గొప్ప వేశ్య
17 1. అప్పుడు ఆ ఏడు పాత్రలుగల ఏడుగురు దేవదూతలలో ఒకడు నా కడకు వచ్చి. ”నాతో రమ్ము. అనేక జలములపై ఆసీనురాలైన మహావేశ్య ఎట్లు శిక్షింపబడనున్నదో నీకు చూపెదను.
2. భువియందలి రాజులు ఈ మహావేశ్యతో వ్యభిచరించిరి. ఆమె యొక్క జారత్వమను మద్యమును గ్రోలుటద్వారా భువియందలి ప్రజలు త్రాగుబోతులైరి” అని పలికెను.
3. నేను ఆత్మవశుడనైతిని. దేవదూత నన్ను ఒక ఎడారికి తీసికొనిపోయెను. అట ఒక ఎఱ్ఱని మృగముపై కూర్చుండియున్న ఒక స్త్రీని నేను చూచితిని. ఆ మృగము సర్వావయవములందును దుష్టనామములు లిఖింపబడి ఉండెను. ఆ మృగమునకు ఏడు తలలు, పది కొమ్ములు.
4. ఆ స్త్రీ ధూమ్ర, రక్త వర్ణములుగల వస్త్రములను ధరించిఉండెను. ఆమె సువర్ణాభరణములను అమూల్యములైన రత్నములను, ముత్యములను దాల్చియుండెను. ఆమె హస్తమున ఒక సువర్ణపాత్రను ధరించెను. అది ఆమె అసహ్యకరములు, జుగుప్సాకరములు, వ్యభిచారసంబంధమైన అపరిశుద్ధతతో నిండియుండెను.
5. ఆమె నుదుటియందు ఒక రహస్యార్థముగల నామము లిఖింపబడిఉండెను. ”వేశ్యలకు మాతయు, లోకమునందలి దుర్నీతులకు తల్లియు అగు బబులోనియా మహానగరము” అని అట వ్రాయబడి ఉండెను.
6. ఆమె పునీతుల మరియు యేసు కొరకు ప్రాణమును ఇచ్చిన వేదసాక్షుల రక్తపానముచే మత్తిల్లి ఉండుట నేను గమనించితిని. నేను ఆమెను చూచి మహాశ్చర్యపడితిని.
7. ”నీవు ఏల ఆశ్చర్యపడితివి?” అని దేవదూత నన్ను అడిగెను. ”ఆ స్త్రీ యొక్కయు, ఆమెను మోయుచున్న ఏడు తలలు పదికొమ్ములు గల మృగముయొక్కయు రహస్యార్థ మును నీకు ఎరిగించెదను.
8. నీవు చూచిన మృగము ఒకప్పుడు సజీవియే. కాని ఇప్పుడు జీవమును కోల్పోయినది. అది అగాధమునుండి వెలువడి నాశనము ఒనర్పబడనున్నది. సృష్ట్యాదియందు సజీవుల గ్రంథమునందు పేర్లు చేర్పబడని వారందరు ఆ మృగమును చూచి ఆశ్చర్యపడుదురు. ఏలయన, ఒకప్పుడు అది సజీవియే. ఇప్పుడు నిర్జీవి. కాని పునర్జీవియగును.
9. ”కాని ఇది బోధపడుటకు జ్ఞానము, అవగాహన శక్తి అవసరము. ఏడు శిరస్సులే ఏడు పర్వతములు. ఆ ఏడు పర్వతములపై ఆ స్త్రీ ఆసీనురాలగును. అవియే ఏడుగురు రాజులు.
10. వానిలో ఐదుగురు పతనమైరి. ఒకరు ఇంకను అధికారము నెరపుచున్నారు. ఒకరు ఇంకను రాలేదు. వచ్చిన అనంతరము కేవలము కొలది కాలము మాత్రమే నిలుచును.
11. ఒకప్పుడు సజీవియైనను, ఇప్పుడు నిర్జీవియగు ఆ మృగమే ఎనిమిదవ రాజు. అతడు మొదటిఏడుగురికిని సంబంధించినవాడే. అతడును నశించును.
12. నీవు చూచిన పదికొమ్ములు పదిమంది రాజులు. వారి రాజ్యాధికారము ఇంకను ప్రారంభము కాలేదు. కాని మృగముతోపాటు ఒక గంటకాలము రాజులుగా వారికి అధికారము ఇవ్వబడెను.
13. ఈ పదిమంది ఉద్దేశము ఒక్కటే. వారు తమ శక్తిని, అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.
14. వారును గొఱ్ఱెపిల్లతో పోరాడుదురు. కాని గొఱ్ఱెపిల్ల వారిని ఓడించును. ఏలయన ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. అతనితో ఉన్నవారు పిలువ బడినవారు, ఎన్నుకొనబడినవారు, విశ్వాసపాత్రులు.”
15. ఆ దేవదూత ఇంకను నాతో ఇట్లు చెప్పెను: ”వేశ్య కూర్చుండి ఉండెడి జలములే ప్రజలు, ప్రజా సమూహములు, జాతులు, భాషలు. నీవు గమనించితివి గదా!
16. నీవు చూచిన ఆ పదికొమ్ములు, ఆ మృగము కూడ ఆ వేశ్యను ద్వేషించును. అవి, ఆమెకు ఉన్న సమస్తమును గ్రహించి ఆమెను వివస్త్రగా వదలి వేయును. అవి ఆమె మాంసమును తిని ఆమెను అగ్నిచే దగ్ధమొనర్చును.
17. ఏలయన, దేవుని వాక్కు నెరవేరువరకును, ఏకాభిప్రాయముతో తమ రాజ్యాధికార శక్తిని మృగమునకు ఇచ్చుట ద్వారా, తన ఆశయమునే నెరవేర్చు వాంఛలను దేవుడు వారి మనసులలో ప్రవేశపెట్టెను.
18. నీవు చూచిన ఆ స్త్రీ భువి యందలి రాజులపై ఆధిపత్యమును వహించు మహానగరము.”