒక మిడుతల దండు భువిపైకి వెడలెను. అవి తేళ్లకుండు శక్తిని కలిగి ఉండెను.

4. గడ్డినిగాని, చెట్లనుగాని, ఏ ఇతర విధములైన మొక్కలనుగాని పాడుచేయకుండునట్లు అవి ఆజ్ఞాపింపబడెను. కాని నుదుటిపై దేవుని ముద్రలు లేని మానవులను మాత్రమే అవి బాధింపగలిగెను.

5. కాని మిడుతలకు వారిని చంపుటకు ఆజ్ఞ ఈయబడలేదు. కేవలము ఐదు మాసములు మాత్రమే వారిని బాధించుటకు అవి అనుమతింపబడెను. వాని వలన కలుగుబాధ తేలుకుట్టినప్పటి బాధవలె ఉండెను.

6. ఆ దినములలో వారు మృత్యువును అన్వేషింతురు. కాని అది వారికి లభింపదు. చావును వారు కోరుకొందురు. కాని అది వారినుండి పారిపోవును.

7. ఆ మిడుతలు యుద్ధమునకు సిద్ధముగ ఉన్న గుఱ్ఱములవలె ఉండెను. వాని శిరములపై బంగారపు కిరీటముల వంటివి ఉండెను. వాని ముఖములు మానవవదనములను పోలియుండెను.

8. వాని రోమములు స్త్రీల జుట్టువలె ఉండెను. వాని దంతములు సింహపు పండ్లవలె ఉండెను.

9. వాని వక్షములు ఇనుప కవచముల వంటి వానితో కప్పబడి ఉండెను. వాని రెక్కల చప్పుడు పెక్కు గుఱ్ఱములచే లాగబడుచు యుద్ధభూమి యందు సంచరించుచున్న రథముల ధ్వనివలె ఉండెను.

10. తేళ్లకు వలె వానికి తోకయు, కొండియు ఉండెను. వాని తోకలతోనే అవి మనుజులను ఐదు నెలలపాటు బాధింపగలవు.

11. వానిపై అధికారము నెరపు రాజుకూడ కలడు. అతడు ఆ అగాధముపై యాజమాన్యము గల దేవదూత. హీబ్రూ భాషలో వానికి ‘అబద్దోను’ అని పేరు. గ్రీకు భాషలో అపొల్లుయోను అనునది అతని నామము. అనగా ”విధ్వంసకుడు” అని అర్థము.

12. మొదటి అనర్థము గతించినది. తరువాత  ఇంకను రెండు అనర్థములు సంభవింపనున్నవి. 

13. అంతట ఆరవ దేవదూత తన బాకాను ఊదెను. దేవుని సముఖమున ఉన్న సువర్ణ బలిపీఠపు నాలుగు కొమ్ముల నుండి వెలువడుచున్న ఒక స్వరమును నేను అప్పుడు వింటిని.

14. ”యూఫ్రటీసు మహానదీ తీరమున బంధింపబడి ఉన్న నలుగురు దేవదూతలను విడుదల చేయుము!” అని ఆ స్వరము బాకాతో నున్న ఆరవ దేవదూతకు చెప్పెను.

15. ఆ నలుగురు దేవదూతలును విడుదల చేయబడిరి. వారే ఈ క్షణమున, ఈ దినమున, ఈ నెలలో, ఈ సంవత్సరమే మానవాళిలో మూడవ వంతును నశింపజేయుటకు సిద్ధము చేయబడిరి.

16. అశ్వారూఢులై ఉన్న సైనికుల సంఖ్య నాకు తెలుపబడినది.  అది యిరువది కోట్లు.

17. గుఱ్ఱములును, ఆశ్వికులును కూడ నాకు ఆ దృశ్యమున గోచరించిరి. వారు వక్షమున ధరించిన కవచములు నిప్పువలె ఎఱ్ఱగాను, ఇంద్రనీల మణులవలె నీలముగాను, గంధకము వలె పసుపు పచ్చగాను ఉండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహముల శిరస్సుల వలె ఉండెను. వాని నోటినుండి మంటలు, పొగ, గంధకము వెలువడుచుండెను. 

18.  ఆ గుఱ్ఱముల  నోళ్ల నుండి  వెలువడుచున్న మంటలు, పొగ, గంధకము అను మూడు అనర్థముల చేతనే మానవాళిలో మూడవ వంతు నశించెను.

19. ఏలయన, ఆ గుఱ్ఱముల శక్తి వాని నోళ్లలోను, తోకలలోను ఉండెను. వాని తోకలు, తలలు కలిగిన పాముల వలె ఉండెను. అవి ఆ తోకలతో ప్రజలను బాధించును.

20. ఈ మూడు అనర్థములచే నశింపక మిగిలి యున్న మానవాళి, తాము ఒనర్చిన వాని నుండి మరలిపోలేదు. దయ్యములను, విగ్రహములను పూజించుట వారు మానలేదు. ఇవి చూడలేనివి, వినలేనివి, నడవలేనివియైన బంగారు, వెండి, కంచు, శిలా, కొయ్య విగ్రహములు.

21. అంతేకాక, తాము ఒనర్చిన హత్యలనుగాని, తమ మాయలనుగాని, తమ జారత్వమునుగాని, తమ దొంగతనములను గాని వారు మానుకొనలేదు.