1. జనసంఖ్య
1 1. యిస్రాయేలీయులు ఐగుప్తు వీడివచ్చిన రెండవ యేట రెండవనెల మొదిరోజున సీనాయి ఎడారిసీమ యందు దేవుడైన యావే సాన్నిధ్యపు గుడారమున మోషేతో మ్లాడుచు ఇట్లనెను.
2. ”యిస్రాయేలు సమాజముయొక్క జనసంఖ్య వ్రాయింపుము. తెగల వారిగా, వంశములవారిగా మగవారినందరిని గణింపుము.
3. నీవు అహరోను కలిసి ఇరువది యేండ్లు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారినందరిని లెక్కింపుడు.
4. కనుక ప్రతితెగనుండి కుటుంబపు పెద్దనొకనిని ఎన్నుకొనుము.
5-15. అటుల ఎన్నుకొనవలసిన వారి పేర్లివి.
జనాభా నాయకులు
రూబేను తెగనుండి షెదేయూరు కుమారుడు ఎలీసూరు;
షిమ్యోను తెగనుండి సూరీషద్దయి కుమారుడు షెలుమీయేలు;
యూదా తెగనుండి అమ్మినాదాబు కుమారుడు నహషోను;
యిస్సాఖారు తెగనుండి సూవారు కుమారుడు నెతనేలు;
సెబూలూను తెగనుండి హెలోను కుమారుడు ఎలీయాబు;
యోసేపు కుమారులగు ఎఫ్రాయీము తెగనుండి అమ్మీహూదు కుమారుడు ఎలీషామా;
మనష్షే తెగనుండి పెదాహ్సూరు కుమారుడు గమలీయేలు;
బెన్యామీను తెగ నుండి గిద్యోని కుమారుడు అబీదాను;
దాను తెగ నుండి అమ్మీషద్దయి కుమారుడు అహియెజెరు;
ఆషేరు తెగ నుండి ఓక్రాను కుమారుడు ఫగియేలు;
గాదు తెగ నుండి రవూయేలు కుమారుడు ఎలియాసాపు;
నఫ్తాలి తెగనుండి ఏనాను కుమారుడు అహీరా.”
16. వీరందరును యిస్రాయేలు సమాజమున పేరుమోసిన పెద్దలు. యిస్రాయేలు వంశములకు అధిపతులు, యిస్రాయేలు సైన్యములకు నాయకులు.
17-18. మోషే అహరోనులు పైనపేర్కొనిన పెద్దలను పిలిపించి, రెండవనెల మొదిరోజున యిస్రాయేలు సమాజమును సమావేశపరచిరి. ప్రజలందరిని వంశములవారిగా, కుటుంబముల వారిగా గణించిరి. ఇరువదియేండ్లు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారి పేర్లన్నియు నమోదుచేసిరి.
19. దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లే మోషే సీనాయి ఎడారియందు జన సంఖ్యను నిర్ణయించెను.
జనసంఖ్య
20-43. యాకోబు పెద్ద కుమారుడు రూబేను తెగతో ప్రారంభించి యిరువది యేండ్లకు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారిపేర్లన్నియు, వంశములవారిగా, తెగల వారిగా నమోదు చేయబడెను. అటుల నమోదు చేయబడినవారి సంఖ్య:
రూబేను తెగ నుండి 46,500;
షిమ్యోను తెగనుండి 59,300;
గాదు తెగనుండి 45,650;
యూదా తెగనుండి 74,600;
ఇస్సాఖారు తెగనుండి 54,400;
సెబూలూను తెగనుండి 57,400;
ఎఫ్రాయీము తెగనుండి 40,500;
మనష్షే తెగనుండి 32,200;
బెన్యామీను తెగనుండి 35,400;
దాను తెగనుండి 62,700;
ఆషేరు తెగనుండి 41,500;
నఫ్తాలి తెగనుండి 53,400;
44. మోషే, అహరోను, యిస్రాయేలుతెగల నుండి ఎన్నుకోబడిన పండ్రెండుగురు పెద్దలు కలిసి లిఖించిన సంఖ్యలివి.
45. ఇరువదియేండ్లు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారి పేర్లన్నియు వంశముల క్రమముగా లిఖింప బడెను.
46. వారి మొత్తము జనసంఖ్య ఆరులక్షల మూడువేల అయిదువందల ఏబది.
47. లేవీయులు మాత్రము పై లెక్కలో చేరలేదు.
లేవీయుల విధులు
48-49. దేవుడైన యావే మోషేతో ”లేవీయుల జనసంఖ్య వ్రాయవలదు. వారి పేర్లను నమోదు చేయవలదు. 50. సాక్ష ్యపుగుడారమును, దాని సామాగ్రిని కాపాడుటకు వారిని నియమింపుము. వారు గుడారమును దాని పరికరములను మోసికొని రావలెను. ఆ గుడారమున పరిచర్యచేయుచు దాని చుట్టు తమ గుడారములను కట్టుకోవలెను.
51. ప్రయాణము చేయవలసినపుడెల్ల లేవీయులే గుడార మును విప్పవలెను. గుడారమును మరల పన్నవలసి నపుడెల్ల లేవీయులే ఆ పనికి పూనుకోవలెను. అన్యు లెవరైన దానిచెంతకు వచ్చినయెడల ప్రాణములు కోల్పోవుదురు.
52. మిగిలిన యిస్రాయేలీయులందరు గుంపులు గుంపులుగ కూడి ఒక్కొక్కరు తన వర్గముతో తన జెండాతో గుడారములు నిర్మించుకోవలయును.
53. లేవీయులు మాత్రము సాక్ష ్యపు గుడారముచుట్టు తమ గుడారములు పాతుకోవలయును. అప్పుడు యిస్రాయేలీయులు ఎవరును నా గుడారము నొద్దకు రారు. నేను వారిమీద మండిపడను. లేవీయులే సాక్ష ్యపు గుడారమునకు కావలికాయువారు” అని చెప్పెను.
54. దేవుడైన యావే మోషేను ఆజ్ఞాపించినట్లే యిస్రాయేలీయులు ఎల్లపనులు చేసిరి.