రాతినుండి నీరు పుట్టుట
1. యిస్రాయేలీయులెల్ల యావే ఆజ్ఞ ప్రకార ముగా సీను అరణ్యమునగల విడుదులు ఎత్తివేసి ముందుకుసాగిపోయిరి. వారు రెఫీదీమువద్ద దిగిరి. అక్కడ వారికి త్రాగుటకు నీళ్ళు దొరకలేదు.
2. వారు మోషేతో జగడమాడిరి. ”త్రాగుటకు నీరు చూపుము” అని అతనితో అనిరి. మోషే వారితో ”మీరు నాతో జగడమాడనేల? యావేను పరీక్షింపనేల?” అనెను.
3. దప్పికచే అల్లాడిపోవుచు ఆ ప్రజలు మోషే మీద నేరము మోపిరి. వారు అతనితో ”ఐగుప్తుదేశమునుండి మమ్మేల తోడ్కొని వచ్చితివి? మమ్ములను చంపుటకా? ఇక్కడ మేమును, మా పిల్లలును, పశువులు, దప్పికచే చచ్చిపోవలయునా! ఏమి?” అనిరి.
4. మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు ”నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదును? ఇంక కొంతసేపున్నచో వారు నన్ను రాళ్ళతో కొట్టుదురు” అనెను.
5. అంతట యావే మోషేతో ”నీతోపాటు యిస్రాయేలు పెద్దలను కొంత మందిని తీసికొని ఈ ప్రజకు ముందుగా నడచి పొమ్ము. నీవు నదిని క్టొిన కఱ్ఱను చేతప్టి వెళ్ళుము.
6. నీవు చూచుచుండగనే నేను హోరేబుకొండల రాతి మీద నిలబడెదను. నీవు కఱ్ఱతో ఆ రాతిని కొట్టుము. వీరందరు త్రాగుటకు రాతినుండి నీరుపుట్టును” అనెను. యిస్రాయేలీయుల పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేసెను.
7. యిస్రాయేలీ యులు జగడమాడుటచేతను, వారు యావే మనతో పాటు ఉన్నాడా? లేడా? అని సందేహించుచు యావేను పరీక్షించుటచేతను, ఆ చోికి ‘మస్సా’1 అని ‘మెరీబా’2 అని పేర్లు వచ్చెను.”
అమాలెకీయులతో యుద్ధము
8. రెఫీదీముదగ్గర అమాలెకీయులు యిస్రాయేలీ యులతో యుద్ధముచేసిరి.
9. అంతట మోషే యెహోషువతో, ”నీవు తగినవీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలెకీయులతో యుద్ధము చేయవెళ్ళుము. నేను దైవదండము చేతప్టి కొండకొమ్మున నిలిచెదను” అని చెప్పెను.
10. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలెకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే, అహరోను, హూరు కొండమీదికి వెళ్ళిరి.
11. మోషే చేతులుఎత్తినంతసేపు యుద్ధములో యిస్రా యేలీయులదే పైచేయిగానుండెను. మోషే చేతులు దింపినపుడు అమాలెకీయులు గెలిచిరి.
12. మోషే చేతులు బరువెక్కెను. అంతట అహరోను, హూరు ఒకరాతిని తెచ్చివేసితిరి, మోషే దానిమీద కూర్చుండెను. అహరోను, హూరు చెరియొకవైపు నిలబడి మోషే చేతులను ఎత్తిపట్టుకొనిరి. ప్రొద్దుగూకు వరకు అవియట్లే నిలచెను.
13. యెహోషువ అమాలెకు బలగమును తన కత్తి పదునుకు బలిచేసెను.
14. అపుడు యావే ”ఈ యుద్ధము చిరస్మరణీయముగా ఉండుటకై గ్రంథమున వ్రాసియుంచుము. నేను అమాలెకు అడ పొడ కానరాకుండ చేయుదునని యెహోషువతో చెప్పుము” అనెను.
15. అంతట మోషే ఒక బలిపీఠమును నిర్మించి దానికి ”యావే నాధ్వజము” అను పేరుపెట్టెను.
16. అతడు ”యావే ధ్వజమును చేతబట్టుడు. యుగయుగములవరకు యావే అమాలెకుతో యుద్ధముచేయును” అనెను.