స్త్రీ – సర్పము

12 1. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను: ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు. చంద్రుడు ఆమె పాదములక్రింద ఉండెను. ఆమె శిరముపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటముఉండెను.

2. ఆమె నిండుచూలాలు.ప్రసవవేదనవలన ఆమె మూలుగుచుండెను.

3. అపుడు దివియందు మరియొక సంకేతము గోచరించెను. ఒకఎఱ్ఱనిగొప్పసర్పము గోచరించెను. దానికి ఏడు తలలు, పదికొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను.

4. అది తన తోకతో ఆకసమునందలి తారకలలో మూడవ భాగమును చుట్టచుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పమునిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మ్రింగ ఆ సర్పము చూచుచుండెను. 5. అంతట సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా, ఆమె శిశువు దేవుని వద్దకును, ఆయన సింహాసనమువద్ద కును తీసికొనిపోబడెను.

6. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పర చెను. అట ఆమె పండ్రెండువందల అరువది దినముల పాటు పోషింపబడును.

7. అంతట దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను! మిఖాయేలు, అతని తోడిదేవదూతలును ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును, దాని దూతలును వారిని ఎదిర్చి పోరాడిరి.

8. కాని ఆ సర్పమును దాని దూతలును ఓడిపోయిరి. కనుక వారు దివినుండి వెలుపలకు త్రోయబడిరి.

9. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను! ఆ  సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము, సైతాను అనునామములు గల ఆ సర్పమే లోకమునంతటిని మోసగించునది. అతడును, అతని అనుయాయులగు దూతలును భువికి నెట్టబడిరి.

10. అంతట దివియందు ఒక గంభీరకంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని: ”ఇపుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగ దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సియాగా తన అధికారమును నెరపెను! ఏలయన, మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్లు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివినుండి బయటకు గెంటి వేయబడినాడు.

11. గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా, వారు ప్రకటించిన సత్యము ద్వారా, మన సోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణములు త్యజించుటకును, మరణించుటకును కూడ సిద్ధపడిరి.

12. కనుక దేవలోకము సంతోషించునుగాక! దేవలోకవాసులు ఆనందింతురుగాక! కాని భువికిని సముద్ర నకును ఎంత అనర్థము! ఏలయన, సైతాను మీపై వచ్చి పడినదిగదా! తనకు ఉన్నవ్యవధి కొలదిమాత్రమే అని దానికి తెలియును. కనుకనే అది ప్రచండమగు కోపముతో ఉన్నది.”

13. తాను భువికి గెంటబడితినని ఆ గొప్పసర్పము గ్రహింపగనే, ఆ బాలుని ప్రసవించిన స్త్రీని వెన్నంటుటకు ప్రయత్నించెను.

14. కాని గ్రద్ద రెక్కల వంటి రెండు రెక్కలు ఆ స్త్రీకి అనుగ్రహింపబడెను. ఆ రెక్కల సాయమున ఆమె ఎడారిలోని తన నివాసమును చేరెను. అచట ఆమె సర్పముఖమును చూడకుండ ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషింపబడెను.

15.అంతట ఆ సర్పము తన నోటినుండి ఒక భయంకర జలప్రవాహమును సృష్టించి ఆమెను అనుసరింపజేసెను. ఆ జలప్రవాహమున బడి ఆమె కొట్టుకొనిపోవునని ఆ సర్పము భావించెను.

16. కాని భువి ఆ స్త్రీకి సాయపడెను. ఎట్లన, భువి తన నోటిని తెరచి  ఆ సర్పము తన నోటినుండి గ్రక్కిన ఆ జలప్రవాహమును మ్రింగివేసెను.

17. సర్పమునకు ఆ స్త్రీ పై కోపము అధికమయ్యెను. అందుచే ఆ సర్పము మిగిలియున్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యెను కాని వారు దేవుని ఆజ్ఞలకు విధేయులు, యేసుకు సాకక్షులుగా నిలచినవారు.

18. అప్పుడు  ఆ భయంకర  సర్పము సముద్రపుటొడ్డున నిలిచెను.