పౌలు సముద్ర ప్రయాణము

27 1. మేము ఓడనెక్కి ఇటాలియాకు పోవలెనని నిర్ణయింపబడగా, వారు పౌలును, ఇతర ఖైదీలను జూలియసు అనువానికి అప్పగించిరి. ఇతడు చక్రవర్తి పాలములో ఒక శతాధిపతి.

2. ఆసియా రాష్ట్రపు ఓడరేవులకు బయలుదేరుటకు సిద్ధముగా ఉన్న అద్రామిత్తియము నుండి వచ్చిన ఓడనెక్కి, ప్రయా ణము కావించితిమి. తెస్సలోనికనుండి వచ్చిన ‘ఆరిస్టార్కు’ అను మాసిడోనియా నివాసి మా వెంట ఉండెను.

3. మరునాడు మేము సీదోను చేరుకొంటిమి.  పౌలు యెడల జూలియసు జాలిగల వాడైనందున, తన మిత్రులను చూచుటకు, వారు అతనికి కావలసి నది ఇచ్చుటకు అనుమతిని ఇచ్చెను.

4. అట నుండి సాగిపోయి గాలి ఎదురుగా వీచుచుండుటచేత సైప్రసు ద్వీపమును చాటుగా చేసికొని మేము పయనించితిమి.

5. సిలీషియా పంఫీలియాల మీదుగా మేము సముద్ర మును దాటుచు లిసియాలోని మీరాకు వచ్చితిమి.

6. అప్పుడు అలెగ్జాండ్రియానుండి ఇటాలియాకు పోవుచున్న ఓడను కనుగొని, దళాధిపతి మమ్ములను దానిలో ఎక్కించెను.

7. మేము నెమ్మదిగా అనేక దినములు ఓడ ప్రయాణము చేసి, ఎట్టకేలకు అతి కష్టముతో క్నీదు పట్టణమును చేరుకొంటిమి. గాలి ఆ దిశలో మమ్ము లను ఏ మాత్రము ముందుకు పోనీయలేదు. అందుచే మేము సల్మోను అగ్రము మీదుగా క్రీటు ద్వీపమును చాటుగా చేసికొని సాగిపోయితిమి.

8. తీరము వెంట పయనించి అతి కష్టముపై మేము లిసీయా పట్టణ మునకు చేరువనున్న ‘భద్రమైన రేవులు’ అను చోటునకు వచ్చితిమి.

9. అచ్చట మేము చాలకాలము గడిపితిమి. అప్పటికి ఉపవాసదినము కూడ గడిచిపోయెను. మరల మా సముద్ర ప్రయాణము అపాయకరముగా ఉండెను. కావున పౌలు వారికి సలహాను ఇచ్చుచు, 10. ”మిత్రులారా! ఇచ్చటనుండి మన సముద్ర ప్రయాణము అపాయకరముగా కనబడుచున్నది. ఓడకు, ఓడలోని సరకులకే గాక, మన ప్రాణములకు గూడ పెనుముప్పు రానున్నది” అని హెచ్చరించెను.

11. కాని ఆ శతాధిపతి పౌలు సలహాను పెడచెవిని బెట్టి, నావికు డును, ఓడ యజమానుడును చెప్పిన దానినే వినెను. 

12. శీతకాలము గడపుటకు ఆ ఓడరేవు అనుకూలమైనది కాదు. కాబట్టి, సాధ్యమైన యెడల ఫినిక్సుకు చేరుకొన వలెనని మాలో చాలమంది సుముఖులై ఉన్నందున అటు పయనము సాగించితిమి. క్రీటు ద్వీపము లోనున్న ఈ రేవు నైఋతి వాయవ్య దిశలకు ఎదురుగా  ఉన్నది.  అచ్చటనే  వారు  శీతకాలమును గడపగలము అనుకొనిరి.

సముద్రముపై తుఫాను

13. పిదప దక్షిణ దిశనుండి సన్నని గాలి వీచసాగెను. అందుచే వారు అనుకొనినట్లే జరుగునని లంగరును ఎత్తి వీలైనంత సమీపముగా క్రీటు దీవి తీరము వెంబడి ఓడ ప్రయాణము కావించిరి.

14. కాని త్వరలోనే ‘ఈశాన్య పవనము’ అను ఒక పెద్ద సుడిగాలి వీచసాగెను.

15. అది ఓడకు తీవ్రముగా తగులుటచే ఆ ఓడ గాలిలో చొచ్చుకొని ముందుకు పోవ సాధ్యపడక పోయెను. అందుచే మేము మా ప్రయత్నమును విరమించి గాలి వాలుకు ఓడను వదలివేసితిమి.

16. అట్లు మేము ‘కౌదా’ అను చిన్న ద్వీపము చాటునకు చేరితిమి. అచ్చట ఓడకుగల పడవను అతి కష్టముతో భద్రపర్చ గలిగితిమి.

17. వారు దానిని ఓడపైకి లాగి, ఓడను గట్టిగా త్రాళ్లతో బంధించిరి. సూర్తిసు ఇసుక దిబ్బలకు కొట్టుకొందు మేమో అని భయపడిరి. వారు తెర చాపలను దింపి వేసి, ఓడను గాలికి కొట్టుకొని పోవ వదలివేసిరి.

18. తుఫాను గాలి కొనసాగుటచే, ఆ మరుసటి దినమున వారు ఓడలోని సరకులను సముద్రములో పడవేసిరి. 19.  మరునాడు  వారు  ఓడ సామగ్రిని కూడ  చేతులార  నీటిపాలు  కావించిరి. 

20. చాలరోజుల వరకు సూర్యుడుగాని, నక్షత్రములుగాని కనిపింపలేదు. గాలి తీవ్రముగా వీచుచునే ఉండెను. చిట్టచివరకు ప్రాణములు దక్కించు కొనగలము అను ఆశను గూడ వదలుకొంటిమి.

21. ఎంతోకాలము వారు ఆహారము భుజింప కుండినందున, పౌలు లేచి, వారి ఎదుట నిలువబడి, ”ప్రజలారా! నేను చెప్పినట్లుగ మీరు విని, క్రీటు దీవి నుండి ఓడ ప్రయాణము చేయకుండిన యెడల, మనము ఈ కష్టనష్టముల నుండి తప్పించుకొని ఉండెడివారము.

22. అయినను ఇప్పుడు ధైర్యముగా ఉండుడని నేను కోరుచున్నాను. ఓడ నష్టము తప్ప మీలో ఎవరికిని ప్రాణనష్టము కలుగదు.

23. ఏలయన నేను ఎవరికి చెందినవాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత, గతరాత్రి నా చెంతకు వచ్చి, 24. ‘పౌలు!  నీవు భయపడవలదు. నీవు చక్రవర్తి ఎదుట నిలువబడవలసియున్నది. అందుచే దయామయుడగు దేవుడు, నీతో కూడ ఓడ ప్రయాణము చేయుచున్న వారి ప్రాణములను నీకు అనుగ్రహించియున్నాడు’ అని తెలియపలికెను.

25. కనుక ప్రజలారా! ధైర్యముగా ఉండుడు. ఏలయన నాకు చెప్పబడినట్లు జరుగునని దేవునియందు నాకు నమ్మకము ఉన్నది.

26. కాని మనము ఒక దీవి దరికి కొట్టుకొనిపోవలసి ఉన్నది” అని పలికెను.

27. పదునాలుగవ నాటి రాత్రికి మేము తుఫాను గాలిచే అద్రియ సముద్రమునందు కొట్టుకొని పోవు చుంటిమి. ఇంచుమించు అర్ధరాత్రి సమయమునకు మేము ఒక భూమి చేరువకు చేరుకొనుచున్నట్లు నావికులు గ్రహించిరి. 28. అందుచే వారు, లోతు తెలిసికొనుటకై బరువును కట్టిన ఒక త్రాటిని నీటిలోనికి జారవిడిచి, అచ్చట నీటిలోతు నూటయిరువది అడుగులున్నదని కనుగొనిరి. మరికొంత దూరము పోయిన పిదప వారు అట్లే చేసి, తొంబది అడుగుల లోతున్నదని తెలిసికొనిరి.

29. తమ ఓడ రాతి గుట్టలకు కొట్టుకొనునేమో అని వారు భయపడిరి. అందుచే వారు ఓడ వెనుక భాగము నుండి నాలుగు లంగరులను దింపి, ప్రొద్దు పొడుపునకై ప్రార్థించిరి.

30. నావికులు తప్పించుకొన ప్రయత్నించుచు, పడవను నీటిలోనికి దింపుచు, ఓడ ముందు భాగము నుండి లంగరును వేయుచున్నట్లు నించిరి.

31. పౌలు అది కనిపెట్టి శతాధిపతితో, సైనికులతో, ”ఈ నావికులు ఓడపై నుండక పోయినచో మీరు రక్షింప బడలేరు” అని హెచ్చరిక చేసెను.

32. అందుచే సైనికులు పడవకు కట్టిన త్రాళ్లను కోసివేసి దానిని నీటిలో పడనిచ్చిరి.

33. తెల్లవారుచుండగా భుజింపుడని పౌలు వారిని ఇట్లు బతిమాలెను: ”మీరు పదునాలుగు రోజుల నుండి నిరీక్షించుచు ఇప్పటి వరకు ఏమియు భుజింప లేదు.

34. కనుక ఇప్పుడైన మీరు భుజింపవలెను. మీకు బలము కలుగును. మీ తలవెంట్రుకలలో ఒకటైనను రాలిపోదు”  35. అని చెప్పి పౌలు రొట్టెను తీసికొని వారందరి ముందు దేవునికి స్తోత్రములు సమర్పించి, దానిని త్రుంచి భుజింపసాగెను.

36. వారందరును ధైర్యమును తెచ్చుకొని భుజించిరి. 

37. ఓడలో మొత్తము రెండు వందల డెబ్బది ఆరు మందిమి ఉంటిమి.

38. అందరు చాలినంత  భుజించిన  పిదప  ఓడలోని గోధుమలను సముద్రములో పారబోసి ఓడను తేలిక చేసిరి.

ఓడ బ్రద్దలగుట

39. తెల్లవారిన పిదప వారికి ఒక ఒడ్డు కనబడెను. కాని అది ఏ తీరమో వారు గుర్తు పట్టలేకపోయిరి. ఆ ఒడ్డు వెంబడి ఒక సముద్రపు పాయను చూచి, సాధ్యమైనచో ఓడను అటు తీరము చేర్చవలెనని నిర్ణయించుకొనిరి. 40. అందుచే వారు లంగరును త్రెంచి, దానిని నీటిలో వదలివేసి, అదే సమయములో చుక్కాని దండెమునకు కట్టబడియున్న త్రాళ్లను విప్పివేసిరి. పిదప వారు ఓడ ముందు భాగమున ఉన్న తెరచాపను పైకెత్తినందుచే గాలివీచగా, ఓడ ముందుకు సాగి తీరమును చేరుటకు వీలు పడెను.

41. రెండు ప్రవాహములు కలిసినచోట ఆ ఓడ ఒక ఇసుక దిబ్బయొద్దకు కొట్టుకొనిపోయి ఇసుకలో దిగబడెను. అట్లు ఓడ ముందుభాగము ఇసుకలో కూరుకొని పోవుటచే వెనుక భాగము అలల ధాటికి ముక్కచెక్కలయ్యెను.

42. బందీలు ఒడ్డునకు ఈదుకొని పారిపోవుదురని ఊహించి, ఆ సైనికులు వారిని చంపదలచిరి.

43. కాని ఆ శతాధిపతి పౌలును రక్షింపగోరి వారిని అట్లు చేయవలదని వారించెను. దానికి బదులు ఈద గలిగిన వారు మొదట ఓడ నుండి  దుమికి తీరమును చేరవలెనని ఆజ్ఞాపించెను.     

44. మిగిలిన వారిలో కొందరు చెక్కలపై, మరికొందరు విరిగిపోయిన ఓడ భాగములపై ఒడ్డునకు పోవలెననెను. ఈ విధముగా చేసి మేము అందరము  క్షేమముగా ఒక తీరమును చేరితిమి.