ప్రభు ప్రార్థన
(మత్తయి 6:9-13; 7:7-11)
11 1. యేసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుటతోడనే ఆయన శిష్యుడు ఒకడు ”ప్రభూ! యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థనచేయుట నేర్పుడు” అని అడిగెను.
2. అందుకు ఆయన వారితో, ”మీరిట్లు ప్రార్థింపుడు:
తండ్రీ! నీ నామము పవిత్రపరుపబడుగాక!
నీ రాజ్యము వచ్చునుగాక!
3. మాకు కావలసిన అనుదిన ఆహారము
మాకు ప్రతిదినము దయచేయుము.
4. మా పాపములను క్షమింపుము.
ఏలయన, మేమును, మా ఋణస్థులందరను క్షమించుచున్నాము. మమ్ము శోధనలో చిక్కుకొన నీయకుము” అని చెప్పెను.
5. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: ”మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు. ‘మిత్రమా! నీవు నాకు మూడురొట్టెలు బదులు ఇమ్ము.
6. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవుచు, నా ఇంటికి వచ్చి యున్నాడు. అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియును లేదు.’
7. అపుడు ఆ మిత్రుడు లోపలనుండి ‘నన్ను తొందరచేయకుము. తలుపులుమూసి ఉన్నవి. పిల్లలు నాయొద్ద పక్కమీద ఉన్నారు. నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను’ అని సమాధానము ఇచ్చెననుకొనుడు.
8. నేను మీతో చెప్పునది ఏమన, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమియు ఈయక పోయినను, పదేపదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును.
9. అట్లే మీరును ‘అడుగుడు. మీకు అనుగ్రహింపబడును. వెదకుడు మీకు దొరకును. తట్టుడు మీకు తెరవబడును.
10. అడిగిన ప్రతివానికి ఈయబడును. వెదకువానికి దొరకును. తట్టువానికి తెరవబడును’ అని మీతో చెప్పుచున్నాను.
11. మీలో ఏ తండ్రియైన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా?
12. గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా?
13. మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియునుగదా! పరలోక మందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంక ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు.”
దైవము – దయ్యము
(మత్తయి 12:22-30; మార్కు 3:20-27)
14. ఆయన ఒక మూగదయ్యమును పార ద్రోలుచుండెను. దయ్యము పారిపోవగానే మూగవాడు మాటలాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి.
15. కొందరు ”ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు” అనిరి.
16. మరి కొందరు ఆయనను పరీక్షింపగోరి ”పరలోకమునుండి ఒక గురుతును చూపుము” అనిరి.
17. యేసు వారి ఆలోచనలను గ్రహించి, వారితో ఇట్లనెను. ”అంతఃకలహములకు గురియైన ఏ రాజ్యమైనను నాశమగును. కలహమునకు గురియైన ఏ గృహమైనను కూలిపోవును.
18. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురియైనచో అది ఎటుల నిలువగలదు? నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు.
19. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక, వారే మీకు న్యాయాధిపతులు.
20. నేను దేవుని ప్రభావమువలన దయ్యములను వెడలగొట్టుచున్నాను, కాబట్టి దైవ రాజ్యము మీ సమీపమునకు వచ్చియున్నది.
21. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలికాచుకొనినచో అతని సంపద సురక్షితముగానుండును.
22. కాని అతనిని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించినయెడల, అతడు నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనము చేసికొని, అతడు దోచుకొనిన సంపదను పంచి పెట్టును.
23.నాపక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు. నాతో ప్రోగుచేయనివాడు చెదరగొట్టువాడు.
అపవిత్రాత్మ వలన దుర్దశ
(మత్తయి 12:43-45)
24. ”అపవిత్రాత్మ ఒక మనుష్యుని వీడిపోయినపుడు అది విశ్రాంతికై వెదకుచు, నీరులేని ప్రదేశములలో తిరుగుచుండును. అది దొరకనపుడు ‘నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయెదను’ అని చెప్పును.
25. వచ్చినపుడు ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చబడి ఉండుటచూచి, 26. వెళ్ళి తనకు మించిన మరి ఏడు దయ్యములను తీసికొనివచ్చి, అక్కడ నివాసము ఏర్పరచుకొనును. అందువలన ఆ మనుష్యుని పూర్వ స్థితికంటె కడపటిస్థితి మిక్కిలి హీనముగా ఉండును.”
ధన్యులు
27. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ ”నిన్ను మోసిన గర్భమును, నీకు పాలిచ్చిన స్తనములును ధన్యమైనవి” అని ఎలుగెత్తి పలికెను.
28. కాని యేసు ”దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు” అనెను.
యోనా ప్రవక్త చిహ్నము
(మత్తయి 12:38-42)
29. ప్రజలు అనేకులు అచటచేరగా, యేసుఇట్లుచెప్పనారంభించెను:”ఈ తరము దుష్టమైనది. ఇది ఒక గురుతును కోరుచున్నది. కాని యోనా సూచనకంటె వేరొకటి అనుగ్రహింపబడదు.
30. ఏలయన నీనెవె వాసులకు యోనా సూచన అయినట్లే ఈ తరమునకు మనుష్యకుమారుడును ఒక సూచన యగును.
31. తీర్పుదినమున దక్షిణదేశపు రాణి వీరి ఎదుటనిలిచి వీరిని ఖండించును. ఏలయన, ఆమె సొలోమోను విజ్ఞానవాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో! ఆ సొలోమోనుకంటె అధికుడు ఇచ్చట ఉన్నాడు.
32. నీనెవె పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయపరివర్తనము చెందిరి. కనుక, తీర్పుదినమున వారు వీరిఎదుట నిలిచి, వీరిని ఖండింతురు. ఇదిగో! యోనా కంటె గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు.
వెలుగు నీడలు
(మత్తయి 5:15; 6:22-23)
33. దీపమును వెలిగించి ఎవడును చాటున గాని, కుంచము క్రిందగాని ఉంచడు. లోనికి వచ్చువారికి వెలుతురును ఇచ్చుటకు దీపస్తంభముపై ఉంచును.
34. నీ కన్ను నీ దేహమునకు దీపము. అది తేటగ ఉన్నయెడల నీ దేహమంతయు కాంతిమంతమై ఉండును. నీ కన్ను దుష్టమైనచో నీ దేహ మంతయు చీకటిమయమగును.
35. కనుక నీలో ఉన్న వెలుగు చీకటిగా మారకుండుటకు నీవు అప్రమత్తుడవై ఉండుము.
36. అంధకారము ఏమియు లేక నీ శరీరమంతయు వెలుగుతో నిండినయెడల, దీపము తన కిరణములతో కాంతిని వెదజల్లునట్లు నీ దేహము అంతట ప్రకాశించును.”
అధర్మ క్రియలు
(మత్తయి 23:13-36; మార్కు 12:38-40)
37.ఆయన మట్లాడుచుండగా ఒకపరిసయ్యుడు తనతో కూడ భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికివెళ్ళి భోజనమునకు కూర్చుండెను.
38. భోజనమునకుముందు ఆయన కాళ్ళుచేతులు కడుగుకొనకపోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. 39. అందుకు యేసు అతనితో ఇట్లనెను: ”మీ పరిసయ్యులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్యశుద్ధిచేయుదురు. కాని మీ అంతరంగము మాత్రము దౌర్జన్యముతోను, దుష్టత్వముతోను నిండియున్నది.
40. అవివేకులారా! వెలుపలి భాగమును చేసినవాడు లోపలిభాగమును కూడ చేయలేదా?
41. కనుక మీకున్న దానిని పేదలకు ఒసగుడు. అప్పుడు అంతయు శుద్ధియగును.
42. ”అయ్యో పరిసయ్యులారా! మీకు అనర్థము. మీరు పుదీనా, సదాప మొదలగు ప్రతి ఆకుకూరలోను పదియవవంతును చెల్లించుచున్నారు. కాని, న్యాయమును, దైవప్రేమను ఉపేక్షించుచున్నారు. వానిని చెల్లింపవలసినదే. కాని వీనిని నిర్లక్ష్యము చేయరాదు.
43. అయ్యో పరిసయ్యులారా! మీకు అనర్థము. మీరు ప్రార్థనామందిరములందు ప్రధానఆసనములను, అంగడి వీధులయందు వందనములను అందుకొనుటకు కాంక్షింతురు.
44. అయ్యో పరిసయ్యులారా! మీకు అనర్థము. ఏలయన మీరు కనబడని సమాధులవలె ఉన్నారు.అవి సమాధులు అని తెలియకయే మనుష్యులు వానిపై నడచుచున్నారు.”
45. అపుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు ”బోధకుడా! ఇట్టిమాటలతో నీవు మమ్ములను కూడ నిందించుచున్నావు” అనెను.
46. అందుకు యేసు ”అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా! మీకు అనర్థము. మీరు మోయసాధ్యముకాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని, వారు ఆ భారములను మోయుటకు వారికి సహాయముగా మీ చిటికెన వ్రేలైనను కదపరు.
47. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా! మీకు అనర్థము. మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు.
48. ఈ విధమున మీరు మీపితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవించుచున్నారు. ఏలయన, వారు ప్రవక్తలను చంపిరి. మీరు వారికి సమాధులను కట్టుచున్నారు.
49. ఇందువలననే దేవునిజ్ఞానము ఇట్లు చెప్పుచున్నది: ‘నేను వారి వద్దకు ప్రవక్తలను, అపోస్తలులను పంపెదను. వారిలో కొందరిని వారు చంపెదరు. కొందరిని హింసించెదరు’, 50-51. ప్రపంచ ప్రారంభమునుండియు, అనగా హెబేలు హత్య మొదలుకొని, ఆలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జెకర్యా హత్యవరకును చిందింపబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరమువారు విచారింపబడుదురు అని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను.
52. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా! మీకు అనర్థము. మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి, తాళపుచెవిని మీ స్వాధీనము చేసికొనిఉన్నారు. మీరు ప్రవేశింపలేదు. ప్రవేశించువారిని మీరు అడ్డగించితిరి” అని చెప్పెను.
53. యేసు అక్కడినుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులును, పరిసయ్యులును ఆయనపై పగబట్టి ఎట్లయిన ఆయనలో తప్పుపట్ట వలెనని ఒత్తిడి చేయుచు ప్రశ్నింపసాగిరి.
54. ఇట్లు వారందరు ఆయనను మాటలలో చిక్కించుకొనవలయునని పొంచియుండిరి.