తెస్సలోనికలో క్రైస్తవసంఘము

17 1. వారు అంఫిపోలి, అపొల్లోనియాల మీదుగా పయనించి, తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల ప్రార్థనామందిరము ఒకి కలదు.

2. పౌలు తన అలవాటు చొప్పున ప్రార్థనామందిరమునకు వెళ్ళెను.

3. మెస్సయా బాధలను అనుభవింప వలెననియు, ఆయన మృతులలోనుండి లేపబడవలె ననియు పౌలు అక్కడ వరుసగా మూడు విశ్రాంతి దినములు పరిశుద్ధగ్రంథమునుండి వివరించుచు, నిరూపించుచు, ”నేను మీకు ప్రకటించుచున్న ఈ యేసే మెస్సియా” అని నొక్కి వక్కాణించెను. 

4. వారిలో కొందరు అతడు చెప్పిన దానిని విశ్వసించి పౌలు, సిలాసులతో చేరిరి. అట్లే దేవుని ఆరాధించు చాల మంది గ్రీసు దేశస్థులు, ప్రముఖులైన స్త్రీలు పలువురు వారి పక్షమున చేరిరి.

5. అది చూచి యూదులకు కన్నుకుట్టుటచే, వీధులలో తిరుగు దుష్టులను కొందరను ప్రోగుచేసి నగరమునంతటిని అల్లకల్లోలమున ముంచిరి. పిదప వారు యాసోను ఇంటిని ముట్టడించి పౌలును, సిలాసును బయటకు లాగి,  ప్రజలయెదుట పెట్టుటకై ప్రయత్నించిరి.

6. కాని, వారు కనబడకపోవుటచే యాసోనును, ఇతర సోదరులను కొందరిను నగర అధికారులవద్దకు ఈడ్చుకొనివచ్చి, ”ఎల్లెడల కల్లో లము కలిగించిన వీరు మన నగరమునకు వచ్చి యున్నారు.

7. యాసోను వీరిని తన ఇంట చేర్చుకొనెను. యేసు అను మరియొక రాజు మనకు ఉన్నాడని చెప్పుచు, వీరు చక్రవర్తి శాసనములను మీరుచున్నారు” అని అరచిరి.

8. ఈ మాటలతో వారు ఆ జనసమూహము, నగర అధికారులు గందర గోళమునకు గురిచేసిరి.

9. అప్పుడు ఆ నగర అధికారులు యాసోనును, తదితరులను జామీనుపై విడుదల చేసిరి.

బెరయాలో పౌలు ప్రచారము

10. సోదరులు, చీకటిపడగానే పౌలును, సిలాసును బెరయాకు పంపివేసిరి. వారు బెరయాకు చేరుకొని యూదుల ప్రార్థనామందిరమునకు వెళ్ళిరి.

11. అక్కడి ప్రజలు తెస్సలోనికలోని ప్రజల కంటె విశాలహృదయులు. వారు సందేశమును గొప్ప ఆపేక్షతో ఆలకించి, అనుదినము పవిత్రలేఖనము లను చదువుకొనుచు, పౌలు చెప్పినది నిజమా కాదా అని పరిశీలించుచుండిరి.

12. వారిలో పలువురు విశ్వసించిరి. ఉన్నత వర్గమునకు చెందిన గ్రీకు దేశపు స్త్రీలును, పురుషులును విశ్వాసులైరి. 13. కాని, పౌలు బెరయాలోకూడ దేవుని వాక్కును బోధించెనని విని, తెస్సలోనికలోని యూదులు అచటకు వచ్చి జన సమూహములను రెచ్చగొట్టి కలవర పరచిరి.

14. అందుచే వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరమునకు పంపివేసిరి. కాని సిలాసు తిమోతీలు ఇరువురును బెరయాలోనే నిలిచిపోయిరి.

15. పౌలును తీసికొనిపోవు వారు ఏతెన్సు వరకును అతని వెంట వెళ్ళిరి. పిమ్మట సిలాసు తిమోతీలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలెనని పౌలు ఆజ్ఞాపించగా, ఆ ఉత్తరువులతో వారు వెనుదిరిగి బెరయాను చేరుకొనిరి.

ఏతెన్సులో పౌలు ప్రచారము

16. పౌలు ఏతెన్సులో తిమోతీ, సిలాసుల కొరకు ఎదురు చూచుచుండెను. ఆ నగరము ఎట్లు విగ్రహములతో నిండియుండెనో పౌలు గమనించి చాల కలతచెందెను.

17. కావున అతడు ప్రార్థనా మందిరములో యూదులతోను, దైవభక్తి పరులతోను, సంత వీధులలో ప్రతిదినము గుమికూడు ప్రజలతోను వాదించుచుండెను.

18. భోగపరాయణులు, విరాగులు అగు తత్వవేత్తలు కొందరు పౌలుతో వాదోపవాద ములు గావించిరి. కొందరు ”అవివేకియగు ఈ వాచాలుడు చెప్పునదేమి?” అని పలికిరి. మరికొందరు ”ఇతడు అన్యుల దేవుళ్ళను గూర్చి మ్లాడుచున్నట్లున్నది” అని చెప్పుకొనిరి. ఏలయన,  పౌలు  యేసును గూర్చియు, ఆయన  పునరుత్థానమునుగూర్చియు బోధించుచుండెను.

19. కనుక వారు పౌలును అరెయోపగసు అను సభకు తీసికొనివచ్చి, ”నీవు చేయుచున్న ఈ క్రొత్తబోధననుగూర్చి మేము తెలిసికొన గోరుచున్నాము.

20. నీవు చెప్పెడు కొన్ని సంగతులను వినగా, మాకు వింతగా ఉన్నది. వాటి అర్థ మేమిటో, తేటతెల్లముగా తెలిసికొనవలెనని మేము ఆశించు చున్నాము” అని పలికిరి.

21. ఏలయన, ఏతెన్సులోని పౌరులకు, అచట నివసించెడు పరదేశస్థులకు, నూతన విషయములను గూర్చి చెప్పుటలో, వినుటలో కాలము వెళ్ళబుచ్చుట వారికొక వేడుక.

22. అప్పుడు పౌలు అరెయోపగసు అను సభ యెదుట నిలబడి ”ఏతెన్సు పౌరులారా! మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది.

23. ఏలయన, నేను మీ నగరములో నడచి పోవునప్పుడు మీ పూజాప్రతిమలను చూచుచుండగా, ఒక పీఠము కూడ నాకు కనపబడెను. దానిపై ‘తెలియని దేవునకు’ అని వ్రాయబడియున్నది. కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకించుచున్నాను.

24. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే, పరలోకము నకు, భూలోకమునకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయములో నివసింపడు.

25. ప్రజలకు అందరకు జీవమును, శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన, మానవుల చేతులతో సేవింపబడువాడు కాదు.

26. ఒక్క పురుషునినుండియే ఆయన అన్ని జాతుల జనులను కలిగించి, భూలోకమంతట వారిని నివసింప జేసెను. ఆయన ముందుగానే వారివారి కాల పరిమితులను, వారి వారి నివసించుస్థలముల  సరి హద్దులను స్థిరపరచెను, 27. వారు ఆయన కొరకు ఆకాంక్షతో అన్వేషిస్తూ ఆయనను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను. అయినను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు.

28. ఏలయన ‘ఆయనయందే మనము జీవించుచు, సంచరించుచున్నాము, ఉనికిని కలిగియున్నాము. ‘మీలో కొందరు కవులు చెప్పినట్లుగా: ‘మనమును ఆయన బిడ్డలమే.

29. ”దేవుని బిడ్డలమైన మనము దైవస్వభావ మును, మనుష్యుల కల్పనాకౌశలము వలన మలచ బడిన బంగారముతోగాని, వెండితోగాని పోల్చవచ్చు నని భావింపరాదు.

30. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారినిగూర్చి పట్టించుకొన లేదు. కాని ఇప్పుడు ఎల్లెడల ప్రజలందరును హృదయపరివర్తన చెందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు.

31. ఏలయన, ఆయన ఎన్నుకొనియున్న ఒక మనుష్యుని మూలమున ప్రపంచమునంతిని నీతిప్రకారము తీర్పుచేయుటకు ఒక దినమును నిర్ణయించియున్నాడు. ఆయన ఆ మనుష్యుని మృతులలోనుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢ పరచెను” అని పలికెను.

32. పౌలు చెప్పిన మృతుల పునరుత్థానమును గురించి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి. కాని కొందరు ”ఈ విషయమును మరల వినవలయు నని కోరుచున్నాము” అనిరి.

33. తరువాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయెను.

34. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి. వారిలో అరెయోపాగసులో డెమారిసు అను పేరుగల స్త్రీయును, పట్టణసభ్యుడైన డయోనీసియసును,  మరి కొందరును కలరు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము