దేవదూత, చిన్న గ్రంథము

10 1. అంతట మహా బలవంతుడగు మరియొక  దేవదూత దివి నుండి  క్రిందికి బయల్వెడలుట  గమనించితిని. అతడు మేఘమును వస్త్రముగా ధరించెను. వాని తల చుట్టును ఒక రంగులధనుస్సు ఉండెను. వాని వదనము సూర్యబింబమువలె ఉండెను. వాని పాదములు అగ్ని స్తంభములవలె ఉండెను.

2.  వాని  చేతియందు  తెరవబడిన  చిన్న గ్రంథము ఒకటి ఉండెను. అతడు తన కుడి పాదమును సముద్రముపైనను, ఎడమ పాదమును భువిపైనను ఉంచెను.

3. అంతట అతడు సింహగర్జనను పోలిన గంభీరమగు కంఠముతో పిలిచెను. అతని పిలుపును అనుసరించి ఏడు ఉరుములు ప్రతిధ్వనించెను.

4. అవి అట్లు పలుకగనే నేను వ్రాయ మొదలిడితిని. కాని అంతలో దేవలోకము నుండి నాకు ఒక స్వరము వినబడెను. ”ఏడు ఉరుములు ఏమి చెప్పెనో అది రహస్యముగా ఉంచుము. దానిని లిఖింపకుము!” అని ఆ స్వరము నాతో పలికెను. 

5.  అంతట సముద్రముపైనను  భూమి మీదను  నిలిచి ఉండగా నేను చూచిన దేవదూత తన కుడి చేతిని దేవలోకము వైపునకెత్తెను.

6. అట్లు చేతిని ఎత్తి నిత్యుడును, దివిని, భువిని, సముద్రమును, వానియందలి సర్వమును సృజించినవాడగు దేవుని నామమున ఇట్లు శపథమొనర్చెను: ”ఇక ఆలస్యము ఉండదు!

7. ఏడవ దేవదూత తన బాకాను ఊదిన వెంటనే దేవుడు తన రహస్య  ప్రణాళికను  నెరవేర్చును.  అది ఆయన తన సేవకులగు ప్రవక్తలకు బోధించిన విధముగనే జరుగును” అని ఆ దేవదూత పలికెను.

8. దేవలోకము నుండి నేను పూర్వము వినియున్న స్వరము నాతో మరల ఇట్లు పలికెను. ”సముద్రముమీదను, భువిమీదను నిలిచియున్న దేవదూత హస్తమునుండి తెరచియున్న గ్రంథమును తీసికొనుము” అనెను.

9. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించితిని. ”దీనిని తీసికొని తినుము. అది నీ కడుపులో చేదుగా నుండును. కాని నీ నోటిలో మాత్రము తేనెవలె తీయగాఉండును” అని అతడు నాతోపలికెను. 10. నేను  అతని చేతినుండి ఆ చిన్నగ్రంథమును గ్రహించితింటిని. అది నా నోటిలో తేనెవలె తీయగా ఉండెను. కాని తినిన తరువాత అది నా కడుపులో చేదుగా మారెను. 

11.  అప్పుడు అనేకమంది ”ప్రజలను, జాతులను, భాషలను, రాజులను గూర్చి మరల నీవు ప్రవచింపవలెను” అని నాకు చెప్పబడెను.