పౌలుపై యూదుల నిందారోపణ
24 1. ఐదురోజుల పిదప, ప్రధానార్చకుడగు అననియా, కొందరు పెద్దలతోను తెర్తుల్లు అను ఒక న్యాయవాదితోను, కైసరియాకు వెళ్ళెను. వారు అధిపతి సమక్షమునకు పోయి పౌలుకు విరుద్ధముగా ఫిర్యాదు చేసిరి.
2. అప్పుడు తెర్తుల్లు పౌలుపై ఈ విధముగా నిందారోపణ కావింప మొదలిడెను. ”శ్లాఘనీయులగు ఫెలిక్సు ప్రభూ! మీ వలన మేము శాంతి సౌభాగ్యములను అనుభవించుచున్నాము. ఈ దేశ సంక్షేమమునకై మీరు ముందుచూపుతో పెక్కు సంస్కరణములను కావించుచున్నారు.
3. మేము అన్ని ప్రాంతములందును అన్ని విధముల మీకు కృతజ్ఞులము.
4. నేను మీ సమయము వృధాచేయను. మాపై కటాక్షించి, సంక్షిప్తముగా మా విన్నపమును ఆలకింపుడు.
5. ఈ మనుష్యుడు మాకొక వినాశకారిగా ఉన్నాడు. ఇతడు ప్రపంచవ్యాప్తముగా ఉన్న యూదులలో సంక్షోభము లేవదీయుచున్నాడు. మరియు ఇతడు నజరేయుల పక్షమునకు నాయకుడై 6. దేవాలయ మును కూడ అపవిత్రము చేయుటకు ప్రయత్నించినాడు. అందుచే మేము ఇతనిని పట్టి బంధించితిమి. (మేము మా ధర్మశాస్త్రము ప్రకారము ఇతనిని తీర్పు చేయవలె నని ఆలోచించితిమి.
7. కాని, లిసీయా సేనాధిపతి లోపలకు వచ్చి ఇతనిని మా యొద్ద నుండి బలవంత ముగా తీసికొనిపోయెను.
8. తరువాత ఇతనిపై నేరము మోపదలచిన వారు మీ ఎదుటకు రావలెనని ఆజ్ఞ ఇచ్చెను.) మీరు ఈ మనుష్యుని అడిగి చూచినచో మేము ఇతని మీద మోపు నేరములు అన్నియు మీరే స్వయముగా తెలిసికొనగలరు.”
9. అదంతయు నిజమే అని యూదులును ఆ ఆరోపణములను బలపరచిరి.
ఫెలిక్సు సమక్షములో పౌలు సమాధానము
10. అప్పుడు అధిపతియైన ఫెలిక్సు పౌలును మ్లాడుమని సైగ చేయగా అతడు ఇట్లు చెప్పెను:
”అనేక సంవత్సరములనుండి, మీరు ఈ ప్రజలకు న్యాయమూర్తులుగా ఉన్నారని నేను ఎరుగు దును. కనుక నా పక్షమున నేనే సంతోషముగా వాదింతును.
11. నేను దేవుని ఆరాధించుటకై యెరూషలేమునకు వెళ్ళి పండ్రెండు రోజులకన్న ఎక్కువ కాలము కాలేదని మీరే స్వయముగ తెలిసికొన గలరు.
12. నేను దేవాలయములోగాని, వారి ప్రార్థనామందిరములలోగాని, నగరములో మరెక్కడ గాని, ఎవరితోనైనను వాదించుట, లేక ప్రజలను పురికొల్పుట వీరు ఎవరును చూడలేదు.
13. ఇప్పుడు నాకు విరుద్ధముగా మీ ఎదుట వారు ఆరోపించిన నేరములను వారు నిరూపింపలేదు.
14. నా పూర్వుల దేవుని పూజించుచు వీరు భిన్నమని భావించు మార్గమును వెంబడించితిని. అది అంగీకరింతును. కాని మోషే చట్టమునందు ప్రవక్తల రచనలయందు వ్రాయబడిన విషయములను అన్నిని నేను నమ్ము దును.
15. నీతిపరులు, అవినీతిపరులు మృతుల నుండి మరల ఉత్థానమగుదురని వీరు నమ్మినట్లే నేనును దేవునియందు నమ్మకము కలిగియున్నాను.
16. కావున దేవుని ఎదుటను, మానవుల ఎదుటను స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగియుండుటకు ఎప్పుడును శక్తివంచనలేక కృషి చేయుచున్నాను.
17. ”అనేక సంవత్సరముల తరువాత, నా సొంత జనులకొరకు, దానమును తెచ్చుటకు, కానుక లను అర్పించుటకు యెరూషలేమునకు వెళ్ళితిని.
18. శుద్ధీకరణ సంస్కారమునకు పిమ్మట నేను ఇట్లు చేయుచుండ వారు నన్ను దేవాలయమునందు చూచిరి. అప్పుడు నాతో ఎట్టి జనసమూహమును లేదు. ఎట్టి అల్లరియు జరుగలేదు.
19. కాని, ఆసియా మండలమునుండి వచ్చిన యూదులు కొందరు ఉండిరి. వారు ఏదైనా నాకు వ్యతిరేకముగా నిందలను మోపదలచినచో, వారే మీ ఎదుటకు రావలెను.
20. ‘మరణించినవారు మరల లేపబడుదురు అను సత్యమును నమ్మినందుననే ఈనాడు మీచేత నేను తీర్పుచేయబడుచున్నాను’ అని 21. నేను వారి ఎదుట పలుకుట తప్ప విచారణసభ ఎదుట నేనొనర్చిన నేరము ఇంకేదైనా ఉన్నచో వీరినే చెప్పనిండు” అని పలికెను.
22. ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన ఫెలిక్సు, ”ఆ సైన్యాధిపతి లిసీయా వచ్చిన పిదప మీ విషయమును విచారించెదను” అని వారిని పంపివేసెను.
23. పౌలును కాపలాలో ఉంచి కొంత స్వేచ్ఛను మాత్రము ఒసగి, అతని మిత్రులు అతని అవసరములు తీర్చుటకు అనుమతినిమ్మని శతాధిపతిని ఆజ్ఞాపించెను.
ఫెలిక్సు, ద్రుసిల్లాల సమక్షములో పౌలు
24. కొన్నాళ్ళ తరువాత ఫెలిక్సు తన భార్యయైన ద్రుసిల్లాతో వచ్చెను. ఆమె ఒక యూద స్త్రీ. అతడు పౌలును పిలిపించుకొని యేసుక్రీస్తునందు విశ్వాస మును గురించి అతడు చెప్పిన దానిని ఆలకించెను.
25. కాని, పౌలు నీతిని గురించియు, ఇంద్రియ నిగ్రహమును గురించియు. రానున్న తీర్పుగూర్చియు చర్చించి చెప్పినప్పుడు ఫెలిక్సు భయపడి, ”ఇప్పుడు నీవు వెళ్ళవచ్చును. నాకు వీలున్నప్పుడు నేను నిన్ను మరల పిలిపించెదను” అని చెప్పెను.
26. ఆ సమయమున పౌలు తనకు కొంతడబ్బును ఇచ్చునని అతడు ఆశించెను. కనుక అతడు పౌలును తరచుగా పిలిపించుకొనుచు, అతనితో మ్లాడుచుండెను.
27. రెండేండ్లు గడిచిన పిదప పోర్సియుఫెస్తు, ఫెలిక్సు స్థానములో అధిపతిగ నియమింపబడెను. ఫెలిక్సు యూదుల అభిమానమునకై అభిలషించెను. కనుక అతడు పౌలును చెరసాలలోనే ఉంచెను.