22 1. జీవజల నదీప్రవాహమును కూడ నాకు ఆ దేవదూత చూపెను. అది దేవుని సింహాసనము నుండియు, గొఱ్ఱెపిల్లనుండియు ఉద్భవించెను. అది స్ఫటికమువలె మెరయుచు 2. ఆ నగర రాజమార్గ మధ్యముగుండ ప్రవహించును. ఆ నదికి రెండు ప్రక్కల జీవవృక్షములు ఉండెను. నెలకు ఒక మారు చొప్పున, అవి సంవత్సరమునకు పండ్రెండుమార్లు కాపునకు వచ్చును. వాని ఆకులు ప్రజల గాయములు మాన్పును.
3. ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు అక్కడ కనిపించదు. దేవుని యొక్క, గొఱ్ఱెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవింతురు.
4. వారు ఆయన ముఖమును దర్శించెదరు. ఆయన నామము వారి నొసళ్లపై వ్రాయబడి ఉండును.
5. ఇక రాత్రి ఎన్నటికిని ఉండబోదు. ప్రభువగు దేవుడే వారికి వెలుగు. కనుక వారికి దీపపు వెలుతురుగాని, సూర్యకాంతిగాని అవసరము లేదు. వారు సదా రాజ్యపాలనము చేయుదురు.
యేసు రాక
6. అంతట, ఆ దేవదూత నాతో ”ఈ పలుకులు యథార్థములు, విశ్వసింపతగినవి. ప్రవక్తలకుతన ఆత్మనిచ్చు ప్రభువగు దేవుడు, తన సేవకులకు త్వరలో ఏమి జరుగనున్నదో చూపుటకు తన దేవదూతను పంపెను” అని చెప్పెను.
7.”ఇదిగో నేను త్వరలో రానున్నాను! ఈ గ్రంథమునందలి ప్రవచన వాక్కులను పాటించువారు ధన్యులు!” అని క్రీస్తు వచించెను.
8. యోహాను అనబడు నేను ఈ సర్వ విషయములను వింటిని, చూచితిని. వానిని వినిచూచిన తరువాత, ఆయనను ఆరాధించుటకై నాకు వీనినన్నటిని ప్రదర్శించిన దేవదూత పాదములయొద్ద సాగిలపడితిని.
9. కాని ఆ దేవదూత ”అటుల చేయకుము! నీకును, ప్రవక్తలైన నీ సోదరులకును, ఈ గ్రంథము నందలి విషయములను పాటించు వారికిని, అందరకును నేను సహ సేవకుడను మాత్రమే. దేవుని ఆరాధింపుము” అనిపలికెను.
10. అతడు ఇంకను, ”ఈ గ్రంథము నందలి ప్రవచనములను రహస్యముగ ఉంచకుము. ఏలయన, ఇవి సంభవించు కాలము ఆసన్నమైనది.
11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము. అపవిత్రునిఅపవిత్రునిగనేఉండనిమ్ము. నీతిమంతులను నీతిమంతులుగనే ఉండనిమ్ము. పవిత్రుని ఇంకను పవిత్రునిగనే ఉండనిమ్ము” అని పలికెను.
12. ”ఇదిగో! నేను త్వరలో రానున్నాను. వారివారి క్రియలను బట్టి వారికి ఒసగదగిన బహుమానములను నావెంటతెత్తును.
13. నేనే ఆల్ఫా, ఓమేగ; నేనే మొదటి వాడను, కడపటివాడను; నేనే ఆదియును అంతమునై ఉన్నాను” అని యేసు పలికెను.
14. తమ వస్త్రములను శుభ్రముగ క్షాళనము ఒనరించుకొను వారు ధన్యులు. వారే జీవవృక్షమునకు అర్హత గలవారు. ద్వారముల గుండా నగరమున ప్రవేశింప వారే అర్హులు.
15. వక్రబుద్ధులు, మాంత్రికులు, వ్యభిచారులు, హంతలు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి పాటించు ప్రతివాడు నగరమునకు వెలుపలనే ఉండును.
16. ”యేసును అయిన నేను, దైవసంఘములలో మీకు ఈ విషయములు ప్రకటించు నిమిత్తము నాదూతను పంపియున్నాను. నేను దావీదు వేరుచిగురును, సంతానమును, ప్రకాశవంతమైన వేగుచుక్కను.”
17. ఆత్మయు,వధువును, ”రమ్ము!”అని పలుకుచున్నారు. దీనిని వినిన ప్రతివ్యక్తియు ”రమ్ము!” అని పలుకవలెను. దప్పిక గొనినవారు అందరును రండు! ఇష్టపడువారు అందరును జీవజలములను ఉచితముగ పుచ్చుకొనవచ్చును.
తుది పలుకులు
18. యోహానునగు నేను, ఈ గ్రంథపు ప్రవచనములను వినిన ప్రతివ్యక్తిని ఇట్లు తీవ్రముగాహెచ్చరించుచున్నాను.దీనియందలి విషయములకు ఎవరైన ఏమైన చేర్చినచో, ఈ గ్రంథమున వివరింపబడిన అరిష్టములతో దేవుడు వానిని శిక్షించును.
19. ఎవరైనను ఏమైనను ఈ గ్రంథపు ప్రవచన వాక్కులనుండి తొలగించినచో, ఈ గ్రంథమున వివరింపబడినట్లు వాని భాగమగు జీవవృక్షఫలములను, వాని పవిత్ర నగర భాగస్వామ్యమును దేవుడు తొలగించును.
20. ఈ విషయములను గూర్చి సాక్ష్యముఇచ్చు వ్యక్తి ”అది నిజము! నేను త్వరలో వచ్చుచున్నాను!” అని పలుకుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసూ, రమ్ము.
21. యేసు ప్రభుని అనుగ్రహము పవిత్రులందరితోను ఉండునుగాక! ఆమెన్.