ప్రస్తావన

1 1. ఘనతవహించిన తెయోఫిలూ! మనమధ్య జరిగిన సంఘటనలను వ్రాయుటకు అనేకులు ప్రయత్నించిరి.

2. వారు వ్రాసిన ఈ సంఘటనలను మొదటినుండియు ప్రత్యక్షముగా చూచిన వారివలన, సువార్తను బోధించిన వారివలన మనము వినియున్నాము.

3. కావున, అన్ని విషయములను మొదటినుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప, వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకును తోచినది.

4. నీకు ఎరుకచేయబడిన విషయములను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును వ్రాయుచున్నాను.

యోహాను జననసూచన – దూత ప్రకటన

5. యూదయాదేశపు రాజగుహేరోదు కాలమున అబీయా వర్గమునకు చెందిన జెకర్యా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిశబేతమ్మ.

6. వారిద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులై, ఆయన ఆజ్ఞలకును, నియమములకును బద్ధులైయుండిరి.

7. ఎలిశబేతమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానములేదు. ఇద్దరును కడువృద్ధులు.

8. ఒక దినము జెకర్యా తనవర్గము వంతు ప్రకారము దేవునిసన్నిధిలో యాజకవిధిని నెరవేర్చు చుండెను.

9. ఆనాటి యాజకసంప్రదాయాను   సారముగ అతనికి దేవాలయములోనికి వెళ్ళి ధూపము వేయు వంతువచ్చెను.

10. అతడు ధూపమువేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి.

11. అపుడు ధూపపీఠమునకు కుడిప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను.

12. దేవదూతనుగాంచి జెకర్యా తొట్రుపడి భయపడెను.

13.అపుడు దేవదూత అతనితో ”జెకర్యా! భయపడకుము. నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిశబేతమ్మ ఒక కుమారుని కనును. అతనికి ”యోహాను” అను పేరుపెట్టుము.

14. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని  జన్మము అనేకులకు సంతోషకారణమగును.

15. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షరసమునుగాని, మద్య మునుగాని  పానముచేయడు.  తల్లి  గర్భముననే  పవిత్రాత్మతో నింపబడును.

16. అతడు యిస్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవునివైపు మర లించును.

17.అతడు ఏలీయా ఆత్మయును, శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడచును. తల్లిదండ్రులను, బిడ్డలను సమాధానపరచును.అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును” అనెను.

18. అంతట జెకర్యా దేవదూతతో ”ఇది ఎట్లు జరుగును? నేనా ముసలివాడను. నా భార్యకు కూడ వయస్సు వాలినది” అని పలికెను.

19. అపుడు దేవదూత ”నేను గబ్రియేలును, దేవునిసన్నిధిలో ఉండువాడను. ఈ శుభసమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని.

20. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరువరకు మూగవాడవై ఉందువు” అని పలికెను.     

21. ఇంతలో వెలుపలి ప్రజలు జెకర్యా కొరకు వేచియుండి ‘దేవాలయమున అతను ఇంత జాగు చేయుటకు కారణమేమి!’ అని ఆశ్చర్యపడిరి.

22. జెకర్యా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను. కాని అతడు మాటలాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్యదర్శన మైనదని తెలిసికొనిరి. జెకర్యా మూగవాడై సైగలు చేయుచుండెను.

23. పరిచర్యదినములు ముగియగనే జెకర్యా తన ఇంటికి వెళ్ళిపోయెను.

24. కొన్ని దినములు గడచిన పిదప జెకర్యా భార్య ఎలిశబేతమ్మ గర్భము ధరించెను. అయిదు మాసములవరకు ఆమె పరుల కంటబడకుండెను.

25. ”ఈనాటికి ప్రభువు నాపై కరుణచూపెను. ప్రజలమధ్య నా నిందను పోగొట్టెను” అని ఆమె పలికెను.

యేసు జననసూచన – దూత ప్రకటన

26. తదుపరి ఆరవమాసమునదేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను.

27. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ.

28. దేవదూత లోపలికివచ్చి, ఆమెతో ”అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను.

29. మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా 30. దేవ దూత ”మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు.

31. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు ‘యేసు’ అని పేరు పెట్టుము.

32. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.

33. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అనెను.   

34. అంతట మరియమ్మ ”నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?” అని దూతను ప్రశ్నించెను.

35. అందుకు ఆ దూత ఇట్లనెను: ”పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్రశిశువు ‘దేవుని కుమారుడు’ అని పిలువబడును. 

36.  నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళి నదిగదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము.

37. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు” 38. అంతట మరియమ్మ ”ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!” అనెను. అంతట ఆ దూత వెళ్ళి పోయెను.

మరియమ్మ ఎలిశబేతమ్మను దర్శించుట

39. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వతప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను.

40. ఆమె జెకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిశబేతమ్మకు వందనవచనము పలికెను. 41. ఆ శుభవచనములు ఎలిశబేతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే  పరిపూర్ణురాలాయెను.

42. పిమ్మట ఎలిశబేతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను:

               ”స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు.

               నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను.

43.         నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట

               నాకు ఏలాగు ప్రాప్తించెను?

44.         నీ వందనవచనములు నా చెవిని సోకగనే

               నా గర్భమందలి శిశువు

               ఆనందముచే గంతులు వేసెను.

45.         ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని

               విశ్వసించిన నీవెంత ధన్యురాలవు!”

మరియమ్మ స్తోత్రగీతము

46.        అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను:

               ”నా హృదయము ప్రభువును

               స్తుతించుచున్నది.

47.         నా రక్షకుడగు దేవునియందు

               నాయాత్మ ఆనందించుచున్నది.

48.        ఏలయన, ఆయన తనదాసురాలి

               దీనావస్థను కాక్షించెను.

               ఇకనుండి తరతరములవారు

               నన్ను ధన్యురాలని పిలిచెదరు.

49.        ఏలయన, సర్వశక్తిమంతుడు

               నాయెడల గొప్పకార్యములు చేసెను.

               ఆయన నామము పవిత్రమైనది.

50.        ప్రభువుపట్ల భయభక్తులు

               గలవారి మీద ఆయన కనికరము 

               తరతరములవరకు ఉండును.

51.          ఆయన తన బాహుబలమును చూపి

               అహంకారుల దురాలోచనలను

               విచ్ఛిన్నము కావించెను.

52.         అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి,

               దీనులను లేవనెత్తెను.

53.         ఆకలిగొన్నవారిని సంతృప్తిపరచి,

               ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

54.         మన పితరులగు అబ్రహామునకు,

               అతని సంతతివారికి తరతరములవరకు

               చేసిన వాగ్దానము ప్రకారము

55.         తన కనికరమును బట్టి

               తన సేవకుడగు యిస్రాయేలునకు

               సహాయము చేసెను”.

56.        మరియమ్మ మూడుమాసములు ఎలిశబేతమ్మతో ఉండి, పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను.

యోహాను జననము

57. ప్రసవకాలము రాగానే ఎలిశబేతమ్మ కుమారుని కనెను.

58. ప్రభువు ఆమెయందు గొప్ప కనికరమును చూపెనని విని, ఇరుగుపొరుగువారు, బంధువులును ఆమెతో కలసి సంతసించిరి.

59. ఎనిమిదవనాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రిపేరుననుసరించి ‘జెకర్యా’ అను పేరు పెట్టదలచిరి.

60. కాని బాలుని తల్లి వారితో ”అట్లుకాదు ‘యోహాను’ అను పేరు పెట్టవలయును” అని పలికెను.

61 అంతట వారు ”మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరును లేరుగదా!” అని, 62. ”శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు?” అని సైగలతో తండ్రిని అడిగిరి.

63.  అతడు పలక తెప్పించి, ‘అతని పేరు యోహాను’ అని వ్రాయగా, వారందరు ఆశ్చర్యపడిరి.

64. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక పట్టుసడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను.

65. ఇరుగుపొరుగువారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయా పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను.

66. ఈ విషయములను వినిన వారందరు ‘ఈ పసి బాలుడు ఎట్టివాడగునో!’ అని మనసులో అనుకొనిరి. ఏలయన, దేవునిహస్తము అతనికి తోడైఉండెను.

జెకర్యా ప్రవచనము

67.         ఆ బాలుని తండ్రి జెకర్యా

               పవిత్రాత్మపూర్ణుడై ఇట్లు ప్రవచించెను:

68.        ”ప్రభువగు యిస్రాయేలు దేవుడు

               స్తుతింపబడునుగాక!

               ఏలయన, ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి

               వారిని విముక్తులను చేసెను.

69.        తన సేవకుడగు దావీదువంశమున

               మన కొరకు శక్తిసంపన్నుడైన

               రక్షకుని ఏర్పరచెను.

70.         తరతరములనుండి పవిత్ర ప్రవక్తల

               మూలమున ఆయన తెలియచేసినది ఇదియే.

71.          ఆయన మనలను శత్రువులనుండి

               రక్షించుటకు, మనలను ద్వేషించువారినుండి

               తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను.

72.         మన పితరులను కనికరముతో చూచెను.

               తన పరిశుద్ధ నిబంధనమును

               స్ఫురణకు తెచ్చుకొనెను.

73-75. మనలను శత్రువుల బారినుండి

               విముక్తులను కావించి,

               నిర్భయముగా ఆయనను సేవించునట్లును,

               మనము జీవితాంతము పవిత్రులముగా

               నీతిమంతులముగా జీవించునట్లును చేసెదనని,మనపితరుడైన అబ్రహాముతో

               ఆయన ప్రమాణము చేసెను.

76.         కుమారా! నీవు సర్వోన్నతుని

               ప్రవక్తవనబడుదువు. ప్రభువు మార్గమును

               సిద్ధపరచుటకు వెళ్ళుదువు.

77.          పాప క్షమాపణ మూలమున రక్షణ

               కలుగునని, ప్రజలకు తెలియచేయుటకు,

               ఆయనకు ముందుగా వెళ్ళుదువు.

78.         దేవుడు దయార్ద్రహృదయుడు.

               ఆయన రక్షణపు వెలుగును

               మనపై  ప్రకాశింపచేసి,

79.         శాంతిమార్గమున మనలను

               నడిపించుటకు అంధకారములోను,

               మరణపు నీడలోను ఉన్నవారిపై

               దానిని ప్రసరింపచేయును.”

80. ఆ బాలుడు వృద్ధిచెందుచు, ఆత్మయందు బలసంపన్నుడాయెను. యిస్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించువరకు అతడు ఎడారిలో ఉండెను.