అబ్రహాము – అబీమెలెకు
1. అక్కడినుండి అబ్రహాము విడుదులు చేయుచు నేగేబునకు వెళ్ళెను. అతడు కాదేషునకు, షూరునకు నడుమనున్న గెరారులో స్థిరపడి పరదేశివలె బ్రతుకుచుండెను.
2. అతడు తన భార్యయైన సారాను తన చెల్లెలని చెప్పుకొనెను. అందుచేత గెరారురాజు అబీమెలెకు సారాను రప్పించి తన అంతఃపురమున చేర్చుకొనెను.
3. కాని దేవుడు రాత్రి అబీమెలెకునకు కలలో కనబడి ”నీవు దగ్గరకు చేర్చిన ఈ స్త్రీ కారణ ముగా చత్తువు. ఆమె వివాహిత” అని చెప్పెను.
4. కాని అబీమెలెకు ఆమె చెంతకు పోలేదు. కనుక అతడు దేవునితో ”ప్రభూ! నిర్దోషులగు జనులను నాశనము చేయుదువా?
5. అతడు తనకుతానే ‘ఈమె నా చెల్లెలని చెప్పలేదా?’ ఆమె కూడ ‘అతడు నా సోదరుడని చెప్పలేదా?’ నిర్మలహృదయముతో ఈ పనిచేసితిని” అనెను.
6. కలలో దేవుడు అతనితో ”నిజమే! నిర్మలహృదయముతోనే నీవు ఈ పని చేసితివని యెరుగుదును. నాకు వ్యతిరేకముగా పాపము చేయకుండ నిన్ను అడ్డగించినది నేనే. కావుననే నిన్ను ఆమెను తాకనీయలేదు.
7. నీవు వెంటనే అతని భార్యనతనికి అప్పగింపుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు దేవునకు విన్నపములు చేయును. నీవు బ్రతుకుదువు. కాని నీవామెను తిరిగి పంపకున్న నీకు చావుతప్పదు. నీవే కాదు నీ వారందరును చత్తురు” అని చెప్పెను.
8. అందుచేత అబీమెలెకు తెల్లవారకముందే లేచి సేవకులందరను పిలిపించి, వారికి జరిగినదంతయు పూసగ్రుచ్చినట్లు చెప్పెను. వారందరు మిక్కిలి భయ పడిరి.
9. అంతట అబీమెలెకు అబ్రహామును పిలిపించి ”మాకు ఇంతపని చేసితివేల? నీకు నేను ఏ అపకారము చేసియెరుగను. నీవు మాత్రము నాకును నా రాజ్య మునకును మహాపాతకమును అంటగ్టితివి. చేయ రాని పనిచేసితివికదా!
10. ఇంతపనిచేసి నీవేమి లాభము పొందితివి?” అని అడిగెను.
11. అంతట అబ్రహాము ”ఈ రాజ్యమున దైవభీతిలేదు. వీరు నా భార్యను ఆశించి నన్ను చంపుదురనుకొని ఈ పని చేసితిని.
12. అదియును గాక ఈమె నిజముగా నా సోదరియే. ఆమె మా తండ్రికుమార్తెయేకాని మా తల్లికుమార్తెకాదు. ఆమె నాకు భార్య అయినది.1
13. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లువదలి దేశములు ప్టి పొమ్మన్నప్పుడు నేనామెతో ‘నీవు నాయందు కరుణకలిగి నేరవేర్పవలసిన విధి యొకిఉన్నది. మనమువెళ్ళిన యెల్లచోట్ల నేను నీ సోదరుడనని చెప్పుము’ అంిని” అని అనెను.
14. అప్పుడు అబీమెలెకు గొఱ్ఱెలను, గొడ్లను, దాసదాసీ జనమును రప్పించి అబ్రహామునకు కానుకగా ఇచ్చెను. సారాను గూడ తిరిగి అతనికి అప్పగించెను.
15. అబీమెలెకు అబ్రహాముతో ”ఇదిగో! నా ఈ దేశమంతయు నీ కళ్ళకు గ్టినట్లు ఉన్నదిగదా! ఇక్కడ నీకు మనసు నచ్చినచోట కాపురముండుము” అనెను.
16. అతడు సారాతో ”నేను నీ సోదరునకు వేయి వెండినాణెములిచ్చితిని. కావున మీ జనులెవ్వరును జరిగిపోయిన ఈ పనిని ప్టించుకొనరు. నీవును పూర్తిగా దోషమునుండి విముక్తి చెందెదవు” అనెను.
17. అపుడు అబ్రహాము దేవుని ప్రార్థించెను. దేవుడు అబీమెలెకును, అతని భార్యను, దాసీకన్యలను బాగుచేసెను. వారు బిడ్డలను కనిరి.
18. ఇంతకు ముందు అబ్రహాము భార్యయగు సారాను కాపాడనెంచి దేవుడు అబీమెలెకు ఇంిలో నున్న ప్రతి గర్భమును మూసివేసెను.