క్రీస్తుపై కుట్ర

(మత్తయి 26:1-5; 14-16 మార్కు 14:1-2;10-11; యోహాను 11:45-53)

22 1.  పాస్క  అనబడు  పులియని  రొట్టెల  పండుగ  సమీపించుచుండెను.

2. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలకు భయపడుచున్నందున యేసును చంపుటకు అనువైన మార్గం వెదకుచుండిరి.

గురుద్రోహి సమ్మతి

(మత్తయి 26:14-16; మార్కు 14:10-11)

3. అపుడు పన్నిద్దరు శిష్యులలో ఒకడగు యూదా ఇస్కారియోతులో సైతాను ప్రవేశించెను.

4. అతడు బయటకు వెళ్ళి ప్రధానార్చకులను, ఆలయ అధికారులను కలిసికొని, తాను యేసును వారిచేతికి ఎటుల అప్పగింపనున్నాడో చెప్పెను.

5. వారు సంతసించి, అతనికి కొంత ధనమిచ్చుటకు సమ్మతించిరి.

6. కావున అతడు అంగీకరించి ఆయనను వారికి అప్పగించుటకు జన సమూహములేని సమయమునకై వేచియుండెను.

పాస్క భోజన సన్నాహము

(మత్తయి 26:17-19; మార్కు 14:12-16; యోహాను 13:21-30)

7.  పాస్కగొఱ్ఱెను బలి అర్పించవలసిన పులియని రొట్టెల పండుగ రోజు వచ్చెను.

8. యేసు, పేతురు యోహానులతో ”మీరు వెళ్ళి మనము భుజించుటకు పాస్కభోజనము సిద్ధము చేయుడు” అని చెప్పి పంపెను.

9.”మీరు భోజనము ఎక్కడ సిద్ధము చేయించుమని కోరుచున్నారు?” అని వారు అడిగిరి.

10. అందులకు ఆయన ”మీరు పట్టణమున ప్రవే శింపగనే నీళ్ళ కడవ మోసికొని పోవుచున్న ఒక వ్యక్తి మీకు ఎదురగును. అతడు ప్రవేశించు ఇంటికి మీరును అతని వెంటవెళ్ళుడు.

11. ‘నేను నా శిష్యులతో గూడ పాస్కభోజనముచేయు అతిథిశాల ఎక్కడ ఉన్నది? అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడు’ అని ఆ యింటియజమానునితో చెప్పుడు.

12. అతడు మీకు మేడ పైభాగమున అమర్పబడియున్న విశాలమైన ఒక గదిని చూపును. అచటనే మీరు భోజనము సిద్ధము చేయుడు” అనెను.

13. వారు వెళ్ళి యేసు చెప్పిన ప్రకారమే కనుగొని పాస్క భోజనము సిద్ధము చేసిరి.

ప్రభు భోజనము

(మత్తయి 26:26-30; మార్కు 14:22-26; 1 కొరింతీ 11:23-25)

14. ఆ గడియ వచ్చినపుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను.

15. అపుడు ఆయన వారితో ”నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కను భుజింపవలయునని ఎంతయో ఆశించితిని.

16. ఏలయన దేవునిరాజ్యములో ఇది నెరవేరువరకు నేను దీనిని మరల రుచిచూడను” అనెను.

17. అపుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, ”దీనిని తీసికొని మీరు పానముచేయుడు.

18. ఏలయన, ఇది మొదలు దైవరాజ్యము వచ్చువరకు ఈ ద్రాక్షరసమును నేను చవిచూడనని మీతో చెప్పుచున్నాను” అనెను.

19. అపుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దానిని త్రుంచి వారికి ఒసగుచు ”ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు” అనెను.

20. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని ”ఈ పాత్రము మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన” అనెను.

21. ”ఇదిగో! నన్ను పట్టిచ్చువాడు ఇచటనే ఉన్నాడు.

22. నిశ్చయింపబడినవిధమునమనుష్యకుమారుడుగతించును. కాని ఆయనను అప్పగించువానికి అనర్థము” అనెను.

23. అందుకు వారు ”మనలో ఈ పనికి పూనుకొన్న వాడు ఎవడు?” అని ఒకరినొకరు ప్రశ్నించుకొన సాగిరి.

దేవరాజ్యములో గొప్పవాడు

24. తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తలఎత్తెను.

25. యేసు వారికి ఇటుల చెప్పెను. ”అన్యజనుల రాజులు వారిపై అధికారము చెలాయింతురు. వారి అధికారులు  ఉపకారులని పిలువబడుచున్నారు.

26. కాని, మీరు అటుల చేయవలదు. మీలో  గొప్పవాడు చిన్నవానివలెను, నాయకుడు సేవకునివలెను ఉండవలయును.

27. భోజనమునకు కూర్చున్న వ్యక్తియా? లేక వడ్డించు వ్యక్తియా? ఎవడు గొప్పవాడు? భోజనమునకు కూర్చున్న వ్యక్తియే కదా? నేను మీ మధ్య  ఒక  సేవకునివలె  ఉన్నాను. 

28. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. 29. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు, నేనును మీకు ఇచ్చుచున్నాను.

30. మీరు నా రాజ్యములో నాతోకూడ విందు ఆరగించుచు, సింహాసనములపై కూర్చుండి యిస్రాయేలీయుల పండ్రెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు.

పేతురు బొంకు – యేసు ప్రవచనము

(మత్తయి 26:31-35; మార్కు 14:27-31; యోహాను 13:36-38)

31. ”సీమోనూ! సీమోనూ! మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను.

32. కాని, నీ విశ్వాసము చెదరకుండుటకును నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయపరివర్తనము కలిగినపుడు, నీ  సోదరులను  స్థిరపరపుము” అనెను.

33. అందుకు అతడు ”ప్రభూ! నేను మీతోకూడ చెరసాలకు పోవుటకు, మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను” అని చెప్పగా 34. యేసు, ”పేతురూ! నేడు కోడికూతకు ముందు, నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవని నేను నీతో చెప్పుచున్నాను” అనెను.

జాలె – జోలె – ఖడ్గము

35. ”నేను మిమ్ము జాలెను, జోలెను, పాద రక్షలనులేకుండ పంపినపుడు మీకు ఏదైన తక్కువ పడినదా?” అని యేసు వారిని అడిగెను. ‘లేదు’ అని వారు బదులుపలుకగా 36. జాలె ఉన్నవాడు జాలెను, అట్లే జోలెను కొనిపోవలయును. కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలయును.

37. ఏలయన, ‘అతడు అపరాధులలో ఒకడుగ పరిగణింపబడెను’ అను లేఖనము నాయందు నెరవేర వలసి యున్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నియు నెరవేరనున్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను.

38. ”ప్రభూ! ఇదిగో ఇక్కడ రెండు ఖడ్గములు ఉన్నవి” అని వారు చెప్పిరి. ”చాలును” అని యేసు బదులు పలికెను.

ఓలీవు కొండపై యేసు ప్రార్థన

(మత్తయి 26:36-46; మార్కు 14:32-42 యోహాను 18:1)

39. ఆయన అక్కడనుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఓలీవు కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి.

40. ఆ స్థలమునకు చేరినపిమ్మట యేసు వారితో ”శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థనలుచేయుడు” అని చెప్పెను.

41. పిమ్మట ఆయన రాయివేటు దూరము వెళ్ళి మోకరిల్లి, 42 ”తండ్రీ! నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము. కాని నా యిష్టము కాదు. నీ చిత్తమే నెరవేరునుగాక!” అని ప్రార్థించెను.

(43. అపుడు పరలోకమునుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను.

44 ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్తబిందువుల వలె భూమిమీద పడుచుండెను.)

45.ప్రార్థన ముగించి యేసు శిష్యులయొద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసిసొలసి నిద్రకులోనగుట చూచెను.

46. యేసు వారితో ”మీరు ఏల నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురికాకుండుటకై ప్రార్థన చేయుడు” అని చెప్పెను.

యేసు బందీ అగుట

(మత్తయి 26:47-56; మార్కు 14:43-52; యోహాను 18:1-11)

47. యేసు ఇంకను మాట్లాడుచుండగనే అచటకు ఒక గుంపు వచ్చెను. పన్నిద్దరు శిష్యులలో  ఒకడగు  యూదా,  వారికి ముందుగా నడచుచుండెను. అతడు యేసును ముద్దుపెట్టుకొనుటకు దగ్గరకు రాగా, 48. యేసు వానితో ”యూదా! నీవు ముద్దుతో మనుష్య కుమారుని పట్టియిచ్చుచున్నావా?” అనెను.

49. అపుడు అక్కడ ఉన్నవారు జరుగబోవునది గ్రహించి ”ప్రభూ!  మమ్ము కత్తి దూయమందురా?” అని అడిగిరి. 50. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకునికొట్టి, వాని కుడిచెవిని తెగనరికెను.

51. కాని యేసు ‘ఇకచాలు’ అని, వాని చెవిని తాకి స్వస్థపరచెను.

52. పిమ్మట యేసు తనను పట్టుకొనవచ్చిన ప్రధానార్చకులతోను దేవాలయపు అధికారులతోను, పెద్దలతోను ఇటుల అనెను: ”మీరు బందిపోటు దొంగ పైకి వచ్చినట్లు కత్తులతోను, గుదియలతోను నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా?

53. ప్రతిదినము దేవాలయములో మీతోఉన్నపుడు మీరు నన్ను పట్టుకొన లేదు. అయితే ఇది మీ గడియయు, అంధకారపు శక్తియునై ఉన్నది.”

పేతురు బొంకు

(మత్తయి 26:57-58;69-75; మార్కు 14:53-54, 66-72; యోహాను 18:15-18, 25-27)

54.  వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసికొనివచ్చిరి. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను.

55. వారు భవనము ముంగిట మంటవేసి చుట్టును కూర్చుండగా, పేతురు కూడ వారి మధ్య ఉండెను.

56. అతడు అచట వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూచి, అతని వంక తేరిపార చూచుచు ”ఇతడు కూడ అతని వెంట ఉన్నవాడే” అనెను.

57. కాని, అతడు ”అమ్మా! నేను అతనిని ఎరుగను” అని బొంకెను.58. కొంచెము సేపికి మరొకడు వచ్చి అతనిని చూచి ”నీవు కూడ వారిలో ఒకడవు” అనగా ”ఓయి! నేను కాదు” అని పేతురు చెప్పెను.

59. ఇంచుమించు ఒక గంట తరువాత ఇంకొకడు ”నిస్సందేహముగ ఇతడును అతని అనుచరుడే. ఏలయన, ఇతడును గలిలీయ నివాసియే” అని రూఢిగా చెప్పెను.

60. అందుకు పేతురు ”ఓయి! నీవు చెప్పునది నాకు తెలియదు” అనెను. వెంటనే, అతడు అటుల చెప్పుచుండగనే, కోడి కూసెను.

61. ప్రభువు వెనుకకు తిరిగి పేతురును చూచెను. ”నేడు కోడికూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు” అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని, 62. వెలుపలికి వెళ్ళి వెక్కివెక్కి ఏడ్చెను.

శత్రువుల చేతిలో పరిహాసము

(మత్తయి 26:67-68; మార్కు 14:65)

63.  అపుడు భటులు యేసును పరిహసించి, కొట్టి,64. ఆయన కనులకు గంతకట్టి”ప్రవచింపుము! నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము” అని అడిగిరి.

65.వారింకను ఎన్నియో విధముల ఆయనను దూషించిరి.

న్యాయపీఠము ఎదుట ప్రభువు

(మత్తయి 26:57-66; మార్కు 14:61-64, యోహాను 18:12-14, 19-24)

66. ఉదయముననే ప్రజలపెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోనికి తీసికొనివచ్చి, 67. ”నీవు క్రీస్తువైనచో మాతో చెప్పుము” అని అనిరి. ”మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు.

68. నేను మిమ్ము లను ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు.

69. కాని ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడిప్రక్కన కూర్చుండును” అని యేసు బదులు పలికెను.

70. ”అట్లయిన నీవు దేవుని కుమారుడవా?” అని వారు ఒక్కుమ్మడిగా  ప్రశ్నించిరి. ”మీరన్నట్లే” అని యేసు సమాధాన మిచ్చెను.

71. అపుడు వారు ”మనకు ఇంక ఏమి సాక్ష్యము కావలెను, మనము స్వయముగా అతని నోటినుండియే వింటిమికదా!” అని పలికిరి.