వేదప్రచారము – బర్నబాసు, సౌలుల ఎన్నిక
13 1. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ఎవరనగా: బర్నబా, నీగెరు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడ పెంచబడిన మనాయేను, సౌలు.
2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయు చుండగా పవిత్రాత్మ వారితో, ”నేను నియమించిన పనికై బర్నబాను, సౌలును నాకొరకు ప్రత్యేకింపుడు” అని పలికెను.
3. వారు ఉపవాసము చేసి, ప్రార్థించి వారిపై చేతులు ఉంచి, వారిని పంపివేసిరి.
సైప్రసులో వేదప్రచారము
4. పవిత్రాత్మచే పంపబడిన బర్నబాను, సౌలులు సెలూసియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడనెక్కి పయనించి, సైప్రసుకు వచ్చిరి.
5. వారు సలామిసు చేరుకొని అక్కడ యూదుల ప్రార్థనామందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. యోహాను అను ఉపచారకుడు వారికి తోడ్పడుచుండెను.
6. వారు ఆ దీవిని అంతటిని పర్యటించి పాఫోసు వరకు వెళ్ళిరి. అక్కడ వారు ‘బారుయేసు’ అని పిలువ బడిన ఒక మాంత్రికుని కలిసికొనిరి. అతడు యూదుడు. తానొక ప్రవక్తనని చెప్పుకొనుచుండెను.
7. ఆ దీవిని పాలించు వాడును, వివేకవంతుడును అయిన సెర్జియ పౌలునకు అతడు మిత్రుడు. ఆ పాలకుడు దేవుని వాక్యమును వినగోరి బర్నబాను, సౌలును తన యొద్దకు పిలిపించుకొనెను.
8. కాని మాంత్రికుడైన ఎలిమా (ఎలిమా అనగా మాంత్రికుడు అని అర్థము) వారిని ఎదిరించెను. వాడు ఆ పాలకుని విశ్వాసము నుండి మరలింప ప్రయత్నించెను.
9. అప్పుడు పౌలు అని పిలువ బడుచున్న సౌలు పవిత్రాత్మతో నిండినవాడై సూటిగా మాంత్రికుని వంకచూచి, 10. ”సైతాను పుత్రుడా! నీవు అన్ని విధములైన కపటములతోను, మోసములతోను నిండి ఉన్నావు. నీతికి నీవు విరోధివి. ప్రభువు ఋజు మార్గములను వక్రగతులు పట్టించుట నీవు మానవా?
11. ఇప్పుడు ప్రభువు హస్తము నీపై పడనున్నది. నీవు కొంతకాలము వరకు గ్రుడ్డివాడవై సూర్యకాంతిని చూడలేకపోవుదువు” అని పలికిన వెంటనే అతని కన్నులకు మంచుతెర, చీకిపొర క్రమ్మెను. అందుచే అతడు తన చేయిపట్టుకొని నడిపించు కొని పోవువారికై చుట్టును తారాడు చుండెను.
12. దానిని చూచి ఆ పాలకుడు విశ్వసించి ప్రభువును గురించిన బోధను విని మిక్కిలి ఆశ్చర్య పడెను.
పిసీదియాయందలి అంతియోకియాలో వేదప్రచారము
13. పౌలును అతని తోటివారును పాఫోసునుండి సముద్రయానము చేసి, పంఫీలియాలోని పెర్గాకు వచ్చిరి. కాని యోహాను వారిని అక్కడ దిగవిడిచి, యెరూషలేమునకు తిరిగిపోయెను.
14. వారు పెర్గానుండి పిసీదియాయందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతిదినమున ప్రార్థనా మందిరము లోనికి పోయి కూర్చుండిరి.
15. మోషే ధర్మశాస్త్రమునుండి ప్రవక్తల రచనలనుండి పఠనము అయిన తదుపరి ప్రార్థనామందిరపు అధికారులు, ”సోదరులారా! ప్రజలను ప్రోత్సహించు సందేశమేమైన ఉన్నచో దానిని వినిపింపుడు” అని వర్తమానము పంపిరి.
16. అప్పుడు పౌలు నిలిచి నిశ్శబ్దముగా ఉండుడని వారికి చేసైగ చేసి, ప్రసంగింప ఆరంభించెను: ”యిస్రాయేలు ప్రజలారా! దేవుని యందు భయభక్తులు గలవారలారా! వినుడు.
17. ఈ యిస్రాయేలు ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తుదేశములో ఉన్నప్పుడు వారిని గొప్పవారిని చేసెను. పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచే ఐగుప్తునుండి బయటకు తీసికొనివచ్చెను.
18. ఎడారిలో నలువదియేండ్లు వారిని సహించెను.
19. ”ఆయన కనాను సీమలో ఏడు జాతుల వారిని నాశనము చేసి నాలుగువందల ఏబదియేండ్ల వరకు ఆ భూమిని వారికి వారసత్వముగా ఇచ్చెను.
20. తదుపరి సమూవేలు ప్రవక్త కాలము వరకు వారికి ఆయన న్యాయాధిపతులను ఒసగెను.
21. రాజు కావలెనని వారుకోరినపుడు బెన్యామీను తెగకు చెందిన కీసు కుమారుడైన సౌలును నలువది సంవత్సరములు రాజుగా ఉండుటకై ఆయన వారికి ఇచ్చెను.
22. అతనిని తొలగించిన తరువాత, దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పిన దేమన: ‘యీషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలయన, అతడు నా చిత్తమును సంపూర్ణముగ నెరవేర్చును’.
23. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును యిస్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను.
24. యేసు రాకడకు పూర్వము పాపములనుండి మరలి బప్తిస్మమును పొందుడు అని యోహాను యిస్రాయేలు ప్రజలందరకు బోధించెను.
25. మరియు యోహాను తన పనిని ముగించుచు, జనులతో, ”నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురుచూచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో! ఆయన నా తరువాత రాబోవుచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను” అనెను.
26. ”సోదరులారా! అబ్రహాము వంశస్థులారా! దేవునియందు భయభక్తులు కలిగినవారలారా! ఈ రక్షణసందేశము పంపబడినది మన కొరకే.
27. ఏలయన, యెరూషలేములో నివసించు ప్రజలు, వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతిదినమున చదువబడుచున్న ప్రవక్తల వచనములను అర్థము చేసికొనలేదు. అంతియేగాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధ్రువపరచిరి.
28. మరియు మరణశిక్షకు తగిన కారణమేదియు కనబడకున్నను, ఆయనను చంపింపవలసినదిగా వారు పిలాతును కోరిరి.
29. ఆయనను గురించి పరిశుద్ద గ్రంధములో వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట, వారు ఆయనను మ్రానుమీదినుండి దించి సమాధిలో ఉంచిరి.
30. కాని, దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను.
31. మరియు చాల రోజుల వరకు గలిలీయనుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరకు ఆయన కనబడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాకక్షులై ఉన్నారు.
32. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాము. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును, 33. వారి సంతతివారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుటవలన నెరవేర్చియున్నాడు. రెండవ కీర్తనలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఏమన: ‘నీవు నా కుమారుడవు, ఈ రోజు నేను నీకు తండ్రినైతిని
34. మరల ఎన్నికిని క్రుళ్ళి నశించిపోవు స్థితికి రానీయక, ఆయనను మృతులలోనుండి లేపుటను గురించి దేవుడు చెప్పినది ఏమన: ‘నేను దావీదుకు వాగ్దానము చేసిన, పవిత్రమైన, నిశ్చయమైన ఆశీర్వాదములను మీకు ఇచ్చెదను.’
35. మరియొకచోట ఆయన చెప్పినది ఏమన: ‘నీవు నీ యందు భక్తి గల సేవకుని క్రుళ్ళి నశించిపోనీయవు’.
36. ”ఏలయన, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవచేసి మరణింపగా అతడును, అతని పూర్వుల దగ్గరనే సమాధి చేయబడి క్రుళ్ళిపోయెను.
37. కాని దేవునిచే మృతులలోనుండి లేపబడినవాడు క్రుళ్లిపోలేదు.
38. సోదరులారా! యేసు ద్వారానే పాప క్షమాపణను గూర్చిన సందేశము మీకు ప్రకటింపబడినదని మీరు అందరు నిజముగా తెలిసికొనవలయును. 39. మోషే మిమ్ములను విముక్తి చేయలేని సకల పాపములనుండి యేసును విశ్వసించు ప్రతివ్యక్తియు విముక్తుడగునని తెలిసికొనుడు!
40. ప్రవక్తలు చెప్పినది మీకు జరుగకుండునట్లుగా జాగ్రత్తపడుడు. అదేమనగా,
41. ‘నిరసించెడి వారలారా! ఆశ్చర్యపడుడు,
నాశనము చెందుడు.
ఏలయన, మీ కాలములో నేను ఒక పనిని
చేయుదును. దానిని గూర్చి ఎవరు వివరించినను,
మీరు విశ్వసింపరు.’ ”
42. వారు ప్రార్థనామందిరమును విడిచిపోవు నపుడు ఇంకను ఈ విషయములను గురించి తెలియ జెప్పుటకై, మరుసటి విశ్రాంతి దినమున తిరిగి రండని, ఆ ప్రజలు వారిని అర్థించిరి.
43. సమావేశము ముగిసిన తరువాత చాలమంది యూదులు, యూద మతమును స్వీకరించినవారు, పౌలును, బర్నబాను అనుసరించిరి. అపోస్తలులు వారితో సంభాషించి, దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి.
44. మరుసటి విశ్రాంతిదినమున దాదాపు పట్టణములోని ప్రతివ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. 45. ఆ జనసమూహమును చూచినప్పుడు, యూదులకు అసూయచే కన్నుకుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మ్లాడుచు ధిక్కరించిరి.
46. అయినను పౌలు, బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి: ”దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసియుండెను. కాని మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్యజీవ మునకు అయోగ్యులనుగా చేసికొనుటచే మేము మిమ్ము విడిచి అన్యులయొద్దకు వెళ్లుదము.
47. ఏలయన, ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు: ‘మీరు అన్యులకు వెలుగైయుండుటకును, ప్రపంచమంతటకును రక్షణమార్గమై యుండుటకును నేను మిమ్ములను నియమించియున్నాను.’ ”
48. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి, దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్యజీవమునకు నియమితులైన వారందరు విశ్వాసులైరి.
49. ప్రభువు వాక్కు ఆ ప్రదేశములందంతటను వ్యాప్తిచెందెను.
50. యూదులు గొప్పవర్గమునకు చెందిన భక్తులగు స్త్రీలను, ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి. అందుచే వారు పౌలునకు, బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతమునుండి తరిమివేసిరి.
51. అపోస్తలులు తమ కాలిధూళిని వారికి నిరసనగా దులిపివేసి, ఇకోనియాకు వెళ్ళిరి.
52. శిష్యులు సంతోషముతోను, పవిత్రాత్మతోను నిండియుండిరి.