పేతురు – కొర్నేలి

10 1. కైసరియా పట్టణములో ఉన్న”ఇటాలియా పటాలము” నకు శతాధిపతియైన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను.

2. అతడు అతని కుటుంబములోని వారందరును దేవునియందు భక్తి శ్రద్ధలు కలిగి యుండిరి. అతడు పేదసాదలకు దానధర్మములు చేయుచు సదా దేవుని ప్రార్థించుచుండెను.

3. ఒకనాటి పగలు ఇంచుమించు మూడుగంటల వేళ అతడు ఒక దర్శనమందు దేవదూత లోనికి వచ్చి ”కొర్నేలీ!” అని పిలుచుటను స్పష్టముగా చూచెను.

4. అప్పుడు అతడు భయముతో దూతవైపు పారచూచి, ”ఏమి  ప్రభూ?”  అని అడిగెను. అందుకు దేవదూత, ”నీ ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాప కార్థముగ చేరినవి.

5.కనుక ఇప్పుడు నీవు కొందరు మనుష్యులను యొప్పా నగరమునకు పంపి, పేతురు అని పిలువబడుచున్న సీమోనును పిలిపింపుము.

6. అతడు సీమోను అను ఒక చర్మకారుని ఇంట అతిథిగా ఉన్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది” అని చెప్పి.

7. దూత వెడలిపోగ కొర్నేలి తన పనివారిలో ఇద్దరిని మరియు తనకు సన్నిహితుడు, దైవభక్తుడైన ఒక సైనికుని పిలిచి, 8. జరిగినదంతయు వారికి వివరించి వారిని యొప్పాకు పంపెను.

9. మరునాడు వారు పయనించుచు యొప్పా నగర సమీపమునకు వచ్చుచుండిరి. అంతలో మధ్యాహ్న సమయమున ప్రార్థన చేసికొనుటకు పేతురు మిద్దెపైకి ఎక్కెను.

10. అతడు ఆకలిగొనియుండుటచే, భుజింప దలచెను. భోజనము సిద్ధము చేయబడుచుండ అతనికి ఒక దర్శనము కలిగెను.

11. పరలోకము తెరచుకొనగా పెద్ద దుప్పటి వంటిది నాలుగు మూలలతో భూమి మీదికి దింపబడుటను అతడు ఆ దర్శనమందు కాంచెను.

12. దానిలో అన్ని రకముల భూచరములగు జంతువు లును, ప్రాకెడిప్రాణులును, ఆకాశపకక్షులును ఉండెను. 13. అప్పుడు, ”పేతురూ! లెమ్ము! వీనిని  చంపితినుము” అను ఒక స్వరము అతనికి వినిపించెను. 14. అందుకు పేతురు, ”ప్రభూ! వలదు. నేనెన్నడును నిషిద్ధమును, అపరిశుద్ధమునైన దేదియు  తినలేదు” అని సమాధానమిచ్చెను.

15. అందుకు రెండవమారు ఆ స్వరము ”దేవుడు పవిత్రపరచిన దానిని నీవు అపవిత్రమైనదని పలుకరాదు” అని వినిపించెను.

16. ముమ్మారు ఇట్లు జరిగిన పిదప అది పరలోకమునకు తీసికొని పోబడెను.

17. ఆ దర్శనమునకు అర్థము ఏమై ఉండునో అని పేతురు లోలోపల ఆశ్చర్యపడుచుండెను. ఇంతలో కొర్నేలిచే పంపబడినవారు సీమోను ఇల్లు ఎక్కడనో అడిగి తెలిసికొని ఆ ఇంటి గుమ్మము ఎదుట నిలువబడి ఉండిరి.

18. అప్పుడు వారు, ”పేతురు అనబడు సీమోను ఇచ్చట ఉన్నాడా?” అని అడిగిరి. 

19. పేతురు దర్శనము యొక్క అర్థమును గ్రహింప ప్రయత్నించుచు ఇంకను ఆలోచించుచుండెను. ఆత్మ అతనితో ”పేతురూ! వినుము. ఇక్కడ ముగ్గురు మనుష్యులు నీ కొరకు వెదకుచున్నారు.

20. కాబట్టి నీవు లేచి, వారితో వెళ్ళుటకు సందేహింపకుము. ఏలయన, వారిని నేను పంపియున్నాను” అని పలుక, 21. పేతురు క్రిందకు పోయి, వారితో ”మీరు వెదకుచున్న వాడను నేనే. మీరు ఏల ఇచ్చటకు వచ్చితిరి?” అని అడిగెను.

22. అందుకు వారు. ”కొర్నేలి అను శతాధిపతి మమ్ము పంపినాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, అంతేగాక  యూదులచేత గొప్పగా గౌరవింప బడుచున్నవాడు. నీవు చెప్పదలచిన దానిని తెలిసికొను టకు నిన్ను తన ఇంటికి  ఆహ్వానించుటకు ఒక దేవ దూతచే అతడు ఆదేశింపబడెను” అని పలికిరి.

23. అది విని పేతురు వారిని లోపలకు తీసికొనిపోయి అతిథి సత్కారము చేసెను. మరునాడు అతడు సిద్ధపడి వారివెంట వెళ్ళెను. యొప్పాకు చెందిన సోదరులు కూడ కొందరు అతనివెంట వెళ్ళిరి.

24. ఆ మరునాటికి అతడు కైసరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను, ప్రాణస్నేహితులను ఆహ్వానించి, పేతురు కొరకై ఎదురు చూచుచుండెను.

25. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి, పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను.

26. పేతురు అతనితో, ”లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే” అని పలికెను.

27. పేతురు కొర్నేలితో మాటలాడుచు లోనికి వెళ్ళి, అచ్చట అనేకులు కూడియుండుట చూచెను.

28. పేతురు వారితో ”యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమిచేయుట తగదని మీకు బాగుగా తెలియునుగదా! కాని ఏ మనుష్యునైనను నిషేధింపబడినవాడని, అపరిశుద్ధుడని నేను భావింప రాదని దేవుడు నాతో చెప్పియున్నాడు.

29. కనుక, మీరు నా కొరకు మనుష్యులను పంపినపుడు, ఎట్టి సంకోచమును లేక నేను వచ్చితిని. నన్ను మీరు పిలిపించిన కారణమేమి?” అని ప్రశ్నించెను.

30. అప్పుడు కొర్నేలి, ”నాలుగు రోజుల క్రిందట ఇదే సమయములో పగలు మూడుగంటల వేళ, నేను నా ఇంటిలో ప్రార్థన చేసికొనుచుింని. హఠాత్తుగా కాంతిమంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలువబడి, 31. ‘కొర్నేలీ! దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను. నీ ధర్మకార్యములను గుర్తించెను.

32. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకనిని యొప్పాకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బసచేయుచున్నాడు. అతని ఇల్లు సముద్రతీరమున ఉన్నది’ అని నాకు తెలిపెను.

33. వెంటనే నేను నీకొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతిచ్చిన దానిని ఆలకించుటకై వేచి యున్నాము” అని పేతురునకు తెలియజెప్పెను.

పేతురు ప్రసంగము 

34. అంతట పేతురు ఇట్లు ప్రసంగింప నారంభించెను: ”దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని.

35. దేవునికి భయపడుచు, సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే.

36. అందరికి ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు యిస్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా!

37. యోహాను బోధించిన బప్తిస్మానంతరము గలిలీయలో ప్రారంభమై యూదయా అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే.

38. పవిత్రాత్మతోను, శక్తి తోను, దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియును. ఆయన అంతటను పర్యించుచు, మేలు చేయుచు, పిశాచ శక్తికి లోబడిన వారందరిని స్వస్థపరచెను. ఏలయన, దేవుడు ఆయనతో ఉండెను.

39. యూదుల దేశములోను, యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నికిని మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి.

40. ఐనను దేవుడు ఆయనను మూడవనాడు మృతులనుండి లేపి, మరల మాకు కనబడునట్లు చేసెను.

41. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి, ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమేగాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్న పానములు పుచ్చు కొంటిమి.

42. జీవితులకును, మృతులకును తీర్పరిగా దేవుడు నియమించినవాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు, సాక్ష్యమీయవలెననియు దేవుడు మమ్మును ఆజ్ఞాపించెను.

43. ఈయనయందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరు పలికినది ఈయనను గురించియే.”

అన్యులకు పవిత్రాత్మ వరము

44. పేతురు ఇంకను మాట్లాడుచుండగ ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. 45. పేతురుతో యొప్పానుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు, అన్యులపై కూడ దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి.

46. ఏలయన, ఆ అన్యులును క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి.

47. పేతురు, ”ఇప్పుడు మనవలెనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానమును పుచ్చుకొను టను ఎవరైనను వారింపగలరా” అనుచు, 48. ”యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానమును పొందుడు” అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని రోజులు తమవద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము